నా జీవితమే పోరాటాలమయం... | Jayalalithaa comments in some interveiws | Sakshi
Sakshi News home page

నా జీవితమే పోరాటాలమయం...

Published Tue, Dec 6 2016 4:05 AM | Last Updated on Mon, Sep 4 2017 9:59 PM

నా జీవితమే పోరాటాలమయం...

నా జీవితమే పోరాటాలమయం...

ఎన్నడూ ఎవరికీ ఇంటర్వ్యూలు ఇవ్వని జయలలిత కొన్ని సందర్భాల్లో పలువురు విలేకరులతో తన అభిప్రాయాలను పంచుకున్నారు. వారిలో సిమి గరేవాల్, కరణ్ థాపర్‌లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లోని కొన్ని  అంశాలు...
 
 సిమి గరేవాల్‌తో ఇంటర్వ్యూ...
  ప్రశ్న: ఎన్నో ఏళ్ల నుంచి మీ రాజకీయ జీవితాన్ని చూస్తున్నాను. గ్రేట్ జర్నీ. సినిమా కథలకంటే నాటకీయతతో కూడుకున్నది కదా?
 జయ: అవును. చాలా ఆందోళనకరమైన జీవితమే..

 రాజకీయాలు మిమ్మల్ని కఠినంగా మార్చాయా?
 అవును. రాజకీయ జీవితం ప్రారంభించినప్పుడు చాలా బెరుగ్గా ఉండేదానిని. బిడియం ఎక్కువ. సమావేశాల్లో మాట్లాడాలంటే బాగా భయపడేదాన్ని.

 ఇప్పుడున్న స్థానానికి చేరుకుంటారని ఎప్పుడైనా ఊహించారా?
 లేదు. ముందు ఏం జరుగుతుందో తెలియకపోవడం కూడా మనకు మంచే చేస్తుంది. ముందే తెలిస్తే భయం వేసేది.

 మీ జీవితంలో అత్యంత కఠిన సమయమేది?
 ఎంజీఆర్ మరణం తర్వాత పార్టీలో నా ప్రాధాన్యాన్ని కాపాడుకుని ముందుకు వెళ్లడమే నా జీవితంలో అత్యంత కఠిన సమయం. అప్పుడు నాకు కొనసాగాలనిపించలేదు.

 ఎందుకు మీకు కొనసాగాలనిపించలేదు?
 ఆ సమయంలో నేను చాలా అవమానాలెదుర్కొన్నాను. నా చుట్టూ ఉన్న వాళ్లు నన్ను అనుమానంతో చూశారు. నటులను, డాక్టర్లను, లాయర్లను, వేరే రంగాల్లో ఉన్నవారిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఎంతో గౌరవంతో చేస్తారు. కానీ రాజకీయనాయకుల దగ్గరకు వచ్చేసరికి మాత్రం వారి తీరు చాలా దారుణంగా ఉంటుంది. ఎంతో అవమానకరమైన ప్రశ్నలు అడుగుతారు. మనల్ని ఒక్కసారి కూడా కలవని వ్యక్తులు మన జీవితంలోని తప్పులను ఎత్తిచూపిస్తారు. నేను చాలా సున్నిత మనస్కురాలిని. మీడియాలో నా గురించి వచ్చే వార్తలు నన్ను చాలా బాధ పెట్టాయి.

 మీరంటే కొందరు ఎందుకు భయపడతారు?
 నాకున్న పేరు వల్లేనేమో!(నవ్వుతూ). ఇంతకు ముందున్న జయలలిత వేరు. తను ఎప్పుడూ అందరితో కలిసేది కాదు. భయం భయంగా ఉండేది. ఎవరైనా నిలదీసినా తిరిగి సమాధానం చెప్పలేని భయస్తురాలు. ఎవరైనా అవమానిస్తే ఇంటికి వెళ్లి తలుపులు మూసుకుని ఏడ్చేది. ఆ జయలలిత ఇప్పుడు లేదు. నేను మారిన విధానాన్ని చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది.

 శశికళతో మీ సాన్నిహిత్యంపై ఎన్నో విమర్శలు వచ్చాయి. అయినా మీరు దాన్ని ఎందుకు కొనసాగించారు?
 తనను చాలా మంది తప్పుగా అర్థం చేసుకున్నారు. కేవలం నాపై తనకున్న విధేయత కారణంగానే చాలా అవమానాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ తను వెనక్కి తగ్గలేదు. తను ఏడాది పాటు జైల్లో గడపాల్సి వచ్చింది. ఎంతో బాధపడింది.

