అన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించినా ఇంకా స్పష్టత కరువు
20కిపైగా ఎమ్మెల్యే, రెండు ఎంపీ స్థానాల్లో అభ్యర్థులను మార్చేందుకు ప్రయత్నాలు
నర్సాపురం ఎంపీ సీటుపై ఊహాగానాలు
ఆ సీటును బీజేపీ నుంచి వెనక్కి తీసుకుంటున్నారని ప్రచారం
రఘురామకృష్ణరాజు టీడీపీలో చేరికతో అయోమయం
ఏలూరు ఎంపీ అభ్యర్థిని మారుస్తున్నట్లు ప్రచారం
పలు సీట్లకు ప్రకటించిన అభ్యర్థులపైనా చంద్రబాబు పునరాలోచన
తలలు పట్టుకుంటున్న తమ్ముళ్లు
సాక్షి, అమరావతి: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమైతే కట్టాయి కానీ, ఆ మూడూ ఒక్కటిగా లేవు. పట్టుమని పది సీట్లు గెలుస్తామన్న నమ్మకం వాటికే లేదు. ఒంటరిగా పోటీ చేసే బలం ఒక్క పారీ్టకీ లేదు. అసలు ప్రజలకి ఆ పార్టీలపై నమ్మకమే లేదు. అయినా లేని బలాన్ని ఊహించుకుని ఎంత హడావుడి చేస్తున్నా ఆ కూటమిలో ఉన్న డొల్లతనం ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉంది. నానా ప్రయాసలు పడి సీట్ల సర్దుబాటు చేసుకున్నా, అతి కష్టం మీద 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినా మూడు పార్టీల్లో గందరగోళం కొనసాగుతూనే ఉంది.
తమదే సీటు అని అభ్యర్థులు ధైర్యంగా ముందుకెళ్లే పరిస్థితి ఒక్క చోటా లేదు. అందుకు తగ్గట్టుగానే జాబితాలు ప్రకటించాక పలు స్థానాల్లో అభ్యర్థులను మార్చారు. ఇంకా మారుస్తున్నా్నరు. సుమారు 50 నియోజకవర్గాల్లో తిరుగుబాట్లు, అసంతృప్తుల ఆందోళనలతో ఏ రోజున ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. సీట్లు ఖరారైనా అదే తుది నిర్ణయం కాదని టీడీపీ అధినేత చంద్రబాబే చెప్పారు.
మరికొన్ని ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో అభ్యర్థులను మార్చడానికి చంద్రబాబు కసరత్తు కూడా చేస్తున్నారు. 20కి పైగా ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చడానికి చంద్రబాబు చర్చలు జరుపుతుండడంతోపాటు ఆ నియోజకవర్గాల్లోని నేతలకు సంకేతాలు కూడా ఇచ్చారు. కీలకమైన రెండు, మూడు ఎంపీ స్థానాలపైనా తర్జనభర్జన పడుతున్నారు. బీజేపీ, జనసేన సీట్లు కూడా ఒకటి, రెండు మారే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. దీంతో కూటమిలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. చాలామంది అభ్యర్థులు అసలు ప్రచారం చేసుకోవాలా వద్దా అన్న మీమాంసలో పడిపోయారు.
నర్సాపురం ఎంపీ సీటుపై ఊహాగానాలు
ప్రధానంగా నర్సాపురం ఎంపీ స్థానంపై వస్తున్న రకరకాల ఊహాగానాలు కూటమిలో అయోమయాన్ని సృష్టించాయి. ఈ సీటును బీజేపీకి కేటాయించి, శ్రీనివాసవర్మను అభ్యర్థిగా ప్రకటించారు. అయితే ఇక్కడి నుంచి పోటీ చేయడానికి విశ్వప్రయత్నాలు చేసి విఫలమైన రఘురామకృష్ణరాజు ఇప్పటికీ ఆ సీటు తనదేని అంటున్నారు. బీజేపీ శ్రీనివాసవర్మను మార్చి రఘురామకు ఆ సీటు ఇస్తుందని కొద్దిరోజులు ప్రచారం జరిగింది. అయితే, రఘురామకృష్ణరాజు టీడీపీలో చేరడంతో అది జరిగే పని కాదని తేలిపోయింది.
బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జి సిద్ధార్థనాథ్‌సింగ్ నర్సాపురంలో తమ అభ్యర్థిని మార్చే అవకాశమే లేదని సోమవారం తేల్చి చెప్పేశారు. అయినా దీనిపై టీడీపీ నాయకులు ఇంకా రగడ సృష్టిస్తూనే ఉన్నారు. నర్సాపురం లోక్‌సభ స్థానాన్ని బీజేపీ నుంచి వెనక్కి తీసుకొని, ఏలూరు లోక్‌సభ స్థానం కేటాయిస్తారని, అప్పుడు రఘురామకృష్ణరాజు నర్సాపురం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
ఇందుకు తగ్గట్టుగానే ఏలూరు బీజేపీ సీటు ఆశించిన తపన ఫౌండేషన్‌కు చెందిన గారపాటి చౌదరి అక్కడ ప్రచారం చేసుకుంటున్నారు. ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్పై స్థానికంగా వస్తున్న వ్యతిరేకతతో ఆయన్ని మారుస్తారనే ప్రచారమూ దీనికి తోడైంది. మరోవైపు రఘురామకృష్ణరాజుకు ఉండి అసెంబ్లీ సీటు ఇవ్వకూడదంటూ అక్కడ టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఆయనకిస్తే తిరుగుబాటు చేస్తామని కూడా హెచ్చరించాయి. దీంతో నర్సాపురం, ఏలూరు లోక్‌సభ స్థానాల్లో కూటమి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
పాతపట్నం, శ్రీకాకుళంలో మార్పు తప్పదా?
పాతపట్నం, శ్రీకాకుళం సీట్లలో కూడా మార్పు తథ్యమని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆ రెండు స్థానాలకు అభ్యర్థులుగా ప్రకటించిన మామిడి గోవిందరావు, గొండు శంకర్‌పై కేడర్ నుంచి వ్యతిరేకత రావడంతో చంద్రబాబు మనసు మార్చుకున్నానని తెలుస్తోంది. పాతపట్నం సీటును మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణకి ఇస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు. శ్రీకాకుళం సీటుకు గుండా లక్ష్మీదేవి పేరును పరిశీలిస్తున్నారు. దీంతో ఇప్పటికే టికెట్లు వచ్చాయని అన్ని ఏర్పాట్లతో ప్రచారం చేసుకుంటున్న నేతలు ఏం చేయాలో తెలియక జుట్టు పీక్కుంటున్నారు.
మరోవైపు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి సీటుపైనా ప్రతిష్టంభన కొనసాగుతోంది. పొత్తులో బీజేపీకి వెళ్లిన ఈ సీటును తిరిగి టీడీపీకి ఇస్తారనే సమాచారంతో బీజేపీ స్థానిక నేతల్లో అయోమయం ఏర్పడింది. జనసేనకు కేటాయించిన యలమంచిలి, నర్సాపురం స్థానాల్లోనూ అభ్యర్థులు మారతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరికొన్ని స్థానాలపైనా జరుగుతున్న రకరకాల ప్రచారాలు మరింత గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment