సాక్షి, విజయవాడ: ఏపీలో పొత్తుల తక్కెడ తప్పుడు ప్రయోగంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. బీజేపీ - జనసేన - టీడీపీ కూటమిలో సీట్ల సర్దుబాటు విషయంలో సయోధ్య కుదరకపోగా విభేదాలు పొడసూపుతున్నాయి. ఇన్నాళ్లు పార్టీని నమ్ముకుని పని చేసిన వారికి కాకుండా పలు స్థానాల్లో కొత్త ముఖాలు తెరపైకి రావడం అగ్గి రాజేస్తోంది.
ఇప్పటివరకు జరిగిన చర్చలు, దాని తర్వాత బీజేపీ, టీడీపీ నాయకులు మీడియాతో మాట్లాడిన దాని ప్రకారం.. ఏపీలో వివిధ పార్లమెంటు సీట్లకు బీజేపీ పోటీ చేసే పేర్లు ఇలా ఉన్నాయి.
- అనకాపల్లి : సీఎం రమేష్
- అరకు: కొత్తపల్లి గీత
- రాజమండ్రి : పురందేశ్వరి
- ఏలూరు : సుజనా చౌదరీ
- హిందూపూర్ : పరిపూర్ణానంద
- రాజంపేట : కిరణ్ కుమార్ రెడ్డి
జనసేన
- మచిలీపట్నం: బాలశౌరి
- కాకినాడ : పవన్ కళ్యాణ్
అలాగే అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ నేతల పేర్లు ఇలా ఉన్నాయి.
- విశాఖ నార్త్ : విష్ణుకుమార్ రాజు
- జమ్మలమడుగు: ఆదినారాయణ రెడ్డి
- కదిరి : విష్ణువర్ధన్ రెడ్డి
- విజయవాడ సెంట్రల్ : యామిని
- చోడవరం/మాడుగుల : మాధవ్
- కైకలూరు: కామినేని శ్రీనివాస్
ఇక్కడ ప్రధానంగా చర్చ జరుగుతున్నది, స్థానిక బీజేపీ నేతలను ఇబ్బంది పెడుతున్న అంశం ఏంటంటే.. పైన ప్రచారంలోకి వచ్చిన పేర్లలో ఒరిజినల్ బిజెపి నేతలే లేరని క్షేత్ర స్థాయిలో గగ్గోలు మొదలైంది. బిజెపికి ఇచ్చిన ఆరు ఎంపీ సీట్లలో పోటీ చేసేది నలుగురు టిడిపి వాళ్లేనని ఆందోళన వ్యక్తమవుతోంది.
- తెలుగుదేశం నుంచి వచ్చింది : సీఎం రమేష్, సుజనా చౌదరి
- కాంగ్రెస్ నుంచి వచ్చింది : పురందేశ్వరి, కిరణ్ కుమార్ రెడ్డి
- ఇతర పార్టీ నుంచి వచ్చింది : కొత్తపల్లి గీత, పరిపూర్ణానంద
ఇన్నాళ్లు విశాఖను నమ్ముకుని పార్టీ కోసం తిరిగిన జీవీఎల్, రాజమండ్రిలో ప్రతీ చిన్న కార్యక్రమంలో కనిపించే సోము వీర్రాజుకు టిక్కెట్ దక్కే అవకాశాలు లేకపోవడం సగటు బీజేపీ కార్యకర్తలను విస్మయానికి గురి చేస్తోంది. విశాఖ నుంచి పోటీ చేసేందుకు జీవీఎల్ ఎప్పటి నుంచో ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో విశాఖలోనే ఇల్లు కొనుక్కొని గత రెండేళ్లుగా అక్కడే ఉంటూ పార్టీని బలోపేతం చేశారు. రాజమండ్రి లోక్‌సభ స్థానం ఆశించిన స్థానిక సీనియర్ నేత సోము వీర్రాజుది ఇదే పరిస్థితి. హిందూపూర్ లోక్‌సభ స్ధానం కోరిన విష్ణువర్దన్ రెడ్డికి కూడా హ్యాండిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
టీడీపీ ప్రయోజనాల కోసం బీజేపీ కీలక నేతలకి టిక్కెట్ లేకుండా చేశారని పురంధేశ్వరిపై బీజేపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. బీజేపీ గతంలో పోటీ చేసి గెలిచిన విశాఖ ఎంపీ సీటును పురందేశ్వరీ అడగకపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు.. బీజేపీ అగ్రనేతలతో నేడు పవన్ కల్యాణ్, చంద్రబాబు విజయవాడలోని నోవాటెల్‌లో మరోసారి భేటీ కానున్నారు. నిన్న జరిగిన భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో నేడు మరోసారి భేటీ అవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment