గతేడాది జరిగిన ఐదు ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ చెప్పినదానికి వ్యతిరేకంగా ఫలితం
ప్రఖ్యాత జర్నలిస్టు కరణ్‌థాపర్ ఇంటర్వ్యూలో అడ్డంగా దొరికిపోయిన పీకే
ఈ ఎన్నికల్లో బీజేపీకి 300 లోక్‌సభ స్థానాలపైనా నిలదీసిన కరణ్
ఏపీలో టీడీపీ గెలుస్తుందని బాబు ప్యాకేజీ తీసుకుని చిలక జోస్యం
ఇక్కడా ఆయన అంచనాలు తప్పుతాయంటున్న విశ్లేషకులు
సాక్షి, అమరావతి: ఎన్నికల ఫలితాలపై ప్రశాంత్ కిశోర్(పీకే) అంచనా తప్పుతోంది. దానిని కప్పిపుచ్చుకునేందుకు ‘ది వైర్’ వెబ్‌సైట్, చానల్ కోసం ప్రఖ్యాత జర్నలిస్టు కరణ్‌థాపర్ చేసిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన ప్రయత్నాలన్నీ బెడిసి కొట్టాయి. హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీకి 2022 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని.. తెలంగాణ అసెంబ్లీకి 2023 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలుస్తుందని అప్పట్లో పీకే జోస్యం చెప్పారు. అయితే హిమాచల్‌ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చింది.
ఇదే అంశాన్ని కరణ్‌థాపర్ ఎత్తిచూపుతూ.. సార్వత్రిక ఎన్నికల్లో 300కు పైగా లోక్‌సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని ఏ ప్రాతిపదికన చెబుతున్నారని నిలదీశారు. దీనిపై పీకే స్పందిస్తూ తాను హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్, తెలంగాణలో బీఆర్‌ఎస్ గెలుస్తుందని చెప్పలేదని బుకాయించారు. కానీ అప్పట్లో పీకే చెప్పిన జోస్యంపై జాతీయ మీడియా సంస్థలు ప్రచురించిన వార్తల క్లిప్పింగ్‌లను కరణ్‌థాపర్ చూపడంతో ఆయన తెల్లబోయారు. పత్రికల్లో వచ్చే వార్తలకు విశ్వసనీయత ఉండదంటూ తప్పించుకునేందుకు యత్నించగా... ఇదే అంశంపై అప్పట్లో పీకే స్వయంగా చేసిన ట్వీట్లను ఎత్తిచూపారు. దీంతో అడ్డంగా దొరికిపోయిన పీకే ఉక్రోషంతో ఊగిపోయారు. మీరు జర్నలిస్టే కాదంటూ కరణ్‌థాపర్‌పై విరుచుకుపడ్డారు.
బిహార్‌లో రాజకీయాలు కలసి రాకే...
పశ్చిమ బంగా ఎన్నికల తర్వాత ఇక ఎన్నికల వ్యూహకర్తగా పని చేయబోనంటూ ప్రతిజ్ఞ చేసిన పీకే ఐప్యాక్ నుంచి తప్పుకున్నారు. బిహార్‌లో రాజకీయ అరంగేట్రం చేశారు. తొలుత బిహార్ సీఎం నితీష్‌కుమార్ పంచన చేరి జేడీ(యూ) కీలక నేతగా చలామణి అయ్యారు. కొన్నాళ్లకు ఆయనతో విభేదించి సొంత పార్టీ స్థాపించి బిహార్‌లో పాదయాత్ర చేశారు. దానివల్ల ఏమాత్రం ప్రయోజనం లేకపోవడంతో రాజకీయంగా ఇక మనుగడ సాగించలేమని తెలిసి డబ్బుల కోసం ఎవరు ప్యాకేజీ ఇస్తే వారికి అనుకూలంగా జోస్యం చెప్పడం అలవాటు చేసుకున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు పంచన చేరి ఆ పార్టీకి అనుకూలంగా జోస్యం చెబుతూ వస్తున్నారు.
ఏపీలోనూ ఆయన అంచనాలు తారుమారే
గతేడాది చివర్లో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం శాసనసభల ఎన్నికల్లోనూ పీకే జోస్యాలు చెప్పారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ గెలుస్తుందని ఆయన చెబితే కాంగ్రెస్ గెలిచింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ గెలుస్తుందని చెబితే ఆ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ అధికార పీఠం అధిష్టించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోనూ పీకే జోస్యం తప్పడం ఖాయమని, గత ఎన్నికల్లో టీడీపీ తరఫున వకాల్తా పుచ్చుకున్న లగడపాటి మాదిరిగానే ప్రశాంత్ కిశోర్ కూడా ఫలితాలు వెలువడ్డాక మాయం కావడం తథ్యమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
బాబు పలుకులే చెబుతూ..
ప్రశాంత్‌కిశోర్ ప్రస్తుతం ఏ పార్టీకీ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయడం లేదన్న మాటల్లో ఎంతమాత్రం నిజం లేదని పశ్చిమ బంగా సీఎం మమతా బెనర్జీ ఏప్రిల్ 12న ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టారు. ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ–బీజేపీ కూటమికి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్నారనీ, అందుకే ఏపీలో చంద్రబాబుకు, పశ్చిమ బంగాలో బీజేపీకి అనుకూలంగా జోస్యం చెబుతున్నారని ఆమె స్పష్టం చేశారు. దీనిని బట్టి చంద్రబాబు విసిరిన ప్యాకేజీ తీసుకుని టీడీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పీకే పనిచేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
అందుకే ఆయన బాబే గెలుస్తారంటూ అవకాశం వచ్చినప్పుడల్లా చెబుతున్నట్టు తేటతెల్లమైంది. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్టుతో భయపడిన నారా లోకేశ్ ఢిల్లీలో తలదాచుకున్న సమయంలో పీకేను కలిశారు. తమకు ఎన్నికల వ్యూహకర్తగా పని చేయాలని వేడుకున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు బెయిల్‌పై విడుదలయ్యాక పీకేను ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు, అక్కడి నుంచి విజయవాడకు సీఎం రమేష్ స్పెషల్ ఫ్లైట్‌లో తీసుకొచ్చారు. ఉండవల్లిలో చంద్రబాబుతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమయంలోనూ తాను ఏ పార్టీకీ వ్యూహకర్తగా పని చేయడం లేదని పీకే చెప్పిన విషయం
అబద్ధమని తరువాత అందరికీ తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment