Karanthapar
-
పీకేవన్నీ తప్పుడు అంచనాలే
సాక్షి, అమరావతి: ఎన్నికల ఫలితాలపై ప్రశాంత్ కిశోర్(పీకే) అంచనా తప్పుతోంది. దానిని కప్పిపుచ్చుకునేందుకు ‘ది వైర్’ వెబ్సైట్, చానల్ కోసం ప్రఖ్యాత జర్నలిస్టు కరణ్‌థాపర్ చేసిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన ప్రయత్నాలన్నీ బెడిసి కొట్టాయి. హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీకి 2022 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని.. తెలంగాణ అసెంబ్లీకి 2023 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని అప్పట్లో పీకే జోస్యం చెప్పారు. అయితే హిమాచల్‌ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చింది. ఇదే అంశాన్ని కరణ్‌థాపర్ ఎత్తిచూపుతూ.. సార్వత్రిక ఎన్నికల్లో 300కు పైగా లోక్‌సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని ఏ ప్రాతిపదికన చెబుతున్నారని నిలదీశారు. దీనిపై పీకే స్పందిస్తూ తాను హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్, తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పలేదని బుకాయించారు. కానీ అప్పట్లో పీకే చెప్పిన జోస్యంపై జాతీయ మీడియా సంస్థలు ప్రచురించిన వార్తల క్లిప్పింగ్‌లను కరణ్‌థాపర్ చూపడంతో ఆయన తెల్లబోయారు. పత్రికల్లో వచ్చే వార్తలకు విశ్వసనీయత ఉండదంటూ తప్పించుకునేందుకు యత్నించగా... ఇదే అంశంపై అప్పట్లో పీకే స్వయంగా చేసిన ట్వీట్లను ఎత్తిచూపారు. దీంతో అడ్డంగా దొరికిపోయిన పీకే ఉక్రోషంతో ఊగిపోయారు. మీరు జర్నలిస్టే కాదంటూ కరణ్‌థాపర్‌పై విరుచుకుపడ్డారు. బిహార్‌లో రాజకీయాలు కలసి రాకే... పశ్చిమ బంగా ఎన్నికల తర్వాత ఇక ఎన్నికల వ్యూహకర్తగా పని చేయబోనంటూ ప్రతిజ్ఞ చేసిన పీకే ఐప్యాక్ నుంచి తప్పుకున్నారు. బిహార్‌లో రాజకీయ అరంగేట్రం చేశారు. తొలుత బిహార్ సీఎం నితీష్‌కుమార్ పంచన చేరి జేడీ(యూ) కీలక నేతగా చలామణి అయ్యారు. కొన్నాళ్లకు ఆయనతో విభేదించి సొంత పార్టీ స్థాపించి బిహార్‌లో పాదయాత్ర చేశారు. దానివల్ల ఏమాత్రం ప్రయోజనం లేకపోవడంతో రాజకీయంగా ఇక మనుగడ సాగించలేమని తెలిసి డబ్బుల కోసం ఎవరు ప్యాకేజీ ఇస్తే వారికి అనుకూలంగా జోస్యం చెప్పడం అలవాటు చేసుకున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు పంచన చేరి ఆ పార్టీకి అనుకూలంగా జోస్యం చెబుతూ వస్తున్నారు. ఏపీలోనూ ఆయన అంచనాలు తారుమారే గతేడాది చివర్లో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం శాసనసభల ఎన్నికల్లోనూ పీకే జోస్యాలు చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుందని ఆయన చెబితే కాంగ్రెస్ గెలిచింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ గెలుస్తుందని చెబితే ఆ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ అధికార పీఠం అధిష్టించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోనూ పీకే జోస్యం తప్పడం ఖాయమని, గత ఎన్నికల్లో టీడీపీ తరఫున వకాల్తా పుచ్చుకున్న లగడపాటి మాదిరిగానే ప్రశాంత్ కిశోర్ కూడా ఫలితాలు వెలువడ్డాక మాయం కావడం తథ్యమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బాబు పలుకులే చెబుతూ..ప్రశాంత్‌కిశోర్ ప్రస్తుతం ఏ పార్టీకీ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయడం లేదన్న మాటల్లో ఎంతమాత్రం నిజం లేదని పశ్చిమ బంగా సీఎం మమతా బెనర్జీ ఏప్రిల్ 12న ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టారు. ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ–బీజేపీ కూటమికి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్నారనీ, అందుకే ఏపీలో చంద్రబాబుకు, పశ్చిమ బంగాలో బీజేపీకి అనుకూలంగా జోస్యం చెబుతున్నారని ఆమె స్పష్టం చేశారు. దీనిని బట్టి చంద్రబాబు విసిరిన ప్యాకేజీ తీసుకుని టీడీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పీకే పనిచేస్తున్నట్లు స్పష్టమవుతోంది. అందుకే ఆయన బాబే గెలుస్తారంటూ అవకాశం వచ్చినప్పుడల్లా చెబుతున్నట్టు తేటతెల్లమైంది. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్టుతో భయపడిన నారా లోకేశ్ ఢిల్లీలో తలదాచుకున్న సమయంలో పీకేను కలిశారు. తమకు ఎన్నికల వ్యూహకర్తగా పని చేయాలని వేడుకున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు బెయిల్‌పై విడుదలయ్యాక పీకేను ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు, అక్కడి నుంచి విజయవాడకు సీఎం రమేష్ స్పెషల్ ఫ్లైట్‌లో తీసుకొచ్చారు. ఉండవల్లిలో చంద్రబాబుతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమయంలోనూ తాను ఏ పార్టీకీ వ్యూహకర్తగా పని చేయడం లేదని పీకే చెప్పిన విషయం అబద్ధమని తరువాత అందరికీ తెలిసిందే. -
సైనిక జీవితం భయరహితమా?
ఆదిత్య హృదయం మనందరమూ దేశభక్తులమే. కానీ ఒక సైనికాధికారి కుమారుడిగా, ఆత్మగౌరవం కలిగిన, దృఢమైన ప్రజాస్వామ్య దేశంలో మన సాయుధ బలగాలు దేశ ప్రజల ప్రేమను పొందడానికి ప్రత్యేక హక్కును కలిగిలేవని చెప్పాలనుకుంటున్నాను. మనకు సేవచేసే నర్సులు, వైద్యులు, పూజారులు, మౌల్వీలు, రైతులు, కూలీలు వంటివారిని అభిమానించడం కంటే మన సైన్యాన్ని ప్రేమించడంలో ఉన్నత మనోభావాలకు తావుండదు. నిజానికి, మిలటరీ డ్రమ్ వాయిస్తూ, మనం ప్రత్యేకమైన వారమని, లేదా అలాంటి పని చేస్తున్నందుకు మనం ఇతరులకంటే అధికులమని భావించడమంటే అది ప్రజాస్వామ్య దేశంగా మన అపరిపక్వతనే ప్రతిబింబిస్తుంది. పైగా సైన్యం పేరుతో మన దేశంలో నానా చెత్తా మాట్లాడుతున్నారు. సైన్యంతో నాకు ప్రత్యేక బాంధవ్యం ఉన్నందువల్ల, సైన్యాన్ని గౌరవించడంలో నేనెవరికీ తీసిపోనందువల్ల, సైన్యం పట్ల ఈ వాగాండబరాన్ని సరిచేయవలసిన అవసరం ఉందనుకుంటున్నాను. నేను సైన్యాన్ని ప్రేమిస్తున్నాను కాబట్టే, దానిగురించిన అసందర్భ ప్రసంగాలతో నేను తలపడాలని భావిస్తున్నాను. బాలీవుడ్ నటి అనుష్క శర్మ ప్రసంగాన్ని చూపుతున్న ఒక వాట్సాప్ వీడియోను నేను ఇక్కడ ఉదాహరణగా చూపుతున్నాను. ఆడంబరంగా జిగేలుమంటున్న వేదికపై నిలుచుని ఆమె ఒక సైనికాధికారి బిడ్డగా ఉండటంలోని అనుభూతి గురించి మాట్లాడారు. దాంట్లో ఏమాత్రం తప్పు లేదు. కానీ ఆ వేదికమీద ఆమె చెప్పవలసి వచ్చిన మాటలు నాకు నవ్వు తెప్పించాయి. సైనికుల ఇళ్లు ఇతరుల ఇళ్లతో పోలిస్తే పూర్తి భిన్నంగా ఉంటాయని చెబుతూ అనుష్క తన ప్రసంగం ప్రారంభించారు. ఎందుకంటే సైనికుల ఇళ్లలో క్రమశిక్షణ రాజ్యమేలుతూ ఉంటుందట. అంటే సైనిక కుటుంబాల్లోని తల్లులు, తండ్రులు తమ పిల్లలను ఏ సందర్భంలోనూ పాడు చేయలేదని నేను భావించవచ్చా? ఆ కుటుంబాల్లో ప్రేమికులు, ప్రేయసిలు ఉండరా? అయినా, సైనికుల పిల్లలు ఏడవరా? వారు అబద్ధాలు అడరా లేక ఎవరినీ గిల్లరా? నాన్న యూనిఫాం ధరిస్తారు కనుక మనం ఇతరులకంటే విభిన్నంగా ఉంటామా? మనం చన్నీటి స్నానాలు, శారీరక వ్యాయామాలు, నిత్య కవాతులు వంటి ప్రత్యేక లక్షణాలతోటే పెరిగామా? ఇవేమీ కాదు. తనకే సొంతమైన కాల్పనిక పలాయనతత్వంలో అనుష్క శర్మ చిక్కుకుపోయారు. పైగా తమ భర్తలు, తండ్రులు యుధ్ధానికి వెళ్లేటప్పుడు వారి భార్యలు లేదా పిల్లలు ఎలా స్పందిస్తారనే అంశం విషయంలో ఆమె చక్కెర పూత పూసినట్లుగా మాట్లాడారు. సైనికుల తల్లులు దృఢంగా ఉంటారు. తమలోని ఉద్వేగాలను దాచిపెడతారు. ఆ విషయంలో వారు ప్రత్యేకమైన వారే అంటే నేను వ్యతిరేకించను. కానీ వారిలో జాతీయ స్ఫూర్తిని ఆసాంతం కుమ్మరించడం తప్ప.. వారిలో భయం ఉండదని, ఆందోళనలు వారి దరికి చేరవనే స్థాయిలో అనుష్క స్పందించారు. భారతీయ సైనికాధికారి చివరిసారిగా యుద్ధరంగానికి ఎప్పుడు వెళ్లాడు? ఆయన భార్యా పిల్లలు అనుష్క సూచించిన తరహా దేశభక్తికి చెందిన ఉద్వేగాన్ని ఎప్పుడు అనుభూతి చెందారు? కార్గిల్‌ని పూర్తిస్థాయి యుద్ధంగా భావించకుంటే మీరు 1971నాటి యుద్ధకాలానికి వెళ్లాలి. నేను పొరపాటు పడకపోతే అనుష్క ఆనాటికి బహశా జన్మించి ఉండరు. నేను అప్పుడు బోర్డింగ్ స్కూలులో చదువుతుండేవాడిని. కానీ యుద్ధం తలుపులు తట్టగానే మా ప్రపంచం ఒక్కసారిగా తల్లకిందులైంది. మనం కాస్త నిజాయితీగా ఉందాం. యుద్ధం సంభవించిన మరుక్షణం సైనిక హృదయాలు బద్దలవుతాయి. ఎందుకంటే తమ ప్రియతములు అత్యున్నత త్యాగానికి సిద్ధపడాల్సి ఉందనే ఎరుక సైనికుల భార్యలు, పిల్లలకు ప్రతి క్షణమూ అర్థమవుతుంది. రాబోయే చెడు వార్తను మోసుకొచ్చే టెలిగ్రాం లేక టెలిఫోన్ కోసం భయకంపితులవుతూ ప్రతి రోజూ, ప్రతి గంటా, ప్రతి క్షణం మీరు భయంతో జీవించాల్సి ఉంటుంది. నిజం చెప్పాలంటే భయంకరమైన యుద్ధ రంగంలో కాకుండా, సైన్యంలోనే మరొక క్షేమకరమైన డెస్క్ జాబ్‌లో నాన్న పనిచేస్తే బావుంటుందని మీరు భావించే క్షణాలు కూడా ఎదురవుతాయి. సైనిక కుటుంబాల మనోభావాలకు పూతమందు పూయడం సులభమే కానీ అది అవివేకం. పైగా ఏ సందర్భంలో అయినా అలా చేయడం తప్పే అవుతుంది. సమాజంలోని ఇతరుల కంటే వారు భిన్నమైన వారని మాయమాటలు చెబితే వారిని మీరు గౌరవించినట్లు కాదు. అది వారిని సమాజం నుంచి దూరం చేస్తుంది, ఎవరికీ లేని ప్రత్యేకతల్లోకి నెడుతుంది. అంతిమంగా వారిని అమానవీకరిస్తుంది. ఎందుకంటే సైనికుల కుటుంబ సభ్యులు కూడా మీకు లాగే నాకు మల్లే రక్తం చిందిస్తారు. వారు బాధలను, భయాన్ని అనుభూతి చెందుతారు. తమ ప్రియతముల నుంచి చాలాకాలం దూరమవుతారు. మన కంటే వారు ధైర్యంగా ఉండవచ్చు. కానీ వారిలోని సాధారణ మానవ లక్షణాలను మీరు గుర్తించ నిరాకరిస్తే వారిలోని గొప్పగుణాలను మీరు గౌరవించినట్లు కాదు. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : karanthapar@itvindia.net కరణ్ థాపర్ -
సైనిక సంప్రదాయాన్ని మార్చిన ‘బీటింగ్ రిట్రీట్’
ఆదిత్య హృదయం పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగం, ఎకనమిక్ సర్వే తర్వాత బీటింగ్ ద రిట్రీట్ (సైనిక సంరంభోత్సవం) గురించి తెలుసుకోవడానికి మీకు సమయం లేకపోతే, మీరు కోల్పోయింది ఏదీ లేదని నేను నొక్కి చెబుతాను. ప్రతి ఏడాదిలాగే ఈసారీ నేను దాన్ని తిలకించటానికి ప్రయత్నించాను కానీ పూర్తిగా అసంతృప్తి, ఆశాభంగం కలిగించింది. పైగా అసహ్యం వేసింది కూడా. బీటింగ్ ద రిట్రీట్ ఎప్పుడూ నాకు ఇష్టమైన కార్యక్రమంగా ఉంటూ వచ్చింది. ఇది ఏ ప్రమేయం లేకుండానే మనతో డ్యాన్స్ చేయించే సంగీతంతో, అత్యంత నిర్దిష్టమైన మార్చింగ్తో కూడిన సంరంభోత్సవం. కార్యక్రమం చివర్లో ప్రదర్శించే లేజర్ లైటింగ్ మిరిమిట్లు గొలుపుతుంది. కాని ఈ అన్ని అంశాల్లోనూ ఈ కార్యక్రమం ఈ సంవత్సరం ఘోరంగా తయారైంది. ఈ కార్యక్రమాన్ని మరింత మెరుగుపర్చామని భావిస్తున్న వ్యక్తులు నిజానికి దాని హృదయాన్ని తూట్లు పొడిచేశారు. నా స్నేహితుడు, బిజినెస్ స్టాండర్డ్ పత్రికలో స్ట్రాటెజిక్ ఎఫైర్స్ ఎడిటర్ కల్నల్ అజయ్ శుక్లా ఈ కార్యక్రమానికి సరిగ్గా సరిపోయే ‘ట్వీటింగ్ రిట్రీట్’ శీర్షికతో తన విచారాన్ని వ్యక్తం చేశారు. ‘సైనిక ఉత్సవానికి వీరేం చేశారో నాకు తెలీదు. డ్రమ్మర్ల డ్యాన్సింగ్, సితార్ ప్లేయర్లు, సంగీతం అన్నీ ఉన్నాయి కానీ మిలిటరీకి సంబంధించిన స్పృహ లేకుండా చేశారు. అర్థరహితమైన మార్పులతో ఒక గొప్ప సంప్రదాయాన్ని బలిపెట్టడానికి సైనికాధికారులు ఎలా అనుమతించారో చూస్తుంటే విచారమేస్తుంది!’ బాధ్యతారహితమైన మన సైనిక జనరల్స్ బీటింగ్ ద రిట్రీట్ ఒక సంప్రదాయమని, నిరంతర కొనసాగింపే దాని ఆత్మ అనే విషయాన్ని మర్చిపోయారు. పూర్తిగా పతనమయ్యే స్థాయికి దాన్ని మార్చేశారు. ఈ విశిష్ట సైనిక సంప్రదాయం 1690లో ప్రారంభమైంది. ఇంగ్లండ్ చక్రవర్తి జేమ్స్–ఐఐ యుద్ధం ముగిసిన రోజు చివరలో సైనిక దళాలు వెనక్కు వచ్చే సందర్భంగా సైనిక వాయిద్యాలను మోగించాలని ఆదేశించాడు. కాబట్టి అది ఒక ముగింపుకు సంబంధించిన సమ్మేళనం. అంతిమ పరిణామానికి అది చిహ్నం. ఇది పూర్తిగా సైనిక సంరంభ కార్యక్రమం. శతాబ్దాలుగా బీటింగ్ ద రిట్రీట్ ఒక అత్యద్భుతమైన సంగీతం, అత్యంత నిర్దిష్టంగా సాగే మిలిటరీ డ్రిల్‌కు మారుపేరుగా ఉంటూ వస్తోంది. చక్కటి పొందికతో పాదాలను కదపడమే ఈ మ్యూజికల్ మార్చ్ విశేషం. విషాదమేమిటంటే, గత సోమవారం ఈ కార్యక్రమాన్ని భారతీయులే కంపోజ్ చేసి ఉండవచ్చు కానీ వాళ్లు అసలైన కవాతును మాత్రం చేయించలేదు. రెండు. ఈ కార్యక్రమం కోసం వాడే సంగీత వాయిద్యాలు సాంప్రదాయిక మిలిటరీ బ్యాండ్‌కు సంబంధించినవిగానే ఉండాలి. అందరూ ఇష్టపడే సితారకు ఈసారి వారు చోటు ఇవ్వలేదు. వచ్చే ఏడాదికి వారు షెహనాయ్‌ని పరిచయం చేస్తారా? మూడు. బ్యాండ్ తప్పకుండా సంగీతానికి అనుగుణంగా మార్చ్ చేయాలి లేదా డ్రిల్ చేయాలి. సమర్థవంతమైన డ్రమ్మింగ్ మెప్పించవచ్చు కానీ దాన్ని సరైన విధంగా మేళనం చేయలేదు. ఇలాంటి సంగీతంతో మీరు మార్చ్ చేయలేరు. పైగా జాజ్ సంగీ తాన్ని పరిచయం చేయడానికి చేసిన ప్రయత్నం అయితే మరీ అసంబద్ధంగా కనిపించింది. నేను 1960లు, 70లు, 80ల నాటి బీటింగ్ రిట్రీట్స్ను గుర్తు తెచ్చుకున్నాను. అవి శ్రోతలకు దిగ్భ్రమ కలిగించేవి. బ్యాండ్లు కూడా మేటి సంగీతంతో అలరించేవి. బాలీ వుడ్ అనుకరణలను పక్కనబెడితే సైనిక కవాతు నిజానికి అలాంటి ప్రభావం కలిగిస్తుంది మరి. చివరగా, సూర్యుడు దిగంతంలోకి జారుకుంటున్నవేళ, సాయంవేళ దీపకాంతులను ప్రతిబింబించేది. రైసినా హిల్స్ విద్యుద్దీపాలతో మెరిసిపోయేది. ప్రతి ఒక్కరూ ఆ క్షణం తీసుకువచ్చే ఆకస్మిక వాతావరణంతో ఉక్కిరిబిక్కిరి అయ్యేవారు. కానీ ఈ సంవత్సరం వారు లైటింగ్ కూడా మార్చేశారు. జాతీయ పతాక రంగులను ప్రతిబింబించే లైటింగ్‌లో దిగ్భ్రమ కలిగించే ప్రభావం లేకుండా పోయింది. కొత్త లైటింగ్ చీకటిలో మెప్పించవచ్చు కానీ సాయంత్రం ప్రారంభంలో అది కలిగించే ప్రభావం పెద్దగా ఉండదు. మీరు ఊహించే పతాకదశను ప్రదర్శించడంలో అది మిమ్మల్ని వంచిస్తుంది అంతే. కాని ‘అబైడ్ విత్ మి’, ‘సారే జహాసె అచ్ఛా’ గీతాలాపనతో వారు కాస్త దయ చూపినందుకు నేను కృతజ్ఞుడిని. వీటిని కూడా వారు ఉపసంహరిస్తారేమోనని నేను భావించాను. ఎందుకంటే మొదటి గీతం క్రిస్టియన్ కీర్తన. చివరి గీతాన్ని స్వరపర్చింది పాకిస్తాన్ సంస్థాపకులలో ఒకరు. ఈ సంవత్సరానికి మటుకు ఈ రెండూ బతికిపోయాయి మరి. మొత్తంగా నా అభిప్రాయం చాలా సరళమైంది. సంప్రదాయానికి విలువ ఇవ్వని దేశం తన గతాన్ని గౌరవించదు, పైగా అది విలువ ఇచ్చే జాతీయ మనోభావాలను కూడా పలుచన చేస్తుంది. ఈ ప్రపంచంలో ఎప్పటికీ మీరు మార్చకూడని కొన్ని విషయాలు ఉంటాయి. ప్రతి సంవత్సరం మీరు వాటిని అదేవిధంగా కొనసాగిస్తూ ఉండాలి. బీటింగ్ రిట్రీట్ అలాంటి అంశాల్లో ఒకటి. - కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : karanthapar@itvindia.net -
ఆ విధిని నెరవేర్చని ప్రభుత్వాలు ఎందుకు?
♦ ఆదిత్య హృదయం పద్మావత్ సినిమాను నిషేధించాలని బీజేపీ రాష్ట్రప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తిప్పికొట్టడంతో తాను శిక్షకు గురైనట్లు బీజేపీ భావిస్తుం డటం చూస్తుంటే నాకు ఆశ్చర్యం కలుగుతోంది. బీజేపీకి చెందిన 6 రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సినిమాపై సంపూర్ణ నిషేధాన్ని ప్రకటించాయి లేక ప్రతిపాదిం చాయి. ఇది రాజ్యాంగ విరుద్ధమని భావించిన సుప్రీంకోర్టు సిని మాను ఆయా రాష్ట్రాల్లో ప్రదర్శించాల్సిందిగా ఆదేశించింది. మరే రాష్ట్ర ప్రభుత్వమూ ఈ సినిమాపై నిషేధం విధించకూడదని కూడా ఆదేశించింది. ఇది కచ్చితంగా బీజేపీకి ఘోర పరాభవమే కాకుండా దాని రాజకీయ సంకట స్థితిని కూడా సూచిస్తుంది. పద్మావత్ సినిమాను ప్రదర్శనకు అనుమతిస్తే శాంతిభద్రతలకు భంగం కలుగుతుందని, తాము నియంత్రించలేమని బీజేపీ ప్రభుత్వాలు తొలి నుంచీ వాదిస్తూ వచ్చాయి. సినిమాను విడుదల చేస్తే కలిగే విపత్తును, హింసాత్మక స్థితిని ఎదుర్కొనడం కంటే నిషేధిస్తే సరిపోతుందని అవి భావించాయి. కానీ ఈ వాదన ఆమోదనీయం కాదు. ఎందుకంటే శాంతిభద్రతలను కాపాడటం ప్రభుత్వాల వాస్తవ బాధ్యతే కాకుండా వాటి ప్రాథమిక కర్తవ్యం కూడా. కాబట్టి ఇలాంటి వాదన ప్రభుత్వాల మెడకే చుట్టుకుంటుంది. రాజ్యాంగం ప్రకారం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అత్యున్నతమైన విలువ. శాంతిభద్రతలకు భంగం కలిగించేవారికి వ్యతిరేకంగా పౌరులను కాపాడవలసిన ప్రభుత్వ బాధ్యతను ఇది నిర్దేశిస్తుంది. పౌరుల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఎత్తిపట్టి, కాపాడడంలో తమ అసమర్థతను చాటిచెబుతూ, బీజేపీ ప్రభుత్వాలు తమ ప్రాథమిక విధినే తిరస్కరిస్తున్నాయి. వాస్తవానికి, తాము నిర్వర్తించాల్సిన విధిని నెరవేర్చలేకపోతే, ప్రభుత్వాలు రాజీనామా చేయాలి. సిని మాను ప్రదర్శించాలని, ప్రేక్షకులకు రక్షణ కల్పించాలని తాను ఆదేశిస్తున్నప్పుడు అలా చేయకుంటే రద్దు చేస్తానని న్యాయస్థానం బెదిరించకపోవచ్చు కానీ, ప్రభుత్వాలు తమ రాజ్యాంగ విధిని ఉల్లంఘిస్తున్నాయని మాత్రం గుర్తు చేయవచ్చు. హింసకు దారితీసే ఘటన.. దాని నిషేధానికి కారణం కాకూడదన్న అంశాన్ని బీజేపీ ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి. అయినా.. ఇతరులను చీకాకు పెట్టే, ఇబ్బందిపెట్టే హక్కు లేకుంటే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు ఇక అర్థం ఏమిటి? వాస్తవానికి హింసాప్రవృత్తిని అలవాటుగా చేసుకున్న వారు సాగించే దుర్మార్గ చర్యలకు, హింసకు వ్యతిరేకంగా వాక్ స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది. ప్రజాస్వామిక విలువలను ఎత్తిపట్టడానికే తప్ప, ఆ విలువలకు తిలోదకాలు ఇవ్వడానికి ప్రభుత్వాలను ఎన్నుకోరు కదా. విషాదకరంగా, పద్మావత్ సినిమాను ప్రదర్శించే స్థితి ఇప్పటికీ ఉన్నట్లు కనిపించడం లేదు. కర్ణి సేన ఇప్పటికీ చిత్ర పంపిణీదారులను, ప్రేక్షకులను బెదరగొట్టే పనులకు సిద్ధమవుతోంది. తెగించి సినిమాను ప్రదర్శిస్తే తమ థియేటర్లకు ఏం జరుగుతుందో అనే భయంతో చాలామంది పంపిణీదారులు పద్మావత్ సినిమాను ప్రదర్శించకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అలాగే చాలామంది ప్రేక్షకులు కూడా సినిమాకు దూరం కావచ్చు. నిజానికి, బీజేపీ తన రాజకీయనేతల పిరికితనం లేక మద్దతు ద్వారా కర్ణిసేన రాజ్యాంగ విరుద్ధమైన డిమాండ్లకు అనుకూలంగా వ్యవహరిస్తోంది. ఈ వివాదం మొదట్లోనే దృఢంగా స్పందించి ఉంటే కర్ణిసేన చర్యలకు అడ్డుకట్ట వేసి ఉండవచ్చు. కానీ అలా జరిగి ఉండలేదు. ఇప్పుడు, తీవ్ర అసమ్మతి లేక నిరసన నేప థ్యంలో శాంతిభద్రతలను అమలు చేయడం భారత్‌లో అంత సులువైన విషయం కాదని నేను ఒప్పుకుంటాను. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు మన స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు చాలా అరుదుగా విలువ ఇచ్చాయనే అభిప్రాయంతో కూడా నేను ఏకీభవిస్తాను. భారత్ గడ్డమీదికి చేరకముందే సల్మాన్ రష్దీ పుస్తకం ‘శాటనిక్ వెర్సెస్’ని నిషేధించాలని మన శ్రీమాన్ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నసమయంలో నిర్ణయించారు కదా మరి. అలాగే, పద్మావత్– పై పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ మొదట్లో ప్రదర్శించిన సందిగ్ధత కూడా బీజేపీ విచారకరమైన వైఖరికి ప్రతిరూపంగానే ఉండిందంటే సందేహమే లేదు. కాని ఇదంతా అతి పెద్ద సమస్యను ఎత్తి చూపుతుంది. మన రాజకీయనేతలు వారు ఎదుర్కొనే సవాళ్లకు ఎక్కువగా భయపడతారు కానీ వారిని ఎన్నుకున్న ప్రజల హక్కులు, స్వేచ్ఛలను పరిరక్షించడానికి బాధ్యత వహించరు. కాబట్టి, సుప్రీంకోర్టుకు అభినందనలు. దాని లోపాలు, అసంపూర్ణతలు, వైరుధ్యాలను పక్కనబెట్టి, ఈ ఉదంతంలో అది ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రాథమిక హక్కు అయిన వాక్ స్వేచ్ఛకు తన మద్దతును తెలియజేసింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశానికి రాజ స్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాల తక్షణ స్పందన ఏమంత ఆశాజనకంగా లేదు. సుప్రీం ఆదేశంపై సమీక్ష కోరతానని రాజస్థాన్ ప్రభుత్వం చెప్పగా, మధ్యప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టునే నిలదీసింది. హద్దుల్లేని ఈ తిరస్కారానికి సుప్రీంకోర్టు చరమగీతం పాడాల్సిన అవసరం ఉంది. ఉన్నత న్యాయస్థానం అతి త్వరలోనే దీనికి సిద్ధపడుతుందని నా విశ్వాసం. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు, ఈ–మెయిల్ : karanthapar@itvindia.net -
పేర్లు, పిలుపులలో అసమానులు
ఆదిత్య హృదయం ఇది క్రిస్మస్ పండుగ. ఇప్పుడు నేను ఇంగ్లండ్‌లో ఉంటూ బ్రిటిష్ సంప్రదాయం ప్రకారం ఖుషీగా ఉన్నాను. అది సంభాషణ కావచ్చు, తిండి తినడానికి ఉపయోగించే కత్తులూ, కఠార్లూ కావచ్చు, క్యూని పాటించడం లేదా ప్రశ్నిం చడంకావచ్చు... పబ్బులూ, పదాలతో ఆడుకోవడాలూ వంటి అన్నింటిలో బ్రిటిష్ పౌరులు తమ సంప్రదాయాలను తప్పకుండా పాటిస్తూంటారు. పురాతన గతంలోకి తొంగిచూస్తూ, వాటికి మార్మికత్వం ఆపాదిస్తూ, మరింత సంక్లిష్టంగా మారుస్తూనే ఆ సంప్రదాయాలను ఇప్పటికీ శ్రద్ధగా, కచ్చితంగా తాము పాటిస్తున్నామని చెబుతుంటారు. దీనికి సంబంధించి బ్రిటిష్ నామకరణ పద్ధతి ఒక అద్భుత చిత్రణను అందిస్తుంది. చిన్న ఉదాహరణతో చర్చను మొదలెడతాను. ఒకప్పుడు యోధుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి సర్ క్రిస్టియన్ హోదాలోకి మారతాడు కానీ అతడి భార్య మాత్రం మహిళకు చెందిన ఇంటిపేరునే కలిగి ఉంటుంది. కాబట్టే బ్రిటన్ పేర్లలో సర్ జార్జ్ ఉంటారు కానీ సర్ బ్రౌన్ ఉండరు. కానీ దీనికి కాస్త గందరగోళాన్ని చేర్చుతూ ఒక మహిళ లేడీ బ్రౌన్గానూ ఉండవచ్చు లేదా కొన్ని సందర్భాల్లో లేడీ సారాగా కూడా ఉండవచ్చు. ఏది సరైంది అనేది ఆమె పుట్టి పెరిగిన ప్రత్యేక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. లేడీ బ్రౌన్ స్పష్టంగా ఒక వీరయోధుడి భార్యగా ఉంటుంది. లేడీ సారా ఒక డ్యూక్, మార్క్యూస్ లేదా ఎర్ల్ కుమార్తె అవుతుంది. ఆమె గుర్తింపు భర్త పేరిట కాకుండా తండ్రి పేరుమీద వస్తుంది. కులీనుడిగా మారినప్పుడు మీరు ప్రభువు హోదాలోకి మారవచ్చు. ఇంకా కొంతమంది లార్డ్ క్రిస్టియన్ని ఇంటిపేరుగా పిలిచే సంపన్న ప్రభువర్గీయులు ఉన్నారు. కాకపోగా ఇది డ్యూక్ లేదా మార్క్యూస్ చిన్న కుమారుడిని పిలిచే సరైన పద్ధతి. పెద్ద కుమారుడు తండ్రి రెండో పేరుకు వారసుడై మర్యాదకోసం మార్క్యూస్గా మారతాడు. నిజానికి ఒక వ్యక్తి పేరు అతడి లేక ఆమె సొంతానిదా లేక పెళ్లి, వారసత్వం ఫలితంగా వచ్చిందా అని నిర్ధారించడంలో ఈ వ్యత్యాసాలు చాలా సంక్లిష్టంగా ఉంటాయి. అందుకే పేర్ల విషయంలో అత్యంత కచ్చితత్వం అవసరమవుతుంది. ఉదాహరణకు మేఘన్ మర్కెల్ అనే మహిళను వివాహం అయిన తర్వాత ఎలా పిలవాలి అనే విషయం నన్ను ఆలోచనలో పడేసింది. ఆమె ఎన్నటికీ రాకుమారి మేఘన్ కాలేదు. ఎందుకంటే ప్రిన్సెస్ క్రిస్టియన్ అనే పేరు రాజకుమారికి ఉద్దేశించినది. ఆమె ఒక రాజకుమారిగానే పుట్టి ఉంటుంది. మేఘన్ మాత్రం వివాహం ద్వారానే రాకుమారి అవుతుంది. అందుచేత ఆమె సరైన పేరు ప్రిన్సెస్ హెన్రీ ఆఫ్ వేల్స్ అవుతుంది. ఆ లెక్కన యువరాణి డయానా ఎన్నటికీ ఆమె నిజ నామం కాదు. ఎందుకంటే ఆమె రాచపుట్టుక పుట్టలేదు. ఆమె భర్త వేల్స్ యువరాజు కాబట్టి ఆమె వేల్స్ యువరాణి అవుతుంది. బ్రిటన్ రాజకుమారుడు విలియమ్స్ సతీమణి కేట్ విషయంలోనూ ఇదే నిజం. ఆమె వాస్తవానికి కేట్ యువరాణి కాదు. ఆమె అసలు హోదా ప్రిన్సెస్ విలియం ఆఫ్ వేల్స్ అన్నమాట. ఇçప్పుడు ఈ సరైన లేక అసలు పేర్లు కాస్త మోటుగా ఉన్నాయి కాబట్టి, విలియమ్ పెళ్లి సందర్భంగా బ్రిటన్ రాణి అతడికి డ్యూక్ ఆఫ్ కేంబ్రిడ్జి (కేంబ్రిడ్జ్ ప్రభువు) అనే హోదాను ప్రసాదించారు. అందుచేత, ఈ దంపతులను ఇప్పుడు హెచ్ఆర్హెచ్ (హిస్ రాయల్ హైనెస్, హర్ రాయల్ హైనెస్) ప్రిన్స్ విలియం అనీ, డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జ్ (కేంబ్రిడ్జ్ ప్రభుపత్ని) అని వ్యవహరిస్తారు. నిస్సందేహంగా ఇదే ప్రభువు హోదాని హెన్రీకి కూడా కట్టబెడతారు. కాబట్టి ఈ లెక్కన మేఘన్ యువరాణి హెన్రీ అనే పిలుపునకు నోచుకోదు కానీ ఎవరో ఒకరి ప్రభుపత్ని (డచ్చెస్)గా మారుతుంది. ఇదంతా మిమ్మల్ని అయోమయంలో, గందరగోళంలోనూ ముంచెత్తినట్లయితే, మీకు మంచి సాహచర్యం ఇస్తున్నట్లే మరి. యోధులు, వారి మహిళలను ఎలా ప్రస్తావిస్తారు అన్నది మినహాయిస్తే బ్రిటన్ పౌరులు సముద్రం వద్ద మాత్రం ఇప్పుడు అంతా సమానులుగానే ఉంటారు. కానీ కోర్టు, పార్లమెంటు, పురాతన పత్రికలు వంటి బ్రిటన్ వ్యవస్థలు మాత్రం ఈ పవిత్ర సంప్రదాయాలను కచ్చితంగా పాటిస్తుంటాయి. ఒక చివరి ఆసక్తికరమైన విషయం ఉంది. బ్రిటన్ పార్లమెంటులో ఎంపీలు ప్రతి ఒక్కరినీ గౌరవనీయులుగా సంబోధిస్తుంటారు. మరీ ప్రత్యేకించి ప్రతిపక్ష సభ్యుల విషయంలో ఈ సంబోధనలను తప్పనిసరిగా చేస్తుంటారు. ఇది భాషను మృదువుగా వాడటం కాకుండా వారి నిజమైన ఉద్దేశాన్ని తెలిపే స్వరాన్ని మాత్రమే సూచిస్తుంది. అందుకే ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ కాలేజీల వద్ద ఆగ్రహంతో కూడిన కాపలాదార్లు అక్కడి పచ్చికపై నడిచే డిగ్రీ స్టూడెంట్లపై ఆగ్రహంతో ఇలా అరుస్తుంటారు. ‘ఆ దిక్కుమాలిన పచ్చికనుంచి బయటకు రండి సర్!’. అలాగే సంప్రదాయానుసారం కాలేజీ సిబ్బంది కూడా డిగ్రీ స్టూడెంట్లను సర్ అనే గౌరవంగా పిలుస్తుంటారు. వారి ఉద్దేశం అది కాకపోయినా ఈ గౌరవపదం మాత్రం వాడుకలో కొనసాగుతోంది. క్రిస్మస్ శుభాకాంక్షలు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు, కరణ్ థాపర్ ఈ–మెయిల్ : karanthapar@itvindia.net -
కఠిన వైఖరే సరైన మార్గం!
రాజకీయవాదితో ప్రత్యేకించి గతంలో బీజేపీ సభ్యుడిగా ఉన్న వ్యక్తితో ఏకీభవించగలగడం కన్నా మించిన సంతోషం ఏముంటుంది? నిబంధనలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తూ, సభకు అంతరాయం కలిగించే పార్లమెంటు సభ్యులపై కఠినమైన క్రమశిక్షణను అమలు చేయాలంటూ ఉపరాష్ట్రపతి ఇచ్చిన పిలుపును బలపరుస్తూ ఈ కథనం రాస్తున్నాను. ఇటీవల చేసిన ఒక ప్రసంగంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సభామధ్యంలోకి దూసుకొచ్చే ఎంపీలను తక్షణం సస్పెండ్ చేయాలని పిలుపునిచ్చారు. ఇది అద్భుతమైన ఆలోచన. కానీ దీన్ని అమలు చేయాలంటే, కఠినంగా వ్యవహరించడమే కాకుండా తమ అధికారాన్ని ప్రబలంగా ఉపయోగించే గుణం కలిగిన స్పీకర్లు మనకు అవసరం. అయితే ప్రతి ఒక్కరికీ అలాంటి శక్తి ఉండదు. అంటే స్పీకర్ పదవికి మనం ఎంచుకోవాల్సిన వ్యక్తుల విషయంలో మరింత జాగ్రత్త వహించాలని దీనర్థం. కాస్సేపు బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్ లేక ఆస్ట్రేలియా ప్రతి నిధుల సభను గమనించండి. ఈ రెండు సభలకు చెందిన స్పీకర్లు క్రమశిక్షణను అమలుపర్చడంలో ప్రదర్శించే కఠిన వైఖరిని మీరు పరిశీలించవచ్చు. అక్కడ సభకు అంతరాయం కలిగించడాన్ని అలా పక్కనబెట్టండి.. పార్లమెంట్ సంప్రదాయాలకు విరుద్ధమైన భాషను వాడినా వారు సహించరు. గతంలో ప్రతిపక్ష నాయకుడు టోనీ అబ్బోట్ పట్ల అసభ్యకరమైన భాషను ప్రయోగించిన నాటి ఆస్ట్రేలియా ప్రధాని జూలియా గిల్లార్డ్ను క్షమాపణ చెప్పవలసిందిగా ఆ దేశ దిగువ సభ స్పీకర్ ఒత్తిడి చేసిన సందర్భాన్ని నేను ప్రత్యక్షంగా చూశాను. ప్రధాని స్పీకర్ ఆదేశానికి కట్టుబడకపోవడంతో ఆయన తన స్వరం పెంచి ఆమెను తీవ్రంగా మందలించారు. దాంతో మారుమాట లేకుండా ఆమె స్పీకర్ ఆదేశాన్ని పాటించారు. మన లోక్‌సభ స్పీకర్లు అలాంటి దృఢవైఖరిని ప్రదర్శించాలంటే వారి స్వాతంత్య్రానికి హామీ ఇవ్వడంతోపాటు, సభలో వారిని కొనసాగించే హామీని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రధానమంత్రికి లేదా అధికారంలో ఉన్న పార్టీ మెజారిటీకి తలవంచే స్పీకర్ కఠినంగా వ్యవహరించడానికి బదులు సులువుగా లోబడిపోతారు. ఈ విషయంలో మనం బ్రిటిష్ ప్రతినిధుల సభ పాటించే రెండో సంప్రదాయాన్ని అనుసరించాలి. ఒకసారి ఎంపికయ్యాక పార్లమెంటుకు తిరిగి ఎన్నికయ్యే హక్కుపై బ్రిటిష్ స్పీకర్‌కు హామీ ఉంటుంది. ఎంపీగా వారు తిరిగి ఎంపిక కావడం కోసం ఇతరులెవరూ ఆ స్థానంలో పోటీ చేయరు. పైగా ఇక పదవిలోంచి దిగిపోవాలని అతడు/ఆమె ఎంచుకునేంతవరకు స్పీకర్ తన పదవిలో కొనసాగుతూనే ఉంటారు. అందుకే బ్రిటిష్ స్పీకర్ జాన్ బెర్కౌ.. భారతీయ స్పీకర్లతో పోలిస్తే చాలా విభిన్నంగా కనిపిస్తారు. మరొక విషయం: పార్లమెంటు సభ్యులు సరిగా ప్రవర్తించకుంటే వారిని సభనుంచి బయటకు బలవంతంగా పంపించే అధికారం మన స్పీకర్లకు తప్పక ఉండాలి. కాన్బెర్రా (ఆస్ట్రేలియా)లో స్పీకర్ ఆదేశాలను ధిక్కరించి లేదా దాటవేసి పార్లమెంటరీయేతర అసభ్య వ్యాఖ్యలను చేస్తూ అంతరాయం కలిగించే ఎంపీలను, మంత్రులను సైతం చాంబర్ వదలి వెళ్లిపోవలసిందిగా స్పీకర్ ఆదేశిస్తారు. దాన్ని సభ్యులు తప్పక పాటిస్తారు కూడా. అవసరమైన ప్రతిసారీ విధించే తక్షణ శిక్షారూపం ఇది. కేవలం 20 నిమిషాల వ్యవధిలో మూడుసార్లు ఇలా స్పీకర్ ఆదేశించిన ఘటనను నేను స్వయంగా చూశాను. అర్ధగంట విరామం తర్వాత అలా సస్పెండ్ చేసిన ఎంపీని తిరిగి సభలోకి అనుమతిస్తారు. అయితే, ఇదంతా పార్లమెంట్ విశిష్ట ప్రాముఖ్యతను గుర్తించే ఎంపీలపైనే ఆధారపడి ఉంటుంది. అప్పుడు మాత్రమే సభ్యతగా వ్యవహరించాల్సిన అవసరాన్ని వారు గుర్తిస్తారు. ఇక్కడ కూడా ప్రధానంగా వారి వైఖరి మారవలసిన అవసరముంది. పార్లమెంటు ప్రాముఖ్యతను పునరుద్ధరించడానికి ఈ ప్రక్రియ ఇతోధికంగా సహాయపడుతుంది. ఈ రోజుల్లో పార్లమెంటు సంవత్సరానికి 70 రోజులు కూడా సమావేశం కావడం లేదు. గత పదేళ్ల కాలంలో సగటున 64 నుంచి 67 రోజులు మాత్రమే పార్లమెంటు నడుస్తోంది. అదే 1952–1972 మధ్యకాలంలో పార్లమెంట్ సమావేశాలు సంవత్సరానికి 128 నుంచి 132 రోజులపాటు జరిగాయి. ప్రస్తుత పార్లమెంట్ రికార్డు అయితే మరీ ఘోరంగా ఉంది. 2014లో లోక్‌సభ సమావేశాలు 55 రోజులు (రాజ్యసభ 52 రోజులు) జరిగితే, 2017లో ఇంతవరకు ఉభయ సభలూ కేవలం 48 రోజులు మాత్రమే సమావేశమయ్యాయి. అంతిమంగా మన పార్లమెంటు శుక్రవారం తిరిగి సమావేశమైంది. కానీ దాని ఎజెండాలో ఈ సమస్యలు కీలకంగా ఉన్నాయా అని నాకు ఆశ్చర్యం వేస్తుంటుంది. నిస్సందేహంగా కొద్దిమంది వ్యక్తులు నా ఆందోళనను పంచుకుంటారు కానీ మొత్తంగా సంస్థ విషయం ఏమిటి? ప్రభుత్వంలోనూ, ప్రతిపక్షంలోనూ ఉన్న మన ప్రముఖ రాజకీయ నేతల మాటేమిటి? వారి మౌనం ప్రతీకాత్మకమైనదేనా? వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : karanthapar@itvindia.net కరణ్ థాపర్ -
జయలలిత ఇక లేరు!
-
తలైవీ.. సెలవ్
తమిళ ప్రజల ‘అమ్మ’ జయలలిత అస్తమయం - శోకసంద్రంలో తమిళనాడు..రాష్ట్రమంతటా ఉద్రిక్తత - పరిస్థితిని ప్రధానికి వివరించిన వెంకయ్య - ఆస్పత్రి వేదికగా ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేల భేటీ -ముఖ్యమంత్రిగా పన్నీరు సెల్వం ప్రమాణ స్వీకారం, పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ! - అవాంఛనీయ ఘటనలక తావివ్వకుండా సెల్ నెట్వర్క్ నిలుపుదల - రాష్ట్ర సరిహద్దుల్లో ఎక్కడికక్కడ ఆగిపోయిన బస్సు సర్వీసులు - భద్రత దళాల గుప్పిట్లో రాష్ట్రం తమిళనాట ‘అమ్మ’ శకం ముగిసింది... విప్లవ నాయకి (పురచ్చి తలైవీ) విశ్రమించింది... 74 రోజులపాటు మృత్యువుతో పోరాడిన ధీర నాయకి దిగంతాలకు చేరింది... ‘పురచ్చి తలైవీ’గా కోట్లాది మంది గుండెల్లో కొలువైన తమిళనాడు సీఎం జయరాం జయలలిత(68) సోమవారం అర్ధరాత్రి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. తీవ్ర జ్వరం, డీహైడ్రేషన్‌తో సెప్టెంబర్ 22న ఆమె ఆసుపత్రిలో చేరారు. జయ కోలుకున్నారని, రేపోమాపో డిశ్చార్జి అవుతారని కొద్దిరోజుల క్రితమే వైద్యులు ప్రకటించారు. అయితే ఆదివారం రాత్రి గుండెపోటు రావడంతో పరిస్థితి విషమించింది. లండన్ నుంచి వచ్చిన రిచర్డ్‌తో సహా ఎయిమ్స్ వైద్యులు శాయశక్తులా ప్రయత్నించినా లాభం లేకపోయింది. చివరికి తీవ్ర ఉత్కంఠ మధ్య ‘అమ్మ ఇక లేరు’ అంటూ వైద్యులు ప్రకటించారు. దీంతో ‘అమ్మ’ అభిమానుల గుండెలు పగిలాయి. రోదనలు మిన్నంటారుు. ముందస్తు చర్యగా తమిళనాడు రాష్ట్రమంతటా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జయలలిత మృతిపట్ల రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరోవైపు రాష్ట్ర సీఎంగా పన్నీర్ సెల్వం, మరో 31 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అన్నాడీఎంకే పార్టీ నాయకత్వ బాధ్యతలు జయ నెచ్చెలి శశికళకు అప్పగించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత(68) సోమవారం అర్ధరాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ వార్త వినగానే ఏఐఏడీఎంకే నేతలు, కార్యకర్తలు, అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. రాష్ట్రం యావత్తూ శోకసంద్రంలో మునిగిపోరుుంది. కాగా, తమిళనాడు ముఖ్యమంత్రిగా సోమవారం అర్ధరాత్రి పన్నీర్ సెల్వం ప్రమాణ స్వీకారం చేశారు. జయలలిత జ్వరం, డీహైడ్రేషన్‌తో బాధపడుతూ సెప్టెంబర్ 22వ తేదీ అర్ధరాత్రి ఆమె చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకడంతో 74 రోజుల పాటు ఆమె చికిత్స పొందారు. మూడు వారాల క్రితం డిశ్చార్జ్ దశకు చేరుకున్న దశలో ఈనెల 4వ తేదీ సాయంత్రం అకస్మాత్తుగా గుండెపోటుకు గురికావడంతో రాష్ట్రమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. చికిత్సకు స్పందిస్తున్నారని అపోలో యాజమాన్యం ప్రకటించిన కొద్ది గంటలకే ఆమె ఇక లేరన్న వార్త వినాల్సివచ్చింది. అంతకు ముందు అమ్మకు ఏమైంది.. ఆమె ఆరోగ్యం ఎలా ఉందని చర్చించుకుంటున్న తరుణంలో ‘అమ్మ లేదిక’ అంటూ సోమవారం సాయంత్రం టీవీ మాధ్యమాల్లో వదంతులు ప్రసారం కావడంతో అన్నాడీఎంకే శ్రేణుల్లో ఆవేదన, ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పార్టీ శ్రేణులు అపోలో ఆసుపత్రి వద్ద బారికేడ్లను ఈడ్చి పారేసి లోపలకు చొరబడే ప్రయత్నం చేశారుు. మహిళా కార్యకర్తలు గుండెలవిసేలా రోదించారు. దుకాణలన్నీ మూతపడ్డారుు. పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ పతాకాన్ని అవనతం చేశారు. ఈ పరిస్థితిలో ‘వదంతులు నమ్మవద్దు.. అమ్మ చికిత్సకు స్పందిస్తున్నారు’ అంటూ అపోలో యాజమాన్యం ప్రకటించడంతో తిరిగి సాధారణ పరిస్థితి నెలకొంది. జయకు వైద్యం కొనసాగుతుండగానే మరో వైపు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఆసుపత్రిలో ఉదయం, రాత్రి రెండు దఫాలుగా సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ముఖ్యమంత్రిగా పన్నీరు సెల్వం, పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళకు పగ్గాలు అప్పగించే దిశగా పరిణామాలు మారిపోయారుు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితిని అనుకూలంగా మలుచుకునేందును బీజేపీ నేతలు సైతం రంగంలోకి దిగారు. రాత్రి పొద్దుపోయే దాకా చర్చలు, సమావేశాలు కొనసాగాయి. ఆసుపత్రి వద్ద అభిమానుల రోదనలు అమ్మ ఇకలేరని తెలియగానే రాష్ట్రమంతటా ఒకటే ఆందోళన. ఏఐఏడీఎంకే నేతలు, కార్యకర్తలు, అభిమానులంతా అపోలో ఆసుపత్రికి పరుగులు పెట్టారు. పరిస్థితిని ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. జయలలిత జ్వరం, డీహైడ్రేషన్‌తో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారని సెప్టెంబర్ 22వ తేదీ అర్ధరాత్రి అపోలో యాజమాన్యం ప్రకటించిన తరువాత.. ఈ 74 రోజుల కాలంలో ఆమె అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. అమ్మ ఆసుపత్రిలో చేరిన నాటి నుంచి అపోలో ముంగిటే గడుపుతున్న మహిళా కార్యకర్తల ముఖాల్లో విషాదఛాయలు అలుముకున్నారుు. కన్నీటి పర్యంతమవుతూ గుండెలవిసేలా రోదించారు. రోజంతా ఉత్కంఠ సోమవారం తెల్లవారుజామున ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితిపై ఒక అధికారిక బులిటెన్ విడుదల అవుతుందని అంతా ఉత్కంఠతో గడిపారు. ఇదే సమయంలో అపోలో ఆసుపత్రిలోని నర్సులను హడావుడిగా ఇంటికి పంపించేశారు. గవర్నర్ విద్యాసాగర్‌రావు ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఆపోలోకు చేరుకున్నారు. మంత్రులతో కొద్దిసేపు సమావేశమై రాజ్‌భవన్‌కు చేరుకున్న తర్వాత కూడా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అపోలో ఆసుపత్రి వైపునకు దారితీసే అన్ని మార్గాల్లో పోలీసులు బారికేడ్లు అడ్డుగా పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ పరిస్థితులు తలెత్తడంలో సిటీ బస్సులను నడిపేందుకు డ్రైవర్లు, కండక్టర్లు విముఖత చూపారు. తిరునెల్వేలీలో ప్రభుత్వ బస్సు అద్దాలను పగులగొట్టారు. ఎక్మో చికిత్స గుండెపోటుకు గురైన ముఖ్యమంత్రి జయలలితను ప్రత్యేక వార్డు నుంచి అత్యవసర వార్డుకు తరలించిన అపోలో వైద్యులు సోమవారం తెల్లవారుజామున శస్త్రచికిత్స చేసి ఎక్మో (ఎక్స్ ట్రాకోర్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్) అనే వైద్య పరికరాన్ని ఆమె గుండెకు అమర్చారు. ఈ పరికరం గుండె, శ్వాసకోస సమస్యలను అధిగమించేలా చేస్తుంది. ఆగిపోరుున గుండెను తిరిగి పనిచేరుుంచే సామర్థ్యం కలిగిన ఎక్మో పరికరాన్ని ఆమర్చినా పరిస్థితి అంతగా మెరుగుపడలేదు. సోమవారం తెల్లవారుజాము 3 గంటల సమయంలో యాంజియోగ్రామ్ కూడా చేశారు. ‘అమ్మ కోలుకోవాలని శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం.. ప్రజలు సైతం ఆమె కోసం ప్రార్థనలు చేయండి’ అంటూ అపోలో మేనేజింగ్ డెరైక్టర్ సంగీత రెడ్డి సోమవారం ట్వీట్ చేశారు. సర్వశక్తులూ ఒడ్డాం: డాక్టర్ రిచర్డ్ ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం కుదట పడేలా చేసేందుకు సర్వశక్తులూ ఒడ్డినట్లు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన లండన్ వైద్యుడు డాక్టర్ రిచర్డ్ సోమవారం తెలిపారు. లండన్‌లో ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ వైద్య శాస్త్రంలోని అన్నింటిని ఆమె కోసం వినియోగించామని, అరుుతే ఎవ్వరూ ఊహించని రీతిలో అకస్మాత్తుగా ఆమె గుండెపోటుకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మధ్యాహ్నం 12.20 గంటలకు ఢిల్లీ నుంచి ఐదుగురితో కూడిన ఎరుుమ్స్ వైద్యుల బృందం చెన్నైకి చేరుకుని చికిత్స ప్రారంభించింది. రాత్రి 11.30 గంటల అనంతరం వారు తిరిగి వెళ్లారు. అంతకు ముందు.. ముఖ్యమంత్రి జయలలిత కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీ వేర్వేరుగా ట్వీట్ చేశారు. జయ పరిస్థితిపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావుతో మాట్లాడారు. కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, పొన్ రాధాకృష్ణన్, పుదుచ్చేరీ గవర్నర్ కిరణ్‌బేడీ, తమిళ కాంగ్రెస్ అధ్యక్షులు తిరునావుక్కరసర్ అపోలోకు వచ్చి సీఎం క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారు. జయ కోలుకోవాలని ఆకాంక్షింస్తున్నట్లు డీఎంకే అధ్యక్షులు కరుణానిధి, కోశాధికారి స్టాలిన్ అన్నారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అత్యవసర సమావేశం ముఖ్యమంత్రి జయలలిత పరిస్థితి అంతకంతకూ విషమించిన నేపథ్యంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హుటాహుటిన చెన్నైకి చేరుకోవాలని ఆదివారం రాత్రే అందరికీ సమాచారం ఇచ్చారు. అపోలో ఆసుపత్రిలో శశికళకు కేటారుుంచిన గదికి సోమవారం ఉదయం 6 గంటలకు మంత్రులు పన్నీర్ సెల్వం, ఎడపాడి పళనిస్వామి వచ్చి ఆమెతో మాట్లాడారు. ఆ తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామమోహన్‌రావు, జైళ్ల శాఖ మాజీ అధికారి రామానుజం తదితరులు శశికళతో గంటపాటు సమావేశమయ్యారు. ఉదయం 11 గంటలకు మంత్రి పన్నీర్‌సెల్వం అధ్యక్షతన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సమావేశమై పలు విషయాలపై గంటన్నరపాటు చర్చించారు. పార్టీ శాసన సభాపక్ష నేతగా పన్నీర్‌సెల్వంవైపు మొగ్గు చూపినట్లు సమాచారం. పార్టీ ప్రధాన కార్యదర్శి గా శశికళను ఎన్నుకోవాలని కొందరు సూచించినట్లు తెలుస్తోంది. జయ ఆరోగ్యంపై మోదీకి వెంకయ్య సమాచారం తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితిపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రధాని నరేంద్ర మోదీకి సమాచారం ఇచ్చారు. సోమవారం రాత్రి వెంకయ్య నాయుడు అపోలోకు చేరుకుని వైద్యులతో మాట్లాడారు. తదుపరి మీడియాతో మాట్లాడకుండా మౌనంగా వెళ్లి పోయారు. కాసేపటి తర్వాత జయలలిత ఆరోగ్యం, తమిళనాడులో నెలకొన్న పరిస్థితుల గురించి పూర్తి వివరాలను ఫోన్ ద్వారా మోదీ దృష్టికి తీసుకెళ్లారు. నేటి సాయంత్రం లేదా రేపు అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం లేదా బుధవారం చెన్నైలోని మెరీనా బీచ్‌లో జయలలిత అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మూడు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవు, ఏడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు. స్తంభించిన జన జీవనం రాష్ట్రంలో ఒక వైపు కరెన్సీ కష్టాలు.. మరో వైపు సీఎం ఆరోగ్యం విషమించడంతో జనజీవనం దాదాపుగా స్తంభించిపోరుుంది. ముఖ్యమంత్రికి సంబంధించిన బులిటిన్ విడుదల కాకముందే జాగ్రత్త పడేందుకు ప్రజలు పెట్రోలు బంకుల వద్ద పెద్ద ఎత్తున క్యూ కట్టారు. కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులు సిద్ధం చేసుకుంటున్నారు. పాఠశాలలకు సెలవులను ప్రకటించిన విద్యాశాఖ ఆ తరువాత మళ్లీ ఉపసంహరించుకుంది. విధ్వంసకర సంఘటనలు చోటు చేసుకునేందుకు ఆస్కారం ఇవ్వకుండా సెల్ నెట్ వర్క్ సేవలను నిలుపుదల చేసేలా కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. దీంతో పలుప్రాంతాల్లో సెల్ఫోన్లు పనిచేయలేదు. చెన్నైలోని ఆమెరికా రాయబార కార్యాలయం వీసా జారీ ప్రక్రియను నిలిపివేసింది. దీంతో అనేక రాష్ట్రాల నుంచి వీసాల కోసం వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రాజకీయ నేతలంతా తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. ప్రజలు సైతం రాత్రివేళ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. రాష్ట్రమంతటా భారీ బందోబస్తు.. రాష్ట్రమంతటా దాదాపు హై అలర్ట్ ప్రకటించినట్లుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శాంతి భద్రతల పర్యవేక్షణకు ఇద్దరు ఐజీలను నియమించారు. కేంద్రం పంపిన 900 పారా మిలటరీ దళాలు సోమవారం ఎనిమిది విమానాల్లో చెన్నై చేరుకున్నారుు. ఎరుుర్‌ఫోర్స్, నౌకాదళాలు కూడా అవసరమైతే రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యారుు. రాష్ట్రంలోని అన్ని పోలీసుస్టేషన్లలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు అందారుు. సెలవులో వున్న పోలీసులంతా విధులకు హాజరు కావాలని, రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు సెలవు పెట్టరాదని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఒక పోలీసు ఉన్నతాధికారి ఆదివారం నాడు జరిగిన తన కుమారుని నిశ్చితార్థాన్ని సైతం వదలుకుని విధులకు హాజరయ్యారు. అమెరికా రాయబారి కార్యాలయానికి మరింత బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఎంకే ప్రముఖ నేతల ఇళ్ల వద్ద సాయుధ పోలీసులను ఉంచారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు పదే పదే హెచ్చరికలు జారీ అవుతున్నారుు. ఈ సందర్భంగా ఆర్థికమంత్రి పన్నీర్ సెల్వం పోలీసు ఉన్నతాధికారులతో ఆదివారం రాత్రి అత్యవసరంగా సమావేశమై పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య లేదని కేంద్ర హోంశాఖ కార్యదర్శికి గవర్నర్ విద్యాసాగరరావు తెలియజేశారు. చెన్నై పోయెస్ గార్డెన్‌లోని సీఎం నివాసం వద్ద పోలీసులు మోహరించారు. పెద్ద సంఖ్యలో బారికేడ్లను సిద్ధం చేశారు. కర్ణాటక, కేరళ, ఏపీల మధ్య బస్సుల రాకపోకలను సరిహద్దుల్లోనే నిలిపి వేయడంతోపాటూ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సాయుధ పోలీసులను నియమించారు. -
నా జీవితమే పోరాటాలమయం...
ఎన్నడూ ఎవరికీ ఇంటర్వ్యూలు ఇవ్వని జయలలిత కొన్ని సందర్భాల్లో పలువురు విలేకరులతో తన అభిప్రాయాలను పంచుకున్నారు. వారిలో సిమి గరేవాల్, కరణ్ థాపర్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లోని కొన్ని అంశాలు... సిమి గరేవాల్‌తో ఇంటర్వ్యూ... ప్రశ్న: ఎన్నో ఏళ్ల నుంచి మీ రాజకీయ జీవితాన్ని చూస్తున్నాను. గ్రేట్ జర్నీ. సినిమా కథలకంటే నాటకీయతతో కూడుకున్నది కదా? జయ: అవును. చాలా ఆందోళనకరమైన జీవితమే.. రాజకీయాలు మిమ్మల్ని కఠినంగా మార్చాయా? అవును. రాజకీయ జీవితం ప్రారంభించినప్పుడు చాలా బెరుగ్గా ఉండేదానిని. బిడియం ఎక్కువ. సమావేశాల్లో మాట్లాడాలంటే బాగా భయపడేదాన్ని. ఇప్పుడున్న స్థానానికి చేరుకుంటారని ఎప్పుడైనా ఊహించారా? లేదు. ముందు ఏం జరుగుతుందో తెలియకపోవడం కూడా మనకు మంచే చేస్తుంది. ముందే తెలిస్తే భయం వేసేది. మీ జీవితంలో అత్యంత కఠిన సమయమేది? ఎంజీఆర్ మరణం తర్వాత పార్టీలో నా ప్రాధాన్యాన్ని కాపాడుకుని ముందుకు వెళ్లడమే నా జీవితంలో అత్యంత కఠిన సమయం. అప్పుడు నాకు కొనసాగాలనిపించలేదు. ఎందుకు మీకు కొనసాగాలనిపించలేదు? ఆ సమయంలో నేను చాలా అవమానాలెదుర్కొన్నాను. నా చుట్టూ ఉన్న వాళ్లు నన్ను అనుమానంతో చూశారు. నటులను, డాక్టర్లను, లాయర్లను, వేరే రంగాల్లో ఉన్నవారిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఎంతో గౌరవంతో చేస్తారు. కానీ రాజకీయనాయకుల దగ్గరకు వచ్చేసరికి మాత్రం వారి తీరు చాలా దారుణంగా ఉంటుంది. ఎంతో అవమానకరమైన ప్రశ్నలు అడుగుతారు. మనల్ని ఒక్కసారి కూడా కలవని వ్యక్తులు మన జీవితంలోని తప్పులను ఎత్తిచూపిస్తారు. నేను చాలా సున్నిత మనస్కురాలిని. మీడియాలో నా గురించి వచ్చే వార్తలు నన్ను చాలా బాధ పెట్టాయి. మీరంటే కొందరు ఎందుకు భయపడతారు? నాకున్న పేరు వల్లేనేమో!(నవ్వుతూ). ఇంతకు ముందున్న జయలలిత వేరు. తను ఎప్పుడూ అందరితో కలిసేది కాదు. భయం భయంగా ఉండేది. ఎవరైనా నిలదీసినా తిరిగి సమాధానం చెప్పలేని భయస్తురాలు. ఎవరైనా అవమానిస్తే ఇంటికి వెళ్లి తలుపులు మూసుకుని ఏడ్చేది. ఆ జయలలిత ఇప్పుడు లేదు. నేను మారిన విధానాన్ని చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది. శశికళతో మీ సాన్నిహిత్యంపై ఎన్నో విమర్శలు వచ్చాయి. అయినా మీరు దాన్ని ఎందుకు కొనసాగించారు? తనను చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు. కేవలం నాపై తనకున్న విధేయత కారణంగానే చాలా అవమానాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ తను వెనక్కి తగ్గలేదు. తను ఏడాది పాటు జైల్లో గడపాల్సి వచ్చింది. ఎంతో బాధపడింది. అవినీతి కేసులతో ఏమైనా ఇబ్బంది పడ్డారా? లేదు. నా మీద పెట్టిన అవినీతి కేసులన్నీ రాజకీయ ప్రయోజనాల కోసం పెట్టినవే. మీరు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు, జైలుకు కూడా వెళ్లి వచ్చారు. ఇదంతా ఎందుకు అని మీకు ఎప్పుడూ అనిపించలేదా? మార్చి 25, 1989న అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి సమక్షంలో నాపై దాడి జరిగింది. వారి పార్టీలోని వాళ్లంతా చేతికి దొరికిన దాంతో నాపై దాడిచేశారు. అప్పుడు స్పీకర్ టేబుల్ మీద పెద్ద గాజు గంట ఉండేది. దాంతో నా తల మీద కొట్టాలని వారు ప్రయత్నించారు. అదే జరిగుంటే నేను ఇప్పుడు బతికుండే దాన్ని కాదేమో. వారిలో ఒకరు నా చీర లాగడానికి కూడా ప్రయత్నించారు. నన్ను చెప్పులతో కొట్టారు. అది అత్యంత దారుణమైన అనుభవం. నేను జైలుకు వెళ్లడం నా జీవితంలోనే అత్యంత బాధాకర సంఘటన. కరణ్‌థాపర్ ఇంటర్వ్యూలో... కరణ్ థాపర్: మీ ఎమ్మెల్యేలు, మంత్రులు మీ ముందు ఎందుకు సాష్టాంగ నమస్కారం చేస్తారు? జయ: ఇది అందరు రాజకీయ నాయకులకు జరిగేదే. డీఎంకే ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా కరుణానిధికి సాష్టాంగ నమస్కారం చేస్తారు. కానీ వారు మనుషులు.. (మధ్యలో కలుగజేసుకుని) నా చుట్టూ జరిగిన చిన్న విషయమైనా అతిగానే కనిపిస్తుంది. పెద్దవారి వద్ద నుంచి ఆశీస్సులు తీసుకోవడం భారతీయ సాంప్రదాయం. కానీ వారు రాష్ట్ర మంత్రులు.. జయ: నేను వారిని అలా చేయవద్దని చెప్పాను. వారు మీ మాట వినడం లేదా? వారు వింటారు. అందుకే ఈ మధ్యకాలంలో ప్రజల మధ్య అలా చేయడం మానేశారు. మీకు సమయం లేదని చెబుతున్నప్పుడు మీరు కక్ష అనే పదం వాడారు. మీ ముందున్న ముఖ్యమంత్రిపై ఒక రోజు ముందే కేసు నమోదైనా శనివారం తెల్లవారుజామున రెండు గంటలకు ఆయన్ను అరెస్టు చేయించారు.. (మధ్యలో కలుగజేసుకుని) నన్ను కొంచెం మాట్లాడనివ్వండి. నేను ప్రశ్న పూర్తి చేశాక మాట్లాడండి. మీరేం అడుగుతున్నారో నాకు అర్థమైంది. డీఎంకే ప్రభుత్వం నా మీద అక్రమకేసులు బనారుుంచి నన్ను జైలుకు పంపింది. నేను 28 రోజులు ఆ కేసులో జైల్లో ఉండి... అంటే అది వ్యక్తిగత కక్షా? కరుణానిధి ఈ పని చేసినప్పుడు మీడియా ‘చెడుపై విజయం’ అంటూ ఆయన్ను ఆకాశానికెత్తేసింది. అప్పుడు కరుణానిధి నాపై పన్నిన పన్నాగాన్ని కనిపెట్టిన ప్రజలు నన్ను 2001 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించారు. కానీ మీరు ఆయన్ని అరెస్టు చేసినప్పుడు? నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరుణానిధి అవినీతి కేసులో అరెస్టయ్యారు. ఆ సమయంలో ఆయన కుటుంబ చానెల్ అరుున సన్‌టీవీ ఎంతో తెలివిగా ఎడిట్ చేసిన ఫుటేజ్‌తో ప్రజలను మాయ చేయాలని ప్రయత్నించారు. మీరు 77 సంవత్సరాల వయసున్న వ్యక్తిని అరెస్టు చేయించారు. అవినీతికి, వయసుకీ సంబంధం లేదు. అంటే అది వ్యక్తిగత కక్షా? అది వ్యక్తిగత కక్ష కాదు. అవినీతి కేసు. ముక్కుసూటితనం మీకు వ్యతిరేకంగా పనిచేస్తోందా? నేను నిజాయితీపరురాలిని. ఇప్పుడు మీతో కూడా నిజాయితీతో వ్యవహరించనివ్వండి. అలాగే ముక్కుసూటిగా నిజాలు మాట్లాడేందుకు ప్రాధాన్యతనిస్తాను. మైనారిటీలపై దాడులు జరిగినప్పుడు ప్రతి రాజకీయ నాయకుడు వాటిని ఖండిస్తాడు. పోటీపడుతూ ప్రకటనలు జారీ చేస్తారు. ఇతరులపై అలాంటి సంఘటనలు జరిగితే వాటిని ఖండించిన రాజకీయ నేత ఇప్పటివరకూ ఎవరూ లేరు. బాధ్యులెవరు, బాధితులెవరు? అన్న విషయాలకు అతీతంగా ఇలాంటి ఉన్మాద చర్యలను అందరూ తీవ్రంగా వ్యతిరేకించాల్సిందే. మైనారిటీలపై జరిగే వాటినే నేరాలుగా చూడటం సరికాదు. ఇలాంటి సంఘటనలు మొత్తం మానవత్వంపై జరిగిన దాడిగానే చూడాలి. ఈ దేశ రాజ్యాంగం ప్రకారం మైనారిటీలకు మాత్రమే కాదు.. మెజారిటీ వర్గాల వారికీ హక్కులున్నాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. - మార్జి 1, 2002 (గోద్రా మారణ కాండ సమయంలో) నా జీవితంపై ఎంజీఆర్ ప్రభావం చాలా ఎక్కువ. కాదనను. అయితే ఇప్పుడు నేను.. నేనే! నా ఆలోచనలు, చర్యలన్నింటినీ ప్రభావం చేయగల వ్యక్తి మరొకరు ఇకపై ఉండరు. ఇతరుల ఆలోచనలకు తగ్గట్టుగా ప్రకటనలు చేయడమూ జరగదు. ఇకపై నేను సమాధానం చెప్పుకోవాల్సింది నాకు మాత్రమే. -మే 4, 1998 (సావీ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో) నేను మీ అమ్మను... బిడ్డలకు ఏది మంచిదో తల్లికే బాగా తెలుస్తుంది. మీ సంక్షేమమే నాకు సంతోషం. - ఎన్నికల ర్యాలీల్లో జయలలిత రాజకీయాల్లో నా తీరే వేరు. రాజకీయాల్లో నెగ్గుకురావాలంటే కొన్ని నాటకాలు తప్పనిసరి.. నాకు సినిమాల్లో కెమెరా ముందు నటించిన అనుభవం ఉండనే ఉంది. అరుుతే నిజ జీవితంలో నటించడం మాత్రం నాకు రాదు. పురుషాధిక్య రాజకీయ రంగంలో సొంతబలంపై పైకి ఎదిగిన మహిళను నేను. మహిళా నేతగా ఇందిరాగాంధీ ఉన్నత స్థారుుకి చేరినప్పటికీ ఆమెకు నెహ్రూ కుటుంబంలో పుట్టడమన్న అనుకూలత ఉంది’’ ప్రతి పోలీసు అధికారి ప్రతి సాధారణ పౌరుడు సురక్షింతంగా ఉంచడం కోసమే పనిచేయాలి. ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనగలిగే సామర్థ్యాలను పొందేలా శిక్షణను పొంది ఉండాలి. సవాళ్లను ఎదుర్కొన్న వారే ప్రతిభావంతులుగా తయారవుతారు. ప్రజలను సరైన మార్గంలో నడిపించడానికి చక్కటి ఉదాహరణగా సినిమాలు ఉండాలి. చదువు.. నీ ప్రశ్నకు సమాధానాన్ని మాత్రమే ఇస్తుంది. సంస్కృతి అనేది మనిషిగా జీవించడానికి అతి ముఖ్యమైనది. ప్రభుత్వ పాలసీలు, ప్రణాళికలను వ్యతిరేకించినవారంతా ప్రతిపక్షం కాదు. వారు ప్రభుత్వ మంచి, చెడులను చెప్పి ఉత్తమ ఫలితాలను తీసుకురాగలరు. ఇదే ప్రతిపక్ష పార్టీ ప్రధాన ఉద్ధేశం.