 అవినీతి కేసులతో ఏమైనా ఇబ్బంది పడ్డారా?
 లేదు. నా మీద పెట్టిన అవినీతి కేసులన్నీ రాజకీయ ప్రయోజనాల కోసం పెట్టినవే.

 మీరు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు, జైలుకు కూడా వెళ్లి వచ్చారు. ఇదంతా ఎందుకు అని మీకు ఎప్పుడూ అనిపించలేదా?
 మార్చి 25, 1989న అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి సమక్షంలో నాపై దాడి జరిగింది. వారి పార్టీలోని వాళ్లంతా చేతికి దొరికిన దాంతో నాపై దాడిచేశారు. అప్పుడు స్పీకర్ టేబుల్ మీద పెద్ద గాజు గంట ఉండేది. దాంతో నా తల మీద కొట్టాలని వారు ప్రయత్నించారు. అదే జరిగుంటే నేను ఇప్పుడు బతికుండే దాన్ని కాదేమో. వారిలో ఒకరు నా చీర లాగడానికి కూడా ప్రయత్నించారు. నన్ను చెప్పులతో కొట్టారు. అది అత్యంత దారుణమైన అనుభవం. నేను జైలుకు వెళ్లడం నా జీవితంలోనే అత్యంత బాధాకర సంఘటన.
 
 కరణ్‌థాపర్ ఇంటర్వ్యూలో...
కరణ్ థాపర్: మీ ఎమ్మెల్యేలు, మంత్రులు మీ ముందు ఎందుకు సాష్టాంగ నమస్కారం చేస్తారు?
 జయ: ఇది అందరు రాజకీయ నాయకులకు జరిగేదే. డీఎంకే ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా కరుణానిధికి సాష్టాంగ నమస్కారం చేస్తారు.
 కానీ వారు మనుషులు..
 (మధ్యలో కలుగజేసుకుని) నా చుట్టూ జరిగిన చిన్న విషయమైనా అతిగానే కనిపిస్తుంది. పెద్దవారి వద్ద నుంచి ఆశీస్సులు తీసుకోవడం భారతీయ సాంప్రదాయం.

 కానీ వారు రాష్ట్ర మంత్రులు..
 జయ: నేను వారిని అలా చేయవద్దని చెప్పాను.

 వారు మీ మాట వినడం లేదా?
 వారు వింటారు. అందుకే ఈ మధ్యకాలంలో ప్రజల మధ్య అలా చేయడం మానేశారు.

 మీకు సమయం లేదని చెబుతున్నప్పుడు మీరు కక్ష అనే పదం వాడారు. మీ ముందున్న ముఖ్యమంత్రిపై ఒక రోజు ముందే కేసు నమోదైనా శనివారం తెల్లవారుజామున రెండు గంటలకు ఆయన్ను అరెస్టు చేయించారు..
 (మధ్యలో కలుగజేసుకుని) నన్ను కొంచెం మాట్లాడనివ్వండి.

 నేను ప్రశ్న పూర్తి చేశాక మాట్లాడండి.
 మీరేం అడుగుతున్నారో నాకు అర్థమైంది. డీఎంకే ప్రభుత్వం నా మీద అక్రమకేసులు బనారుుంచి నన్ను జైలుకు పంపింది. నేను 28 రోజులు ఆ కేసులో జైల్లో ఉండి...

 అంటే అది వ్యక్తిగత కక్షా?
 కరుణానిధి ఈ పని చేసినప్పుడు మీడియా ‘చెడుపై విజయం’ అంటూ ఆయన్ను ఆకాశానికెత్తేసింది. అప్పుడు కరుణానిధి నాపై పన్నిన పన్నాగాన్ని కనిపెట్టిన ప్రజలు నన్ను 2001 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించారు.

  కానీ మీరు ఆయన్ని అరెస్టు చేసినప్పుడు?
 నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరుణానిధి అవినీతి కేసులో అరెస్టయ్యారు. ఆ సమయంలో ఆయన కుటుంబ చానెల్ అరుున సన్‌టీవీ ఎంతో తెలివిగా ఎడిట్ చేసిన ఫుటేజ్‌తో ప్రజలను మాయ చేయాలని ప్రయత్నించారు.

 మీరు 77 సంవత్సరాల వయసున్న వ్యక్తిని అరెస్టు చేయించారు.
 అవినీతికి, వయసుకీ సంబంధం లేదు.

 అంటే అది వ్యక్తిగత కక్షా?
 అది వ్యక్తిగత కక్ష కాదు. అవినీతి కేసు.

 ముక్కుసూటితనం మీకు వ్యతిరేకంగా పనిచేస్తోందా?
 నేను నిజాయితీపరురాలిని. ఇప్పుడు మీతో కూడా నిజాయితీతో వ్యవహరించనివ్వండి. అలాగే ముక్కుసూటిగా నిజాలు మాట్లాడేందుకు ప్రాధాన్యతనిస్తాను.
 
 మైనారిటీలపై దాడులు జరిగినప్పుడు ప్రతి రాజకీయ నాయకుడు వాటిని ఖండిస్తాడు. పోటీపడుతూ ప్రకటనలు జారీ చేస్తారు. ఇతరులపై అలాంటి సంఘటనలు జరిగితే వాటిని ఖండించిన రాజకీయ నేత ఇప్పటివరకూ ఎవరూ లేరు. బాధ్యులెవరు, బాధితులెవరు? అన్న విషయాలకు అతీతంగా ఇలాంటి ఉన్మాద చర్యలను అందరూ తీవ్రంగా వ్యతిరేకించాల్సిందే. మైనారిటీలపై జరిగే వాటినే నేరాలుగా చూడటం సరికాదు. ఇలాంటి సంఘటనలు మొత్తం మానవత్వంపై జరిగిన దాడిగానే చూడాలి. ఈ దేశ రాజ్యాంగం ప్రకారం మైనారిటీలకు మాత్రమే కాదు.. మెజారిటీ వర్గాల వారికీ హక్కులున్నాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
 - మార్జి 1, 2002 (గోద్రా మారణ కాండ సమయంలో)
 
 నా జీవితంపై ఎంజీఆర్ ప్రభావం చాలా ఎక్కువ. కాదనను. అయితే ఇప్పుడు నేను.. నేనే! నా ఆలోచనలు, చర్యలన్నింటినీ ప్రభావం చేయగల వ్యక్తి మరొకరు ఇకపై ఉండరు. ఇతరుల ఆలోచనలకు తగ్గట్టుగా ప్రకటనలు చేయడమూ జరగదు. ఇకపై నేను సమాధానం చెప్పుకోవాల్సింది నాకు మాత్రమే.
-మే 4, 1998 (సావీ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో)
 
 నేను మీ అమ్మను... బిడ్డలకు ఏది మంచిదో తల్లికే బాగా తెలుస్తుంది. మీ సంక్షేమమే నాకు సంతోషం.
 - ఎన్నికల ర్యాలీల్లో జయలలిత
 
 రాజకీయాల్లో నా తీరే వేరు. రాజకీయాల్లో నెగ్గుకురావాలంటే కొన్ని నాటకాలు తప్పనిసరి.. నాకు సినిమాల్లో కెమెరా ముందు నటించిన అనుభవం ఉండనే ఉంది. అరుుతే నిజ జీవితంలో నటించడం మాత్రం నాకు రాదు.
 
 పురుషాధిక్య రాజకీయ రంగంలో సొంతబలంపై పైకి ఎదిగిన మహిళను నేను. మహిళా నేతగా ఇందిరాగాంధీ ఉన్నత స్థారుుకి చేరినప్పటికీ ఆమెకు నెహ్రూ కుటుంబంలో పుట్టడమన్న అనుకూలత ఉంది’’
 
 ప్రతి పోలీసు అధికారి ప్రతి సాధారణ పౌరుడు సురక్షింతంగా ఉంచడం కోసమే పనిచేయాలి. ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనగలిగే సామర్థ్యాలను పొందేలా శిక్షణను పొంది ఉండాలి.
 
 సవాళ్లను ఎదుర్కొన్న వారే  ప్రతిభావంతులుగా తయారవుతారు.
 
 ప్రజలను సరైన మార్గంలో నడిపించడానికి చక్కటి ఉదాహరణగా సినిమాలు ఉండాలి.
 
 చదువు.. నీ ప్రశ్నకు సమాధానాన్ని మాత్రమే ఇస్తుంది. సంస్కృతి అనేది మనిషిగా జీవించడానికి అతి ముఖ్యమైనది.
 
 ప్రభుత్వ పాలసీలు, ప్రణాళికలను వ్యతిరేకించినవారంతా ప్రతిపక్షం కాదు. వారు ప్రభుత్వ మంచి, చెడులను చెప్పి ఉత్తమ ఫలితాలను తీసుకురాగలరు. ఇదే ప్రతిపక్ష పార్టీ ప్రధాన ఉద్ధేశం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement