రామరాజుకే ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని నిరసన తెలుపుతున్న టీడీపీ నాయకులు.
రాజమహేంద్రవరంలో పురందేశ్వరికి నిరసన సెగ
మిత్రపక్షాల సమన్వయ కమిటీ సమావేశంలో టీడీపీ నేతల ఆందోళన
ఫ్లెక్సీలో టీడీపీ నేత బొడ్డు వెంకటరమణ చౌదరి ఫొటో లేదని ఆగ్రహం
ఫ్లెక్సీ చించి రోడ్డుపై బైఠాయింపు.. స్తంభించిన ట్రాఫిక్
పురందేశ్వరి మౌనంపై బీజేపీ నేతల ఆగ్రహం ∙
ఇప్పటికే సోము వీర్రాజు వర్గం దూరం
నూజివీడులో టీడీపీ అభ్యర్థి పార్థసారథికి గుబులు
రెబల్ అభ్యర్థి ముద్దరబోయినకు జై కొట్టిన తెలుగుదేశం శ్రేణులు
ఉండి ఎమ్మెల్యే రామరాజు కంటతడి
సీటు వదులుకునేందుకు సిద్ధంగా లేనని స్పష్టీకరణ
సాక్షి, రాజమహేంద్రవరం/నూజివీడు/కాళ్ల: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో కుమ్ములాటల పర్వం కొనసాగుతోంది. తెలుగు సంవత్సరాది వేళా నిరసనల సెగ చల్లారలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి స్వపక్ష శ్రేణుల్లోనే విభేదాల అగ్గి రాజేస్తోంది. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలోని ద్వారకామాయి ఫంక్షన్ హాలులో సోమవారం రాత్రి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సమన్వయ సమావేశం రసాభాసగా మారింది. రాజమహేంద్రవరం బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఎంపికైన తరువాత తొలిసారి ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పురందేశ్వరి పాల్గొన్నారు.
సభా వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, పురందేశ్వరి, కూటమి రాజానగరం నియోజకవర్గ అభ్యర్థి, జనసేన నేత బత్తుల బలరామకృష్ణ ఫొటోలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీనిలో టీడీపీ రాజానగరం నియోజకవర్గ ఇన్‌చార్జి బొడ్డు వెంకట రమణ చౌదరి ఫొటో లేకపోవడంపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ కోసం సీటు త్యాగం చేసిన నేత ఫొటో ఎందుకు పెట్టలేదని పురందేశ్వరిని నిలదీస్తూ ఆ ఫ్లెక్సీని చించి పారేశారు.
ఫ్లెక్సీలో ఉన్న మోదీ ఫొటోనూ చించివేస్తున్నా వారిని వారించేందుకు పురందేశ్వరి కనీసం యత్నించకపోగా, చిరునవ్వులు చిందిస్తూ అలాగే వేదికపై కూర్చోవడం విమర్శలకు దారి తీసింది. ఆమె తీరుపై బీజేపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ శ్రేణుల నిరసనల నేపథ్యంలో ఫంక్షన్ హాలు నుంచి ఆమె మెల్లగా జారుకున్నారు. సాధారణంగా పార్టీ అగ్రనేతల ఫొటోలు, ఫ్లెక్సీలను ఎవరైనా చించితే నాయకులు, కార్యకర్తలు సహించలేరు. కానీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వైఖరి ఇందుకు భిన్నంగా ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
► పశ్చిమగోదావరి జిల్లా ఉండి సీటు మార్చే యోచనలో టీడీపీ అధిష్టానం ఉండటంతో ఎమ్మెల్యే మంతెన రామరాజు భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యారు. కాళ్ల మండలం పెదఅమిరం నిర్మలాదేవి ఫంక్షన్ హాలులో మంగళవారం నిర్వహించిన టీడీపీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. సమావేశంలో టీడీపీ నాయకులు స్పందిస్తూ.. ఉండి అభ్యర్థిని మారిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాజీనామాలకూ వెనుకాడబోమని స్పష్టం చేశారు.
సమావేశానికి పార్టీ పరిశీలకుడిగా వచ్చిన ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు సమక్షంలోనే వారు ఈ విషయాన్ని తేల్చిచెప్పడం గమనార్హం. ఎమ్మెల్యే మంతెన రామరాజు మాట్లాడుతూ.. తన సీటును వదులుకోవడానికి సిద్ధంగా లేనని స్పష్టం చేశారు. ఏ తప్పూ చేయకుండా త్యాగానికి సిద్ధం కావాలనడం న్యాయం కాదని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమాన్నీ విధిగా చేయడం తన తప్పా అని ప్రశ్నించారు. కార్యకర్తల నిర్ణయమే తనకు శిరో«దార్యమని, వేరే వ్యక్తికి సీటు కేటాయిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. పార్టీ నేతల అభిప్రాయాలను అధిష్టానం దృష్టికి తీసుకువెళతానని గన్ని వీరాంజనేయులు చెప్పారు.
తొలి నుంచీ పురందేశ్వరికి చుక్కెదురు
వాస్తవానికి ఎంపీ అభ్యర్థిగా ఎంపికైన పురందేశ్వరికి మొదటి నుంచీ ఇక్కడ చుక్కెదురవుతూనే ఉంది. రాజమహేంద్రవరం వచ్చిన వెంటనే ఆమె స్థానిక బీజేపీ నాయకులను కలుపుకొని వెళ్లాల్సింది పోయి.. వేరుకుంపటి పెట్టారు. పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజును పూర్తిగా పక్కన పెట్టారు. ఈ పరిణామం సోము వర్గంతోపాటు పార్టీ శ్రేణులను దూరం చేసింది. దీంతో సభలు, సమావేశాల్లో ఆమెకు నిరసనల సెగ ఎదురవుతూనే ఉంది.
అనపర్తి ఎమ్మెల్యే టికెట్‌ను తొలుత టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి కేటాయించి.. పొత్తు అనంతరం బీజేపీకి ఇవ్వడంపైనా టీడీపీ వర్గాల్లో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమైంది. అక్కడ ఎంపీ అభ్యర్థి పురందేశ్వరి, స్థానిక బీజేపీ నాయకులను వ్యతిరేకిస్తూ రామకృష్ణారెడ్డి స్వతంత్రంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయినా పురందేశ్వరి పెదవి విప్పకపోవడంపై ఆమె టీడీపీకి లాభం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఫ్లెక్సీలో ప్రధాని మోదీ ఫొటో చించుతున్నా స్పందించకపోవడం ఈ వాదనకు బలం చేకూరుస్తోందని బీజేపీ శ్రేణులు అంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment