తలైవీ.. సెలవ్ | CM Jayalalithaa is no more | Sakshi
Sakshi News home page

తలైవీ.. సెలవ్

Published Tue, Dec 6 2016 5:07 AM | Last Updated on Mon, Sep 4 2017 9:59 PM

తలైవీ.. సెలవ్

తలైవీ.. సెలవ్

తమిళ ప్రజల ‘అమ్మ’ జయలలిత అస్తమయం
 
- శోకసంద్రంలో తమిళనాడు..రాష్ట్రమంతటా ఉద్రిక్తత
- పరిస్థితిని ప్రధానికి వివరించిన వెంకయ్య
- ఆస్పత్రి వేదికగా ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేల భేటీ
-ముఖ్యమంత్రిగా పన్నీరు సెల్వం ప్రమాణ స్వీకారం, పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ!
- అవాంఛనీయ ఘటనలక తావివ్వకుండా సెల్ నెట్‌వర్క్ నిలుపుదల
- రాష్ట్ర సరిహద్దుల్లో ఎక్కడికక్కడ ఆగిపోయిన బస్సు సర్వీసులు
- భద్రత దళాల గుప్పిట్లో రాష్ట్రం

 
 తమిళనాట ‘అమ్మ’ శకం ముగిసింది...
 విప్లవ నాయకి (పురచ్చి తలైవీ) విశ్రమించింది...
 74 రోజులపాటు మృత్యువుతో పోరాడిన ధీర నాయకి దిగంతాలకు చేరింది...


 ‘పురచ్చి తలైవీ’గా కోట్లాది మంది గుండెల్లో కొలువైన తమిళనాడు సీఎం జయరాం జయలలిత(68) సోమవారం అర్ధరాత్రి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. తీవ్ర జ్వరం, డీహైడ్రేషన్‌తో సెప్టెంబర్ 22న ఆమె ఆసుపత్రిలో చేరారు. జయ కోలుకున్నారని, రేపోమాపో డిశ్చార్జి అవుతారని కొద్దిరోజుల క్రితమే వైద్యులు ప్రకటించారు. అయితే ఆదివారం రాత్రి గుండెపోటు రావడంతో పరిస్థితి విషమించింది.

లండన్ నుంచి వచ్చిన రిచర్డ్‌తో సహా ఎయిమ్స్ వైద్యులు శాయశక్తులా ప్రయత్నించినా లాభం లేకపోయింది. చివరికి తీవ్ర ఉత్కంఠ మధ్య ‘అమ్మ ఇక లేరు’ అంటూ వైద్యులు ప్రకటించారు. దీంతో ‘అమ్మ’ అభిమానుల గుండెలు పగిలాయి. రోదనలు మిన్నంటారుు. ముందస్తు చర్యగా తమిళనాడు రాష్ట్రమంతటా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జయలలిత మృతిపట్ల రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరోవైపు రాష్ట్ర సీఎంగా పన్నీర్ సెల్వం, మరో 31 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అన్నాడీఎంకే పార్టీ నాయకత్వ బాధ్యతలు జయ నెచ్చెలి శశికళకు అప్పగించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు.

 
 సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత(68) సోమవారం అర్ధరాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ వార్త వినగానే ఏఐఏడీఎంకే నేతలు, కార్యకర్తలు, అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. రాష్ట్రం యావత్తూ శోకసంద్రంలో మునిగిపోరుుంది. కాగా, తమిళనాడు ముఖ్యమంత్రిగా సోమవారం అర్ధరాత్రి పన్నీర్ సెల్వం ప్రమాణ స్వీకారం చేశారు. జయలలిత జ్వరం, డీహైడ్రేషన్‌తో బాధపడుతూ సెప్టెంబర్ 22వ తేదీ అర్ధరాత్రి ఆమె చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ సోకడంతో 74 రోజుల పాటు ఆమె చికిత్స పొందారు. మూడు వారాల క్రితం డిశ్చార్జ్ దశకు చేరుకున్న దశలో ఈనెల 4వ తేదీ సాయంత్రం అకస్మాత్తుగా గుండెపోటుకు గురికావడంతో రాష్ట్రమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

చికిత్సకు స్పందిస్తున్నారని అపోలో యాజమాన్యం ప్రకటించిన కొద్ది గంటలకే ఆమె ఇక లేరన్న వార్త వినాల్సివచ్చింది. అంతకు ముందు అమ్మకు ఏమైంది.. ఆమె ఆరోగ్యం ఎలా ఉందని చర్చించుకుంటున్న తరుణంలో ‘అమ్మ లేదిక’ అంటూ సోమవారం సాయంత్రం టీవీ మాధ్యమాల్లో వదంతులు ప్రసారం కావడంతో అన్నాడీఎంకే  శ్రేణుల్లో ఆవేదన, ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పార్టీ శ్రేణులు అపోలో ఆసుపత్రి వద్ద బారికేడ్లను ఈడ్చి పారేసి లోపలకు చొరబడే ప్రయత్నం చేశారుు. మహిళా కార్యకర్తలు గుండెలవిసేలా రోదించారు. దుకాణలన్నీ మూతపడ్డారుు. పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ పతాకాన్ని అవనతం చేశారు. ఈ పరిస్థితిలో ‘వదంతులు నమ్మవద్దు.. అమ్మ చికిత్సకు స్పందిస్తున్నారు’ అంటూ అపోలో యాజమాన్యం ప్రకటించడంతో తిరిగి సాధారణ పరిస్థితి నెలకొంది. జయకు వైద్యం కొనసాగుతుండగానే మరో వైపు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఆసుపత్రిలో ఉదయం, రాత్రి రెండు దఫాలుగా సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ముఖ్యమంత్రిగా పన్నీరు సెల్వం, పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళకు పగ్గాలు అప్పగించే దిశగా పరిణామాలు మారిపోయారుు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితిని అనుకూలంగా మలుచుకునేందును బీజేపీ నేతలు సైతం రంగంలోకి దిగారు. రాత్రి పొద్దుపోయే దాకా చర్చలు, సమావేశాలు కొనసాగాయి.  

 ఆసుపత్రి వద్ద అభిమానుల రోదనలు
 అమ్మ ఇకలేరని తెలియగానే రాష్ట్రమంతటా ఒకటే ఆందోళన. ఏఐఏడీఎంకే నేతలు, కార్యకర్తలు, అభిమానులంతా అపోలో ఆసుపత్రికి పరుగులు పెట్టారు. పరిస్థితిని ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. జయలలిత జ్వరం, డీహైడ్రేషన్‌తో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారని సెప్టెంబర్ 22వ తేదీ అర్ధరాత్రి అపోలో యాజమాన్యం ప్రకటించిన తరువాత.. ఈ 74 రోజుల కాలంలో ఆమె అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. అమ్మ ఆసుపత్రిలో చేరిన నాటి నుంచి అపోలో ముంగిటే గడుపుతున్న మహిళా కార్యకర్తల ముఖాల్లో విషాదఛాయలు అలుముకున్నారుు. కన్నీటి పర్యంతమవుతూ గుండెలవిసేలా రోదించారు.

 రోజంతా ఉత్కంఠ
 సోమవారం తెల్లవారుజామున ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితిపై ఒక అధికారిక బులిటెన్ విడుదల అవుతుందని అంతా ఉత్కంఠతో గడిపారు. ఇదే సమయంలో అపోలో ఆసుపత్రిలోని నర్సులను హడావుడిగా ఇంటికి పంపించేశారు. గవర్నర్ విద్యాసాగర్‌రావు ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఆపోలోకు చేరుకున్నారు. మంత్రులతో కొద్దిసేపు సమావేశమై రాజ్‌భవన్‌కు చేరుకున్న తర్వాత కూడా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అపోలో ఆసుపత్రి వైపునకు దారితీసే అన్ని మార్గాల్లో పోలీసులు బారికేడ్లు అడ్డుగా పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ పరిస్థితులు తలెత్తడంలో సిటీ బస్సులను నడిపేందుకు డ్రైవర్లు, కండక్టర్లు విముఖత చూపారు. తిరునెల్వేలీలో ప్రభుత్వ బస్సు అద్దాలను పగులగొట్టారు.

 ఎక్మో చికిత్స
 గుండెపోటుకు గురైన ముఖ్యమంత్రి జయలలితను ప్రత్యేక వార్డు నుంచి అత్యవసర వార్డుకు తరలించిన అపోలో వైద్యులు సోమవారం తెల్లవారుజామున శస్త్రచికిత్స చేసి ఎక్మో (ఎక్స్ ట్రాకోర్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్) అనే వైద్య పరికరాన్ని ఆమె గుండెకు అమర్చారు. ఈ   పరికరం గుండె, శ్వాసకోస సమస్యలను అధిగమించేలా చేస్తుంది. ఆగిపోరుున గుండెను తిరిగి పనిచేరుుంచే సామర్థ్యం కలిగిన ఎక్మో  పరికరాన్ని ఆమర్చినా పరిస్థితి అంతగా మెరుగుపడలేదు. సోమవారం తెల్లవారుజాము 3 గంటల సమయంలో యాంజియోగ్రామ్ కూడా చేశారు. ‘అమ్మ కోలుకోవాలని శాయశక్తులా ప్రయత్నిస్తున్నాం.. ప్రజలు సైతం ఆమె కోసం ప్రార్థనలు చేయండి’ అంటూ అపోలో మేనేజింగ్ డెరైక్టర్ సంగీత రెడ్డి సోమవారం ట్వీట్ చేశారు.

 సర్వశక్తులూ ఒడ్డాం: డాక్టర్ రిచర్డ్
 ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం కుదట పడేలా చేసేందుకు సర్వశక్తులూ ఒడ్డినట్లు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన లండన్ వైద్యుడు డాక్టర్ రిచర్డ్ సోమవారం తెలిపారు. లండన్‌లో ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ వైద్య శాస్త్రంలోని అన్నింటిని ఆమె కోసం వినియోగించామని, అరుుతే ఎవ్వరూ ఊహించని రీతిలో అకస్మాత్తుగా ఆమె గుండెపోటుకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మధ్యాహ్నం 12.20 గంటలకు ఢిల్లీ నుంచి ఐదుగురితో కూడిన ఎరుుమ్స్ వైద్యుల బృందం చెన్నైకి చేరుకుని చికిత్స ప్రారంభించింది. రాత్రి 11.30 గంటల అనంతరం వారు తిరిగి వెళ్లారు. అంతకు ముందు..  ముఖ్యమంత్రి జయలలిత కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీ వేర్వేరుగా ట్వీట్ చేశారు. జయ పరిస్థితిపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావుతో మాట్లాడారు. కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, పొన్ రాధాకృష్ణన్, పుదుచ్చేరీ గవర్నర్ కిరణ్‌బేడీ, తమిళ కాంగ్రెస్ అధ్యక్షులు తిరునావుక్కరసర్ అపోలోకు వచ్చి సీఎం క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారు. జయ కోలుకోవాలని ఆకాంక్షింస్తున్నట్లు డీఎంకే అధ్యక్షులు కరుణానిధి, కోశాధికారి స్టాలిన్ అన్నారు.

 అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అత్యవసర సమావేశం
 ముఖ్యమంత్రి జయలలిత పరిస్థితి అంతకంతకూ విషమించిన నేపథ్యంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హుటాహుటిన చెన్నైకి చేరుకోవాలని ఆదివారం రాత్రే అందరికీ సమాచారం ఇచ్చారు. అపోలో ఆసుపత్రిలో శశికళకు కేటారుుంచిన గదికి సోమవారం ఉదయం 6 గంటలకు మంత్రులు పన్నీర్ సెల్వం, ఎడపాడి పళనిస్వామి వచ్చి ఆమెతో మాట్లాడారు. ఆ తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామమోహన్‌రావు, జైళ్ల శాఖ మాజీ అధికారి రామానుజం తదితరులు శశికళతో గంటపాటు సమావేశమయ్యారు. ఉదయం 11 గంటలకు మంత్రి పన్నీర్‌సెల్వం అధ్యక్షతన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సమావేశమై పలు విషయాలపై గంటన్నరపాటు చర్చించారు. పార్టీ శాసన సభాపక్ష నేతగా పన్నీర్‌సెల్వంవైపు మొగ్గు చూపినట్లు సమాచారం. పార్టీ ప్రధాన కార్యదర్శి గా శశికళను ఎన్నుకోవాలని కొందరు సూచించినట్లు తెలుస్తోంది.

  జయ ఆరోగ్యంపై మోదీకి వెంకయ్య సమాచారం
  తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితిపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రధాని నరేంద్ర మోదీకి సమాచారం ఇచ్చారు. సోమవారం రాత్రి వెంకయ్య నాయుడు అపోలోకు చేరుకుని వైద్యులతో మాట్లాడారు. తదుపరి మీడియాతో మాట్లాడకుండా మౌనంగా వెళ్లి పోయారు. కాసేపటి తర్వాత జయలలిత ఆరోగ్యం, తమిళనాడులో నెలకొన్న పరిస్థితుల గురించి పూర్తి వివరాలను ఫోన్ ద్వారా మోదీ దృష్టికి తీసుకెళ్లారు.

 నేటి సాయంత్రం లేదా రేపు అంత్యక్రియలు
 మంగళవారం సాయంత్రం లేదా బుధవారం చెన్నైలోని మెరీనా బీచ్‌లో జయలలిత అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మూడు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవు, ఏడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు.
 
 స్తంభించిన జన జీవనం
 రాష్ట్రంలో ఒక వైపు కరెన్సీ కష్టాలు.. మరో వైపు సీఎం ఆరోగ్యం విషమించడంతో జనజీవనం దాదాపుగా స్తంభించిపోరుుంది. ముఖ్యమంత్రికి సంబంధించిన బులిటిన్ విడుదల కాకముందే జాగ్రత్త పడేందుకు ప్రజలు పెట్రోలు బంకుల వద్ద పెద్ద ఎత్తున క్యూ కట్టారు. కూరగాయలు,  ఇతర నిత్యావసర వస్తువులు సిద్ధం చేసుకుంటున్నారు. పాఠశాలలకు సెలవులను ప్రకటించిన విద్యాశాఖ ఆ తరువాత మళ్లీ ఉపసంహరించుకుంది. విధ్వంసకర సంఘటనలు చోటు చేసుకునేందుకు ఆస్కారం ఇవ్వకుండా సెల్ నెట్ వర్క్ సేవలను నిలుపుదల చేసేలా కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. దీంతో పలుప్రాంతాల్లో సెల్‌ఫోన్లు పనిచేయలేదు. చెన్నైలోని ఆమెరికా రాయబార కార్యాలయం వీసా జారీ ప్రక్రియను నిలిపివేసింది. దీంతో అనేక రాష్ట్రాల నుంచి వీసాల కోసం వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రాజకీయ నేతలంతా తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. ప్రజలు సైతం రాత్రివేళ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు.
 
 రాష్ట్రమంతటా భారీ బందోబస్తు..   
 రాష్ట్రమంతటా దాదాపు హై అలర్ట్ ప్రకటించినట్లుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శాంతి భద్రతల పర్యవేక్షణకు ఇద్దరు ఐజీలను నియమించారు. కేంద్రం పంపిన 900 పారా మిలటరీ దళాలు సోమవారం ఎనిమిది విమానాల్లో చెన్నై చేరుకున్నారుు. ఎరుుర్‌ఫోర్స్, నౌకాదళాలు కూడా అవసరమైతే రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యారుు. రాష్ట్రంలోని అన్ని పోలీసుస్టేషన్లలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు అందారుు. సెలవులో వున్న పోలీసులంతా విధులకు హాజరు కావాలని, రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు సెలవు పెట్టరాదని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఒక పోలీసు ఉన్నతాధికారి ఆదివారం నాడు జరిగిన తన కుమారుని నిశ్చితార్థాన్ని సైతం వదలుకుని విధులకు హాజరయ్యారు.

అమెరికా రాయబారి కార్యాలయానికి మరింత బందోబస్తు ఏర్పాటు చేశారు.  డీఎంకే ప్రముఖ నేతల ఇళ్ల వద్ద సాయుధ పోలీసులను ఉంచారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు పదే పదే హెచ్చరికలు జారీ అవుతున్నారుు. ఈ సందర్భంగా ఆర్థికమంత్రి పన్నీర్ సెల్వం పోలీసు ఉన్నతాధికారులతో ఆదివారం రాత్రి అత్యవసరంగా సమావేశమై పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య లేదని కేంద్ర హోంశాఖ కార్యదర్శికి గవర్నర్ విద్యాసాగరరావు తెలియజేశారు. చెన్నై పోయెస్ గార్డెన్‌లోని సీఎం నివాసం వద్ద పోలీసులు మోహరించారు. పెద్ద సంఖ్యలో బారికేడ్లను సిద్ధం చేశారు. కర్ణాటక, కేరళ, ఏపీల మధ్య బస్సుల రాకపోకలను సరిహద్దుల్లోనే నిలిపి వేయడంతోపాటూ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సాయుధ పోలీసులను నియమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement