thamilnadu
-
ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత
చెన్నై: చెన్నై, తిరువనంతపురం ఎయిర్‌పోర్టులలో అధికారులు భారీ మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. రెండు ఘటనల్లో మొత్తం రూ.14 కోట్ల విలువగల బంగారాన్ని సీజ్ చేశారు. విదేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న వ్యక్తులను అరెస్టు చేశారు. చెన్నై ఎయిర్‌పోర్టులో 8.49 కేజీల బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. దీని విలువ రూ 4.55 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. తిరువనంతపురం ఎయిర్ పోర్ట్ లో కూడా భారీ మొత్తంలో బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. రూ. 9.11 కోట్ల విలువ చేసే 16.86 కేజీల గోల్డ్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సింగపూర్, మలేషియా, దుబాయ్, అబుదాబీ ప్రయాణికుల నుంచి బంగారాన్ని పట్టుకున్నట్లు వెల్లడించారు. ఈ కేసులో కస్టమ్స్ అధికారులు ఐదుగుర్ని అరెస్ట్ చేశారు. ఇదీ చదవండి: సైనికులతో మోదీ దీపావళి వేడుకలు -
రజనీ, కమల్‌ను నమ్ముకుంటే భవిష్యత్ ఉండదు..!
సాక్షి, చెన్నై : తమిళనాడులో నెలకొన్న రాజకీయ అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో జాతీయ పార్టీ బీజేపీ అక్కడ పాగా వేయాలని చూస్తోంది. అధికార అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకుంటుందని కొందరు, లేదు డీఎంకేతో పొత్తు పెట్టుకుంటుందని మరికొందరు గతంలో అభిప్రాయాలు వ్యక్తం చేశారు. తాజాగా.. సినీ స్టార్లు రజనీకాంత్, కమల్ హాసన్‌లు కూడా తమిళ రాజకీయాల్లోకి దూకిన సంగతి తెలిసిందే. అయితే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ రజనీకాంత్ లేదా కమల్ హాసన్ పార్టీలతో జతకట్టనుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. వీటిపై ఆ పార్టీ సీనియర్ నేత, ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్య స్వామి స్పందించారు. సొంతంగా ప్రయత్నిస్తే కనీస ఓటు బ్యాంక్ అయినా సాధించవచ్చనీ, రజనీ.. కమల్ పార్టీలతో పొత్తు వల్ల బీజేపీకి ఎలాంటి ప్రయోజనాలు ఉండవని మీడియాకు వెల్లడించారు. ఎవరినో నమ్మి ముందుకెళ్తే పార్టీకి భారీ నష్టం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. సినీస్టార్ల రాజకీయాలపై బీజేపీ కార్యవర్గ సమావేశంలో చర్చించాలని సూచించారు. కరునానిధి మరణానంతరం పార్టీ బాధ్యతలు చేపట్టిన ఎంకే స్టాలిన్‌కే పార్టీని నడిపించే సమర్థత ఉందని వ్యాఖ్యానించారు. -
మహిళా కంటెస్టంట్లకు క్లాస్ పీకిన బిగ్‌బాస్
సాక్షి, చెన్నై: తమిళంలో గత ఏడాది ప్రారంభమైన బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షో బాగా ప్రాచుర్యం పొందింది. దీంతో ఇప్పుడు సీజన్-2 నడుస్తోంది. మొదటి భాగానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన కమలహాసన్‌నే ఈ సీజన్‌కు ఆ బాధ్యతను చేపడుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ సీజన్లో బిగ్‌బాస్ కుటుంబసభ్యులుగా పాల్గొన్న వారిలో కొందరు అసభ్యంగా ప్రవర్తిస్తుండడాన్ని కమలహాసన్ ఖండించారు. ఆదివారం ఎపిసోడ్లో పాల్గొన్న కమలహాసన్ బిగ్‌బాస్ సభ్యుల్లో నటుడు మహత్ రాత్రివేళ మహిళల గదిలో పడుకోవడం, అతను, నటి యాషికా సన్నిహితంగా ఉండడం వంటి సంఘటనపై సహ కుటుంబ సభ్యుడు పొన్నంబళంని తీవ్రంగా ఖండించారు. మహిత్, యాషికా, ఐశ్వర్యదత్ల అసభ్య ప్రవర్తన ఆయనకు నచ్చలేదు. ఇక్కడ కొందరు హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారని, అలా జరగకూడదని, ఈ షోను ఆబాలగోపాలం వీక్షిస్తున్నారని, మనకంటూ ఓ సంప్రదాయం ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నటుడు పొన్నంబళం వ్యాఖ్యల్ని కమలహాసన్ సమర్థించారు. పొన్నంబళం, వైద్యనాథన్ బిగ్‌బాస్ హౌస్‌పై మర్యాద కలిగిన వారని పేర్కొన్నారు. మగవారు చేసే తప్పులను మహిళలు చెయ్యకూడదని, పురుషులు కంటే కూడా మంచి కార్యాలను చేసి స్త్రీలు వారిని మార్చవచ్చునని వారికి క్లాస్ పీకారు. సద్వినియోగం చేసుకోండి: మీరు ఇంకా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోలేదని కమల్‌హాసన్ అన్నారు. దీన్ని మీరు హితబోధ అనో, హెచ్చరికగానో, టిప్స్ అనో ఏదైనా అనుకోండని అన్నారు. మీకు ఇవ్వబడిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. సినిమాలో తానూ అలానే మంచి పేరు సంపాదించానని చెప్పారు. ఆరంభంలో తననెవరూ పట్టించుకోలేదన్నారు. అలాంటి సమయంలో దర్శకుడు కే.బాలచందర్ దృష్టిలో పడేలా కొన్ని కార్యాలు చేసి పేరు తెచ్చుకున్నానని తెలిపారు. మీరు మీరుగా ఉంటూ ఇక్కడ తప్పులను సరిదిద్దుకోండని కమలహాసన్ హితవు పలికారు. -
‘తూత్తుకుడి బాధ్యులు డీఎంకే-కాంగ్రెస్’
సాక్షి, చెన్నై: తూత్తుకుడి ఘటనకు డీఎంకే-కాంగ్రెస్ పార్టీలే బాధ్యత వహించాలని తమిళనాడు ముఖ్యముంత్రి కె. పళనిస్వామి ఆరోపించారు. తూత్తుకుడి ఘటనపై ప్రతిపక్ష నేత, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ పళని ప్రభుత్వంపై అసెంబ్లీలో తీవ్ర స్థాయిలో విమర్శించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన సీఎం బుధవారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. స్టెరిలైట్‌కు డీఎంకే, కాంగ్రెస్ ప్రభుత్వాల కాలంలోనే అనుమతులన్ని వచ్చాయని, ఈ ఘటనకు డీఎంకే- కాంగ్రెస్ బాధ్యత వహించాలని పేర్కొన్నారు. డీఎంకే భాగస్వామిగా ఉన్న యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఫ్యాక్టరీకి కావాల్సిన భూములకు అనుమతినిచ్చిందన్నారు. 2009లో స్టాలిన్ పరిశ్రమలశాఖ మంత్రిగా ఉన్న సమయంలో స్టెరిలైట్ రెండో దశ విస్తరణకు 230 ఎకరాల భూమిని కేటాయించారని తెలిపారు. ఘటనలో 13మంది మరణించగా, 58 మంది ఆందోళనకారులు, 72 మంది పోలీసు సిబ్బందికి తీవ్ర గాయలైనట్లు సీఎం అసెంబ్లీలో ప్రకటించారు. ఘటనపై ముఖ్యమంత్రి శ్వేత పత్రం విడుదల చేయాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. స్టెరిలైట్‌కు నిరసనగా తాము అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు స్టాలిన్ తెలిపారు. -
జయలలిత వేలిముద్రలపై సుప్రీం తీర్పు
సాక్షి, చెన్నై: దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వేలిముద్రల కేసుపై సుప్రీంకోర్టు తాజా తీర్పును వెలువరించింది. జయలలిత వేలిముద్రలు సమర్పించాలని పరప్పణ అగ్రహారం జైలు అధికారులకు మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు బుధవారం తోసిపుచ్చింది. కేసు విచారణలో భాగంగా జయ లలిత వేలిముద్రలు సేకరించడాన్ని నిలుపుదల చేయాలని, వేలిముద్రలు లేకుండానే కేసు విచారణ పూర్తి చేయాలని మద్రాసు హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. తిరుపరంకండ్రం అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఏఐడీఎంకే నేత ఎకే బోస్ ఎన్నికను సవాలు చేస్తూ డీఎంకే నేత శరవణన్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. జయలలిత స్పృహలో లేని సమయంలో అమె అనుమతి లేకుండా వేలిముద్రలు తీసుకున్నారని, అమె సమ్మతి లేకుండా తీసుకున్న వేలిముద్రలు చెల్లవని ఆ ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ 2016లో శరవణన్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన మద్రాసు హైకోర్టు కర్ణాటకలోని పరప్పణ అగ్రహారం జైలు అధికారుల వద్ద జయలలిత వేలిముద్రలు కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను తప్పుబడుతూ జయలలిత వేలిముద్రల సేకరణను విరమించుకోవాలని సుప్రీకోర్టు తాజాగా తీర్పునిచ్చింది. -
నా భార్యను విడిపించండి
పెరంబూరు(తమిళనాడు): హాస్యనటుడు, బుల్లితెర యాంకర్ దాడి బాలాజీ బుధవారం చెన్నై కమిషనర్ కార్యాలయంలో ఒక ఫిర్యాదు చేశారు. అందులో ఒక ఎస్ఐ, ఒక జిమ్ శిక్షకుడు తనను, భార్యను బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. వివరాల్లోకెళ్లితే... దాడి బాలాజీకి అతని భార్య నిత్యకు మధ్య ఆరు నెలలక్రితం మనస్పర్థలు తలెత్తాయి. దీంతో ఇద్దరూ విడిగా జీవిస్తున్నారు. నిత్య ఆ మధ్య తన భర్త రోజూ తనను హింసిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో దాడి బాలాజీ బుధవారం చెన్నై పోలీస్‌కమిషనర్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశాడు. తాను, భార్య నిత్య కలిసి జీవించాలనుకుంటున్నా, ఒక ఎస్ఐ, మరో జిమ్ శిక్షకుడు అడ్డుకుంటున్నారని ఆరోపించాడు. తన భార్యకు ఫేస్బుక్ ద్వారా ఒక జిమ్ శిక్షకుడు పరిచయం అయ్యాడని, అతని ప్రవర్తన నచ్చక తన భార్యను హెచ్చరించానని, అయినా తను నా మాట వినలేదని అన్నారు. అప్పటి నుంచి తమ కుటుంబంలో సమస్యలు మొదలయ్యాయని తెలిపారు. ఈ విషయమై తాను సీఐకు పిర్యాదు చేశానని, అయితే ఆయన జిమ్ శిక్షకుడి పక్కన చేరి తన భార్యను, తనను కలవకుండా అడ్డుపడుతున్నాడని పేర్కొన్నాడు. అంతే కాకుండా వారిద్దరూ తనను, తన భార్యను బెదిరిస్తున్నారని, వారి చెరనుంచి తన భార్యను విడిపించి తనకు అప్పగించాలని కోరారు. అదే విధంగా ఆ ఎస్ఐ, జిమ్ శిక్షకుడిపై తగిన చర్యలు తీసుకోవలసిందిగా విజ్ఞప్తి చేశారు. -
ఈ నెల 26న షూటింగులు రద్దు
తమిళసినిమా: ఈ నెల 26వ తేదీన సినిమా షూటింగ్‌లను రద్దు చేస్తున్నట్లు తమిళ నిర్మాతల మండలి ప్రకటించింది. ఇంతకుముందు దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్య (ఫెఫ్సీ) సమ్మె కారణంగా మూడు రోజుల పాటు షూటింగులు రద్దయిన విషయం తెలిసిందే. ఆ సమస్య చర్చల్లోనే ఉంది. కాగా ఈ నెల 26వ తేదీన షూటింగులను ఒక్క రోజు రద్దు చేయనున్నట్లు తమిళ నిర్మాతలమండలి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. అందులో పేర్కొంటూ దక్షిణ భారత సినీ, బుల్లితెర స్టంట్ దర్శకులు, స్టంట్ కళాకారుల సంఘం 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 26వ తేదీన చెన్నైలో స్వర్ణోత్సవ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహించనుందన్నారు. అందువల్ల ఆ రోజున షూటింగులను రద్దు చేయవలసిందిగా కోరడంతో అంగీకరించినట్లు తమిళ నిర్మాతల మండలి నిర్వాహకులు పేర్కొన్నారు.