సాక్షి, చెన్నై: దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వేలిముద్రల కేసుపై సుప్రీంకోర్టు తాజా తీర్పును వెలువరించింది. జయలలిత వేలిముద్రలు సమర్పించాలని పరప్పణ అగ్రహారం జైలు అధికారులకు మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు బుధవారం తోసిపుచ్చింది. కేసు విచారణలో భాగంగా జయ లలిత వేలిముద్రలు సేకరించడాన్ని నిలుపుదల చేయాలని, వేలిముద్రలు లేకుండానే కేసు విచారణ పూర్తి చేయాలని మద్రాసు హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. తిరుపరంకండ్రం అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఏఐడీఎంకే నేత ఎకే బోస్ ఎన్నికను సవాలు చేస్తూ డీఎంకే నేత శరవణన్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
జయలలిత స్పృహలో లేని సమయంలో అమె అనుమతి లేకుండా వేలిముద్రలు తీసుకున్నారని, అమె సమ్మతి లేకుండా తీసుకున్న వేలిముద్రలు చెల్లవని ఆ ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ 2016లో శరవణన్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన మద్రాసు హైకోర్టు కర్ణాటకలోని పరప్పణ అగ్రహారం జైలు అధికారుల వద్ద జయలలిత వేలిముద్రలు కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను తప్పుబడుతూ జయలలిత వేలిముద్రల సేకరణను విరమించుకోవాలని సుప్రీకోర్టు తాజాగా తీర్పునిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment