
పెరంబూరు(తమిళనాడు): హాస్యనటుడు, బుల్లితెర యాంకర్ దాడి బాలాజీ బుధవారం చెన్నై కమిషనర్ కార్యాలయంలో ఒక ఫిర్యాదు చేశారు. అందులో ఒక ఎస్‌ఐ, ఒక జిమ్ శిక్షకుడు తనను, భార్యను బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. వివరాల్లోకెళ్లితే... దాడి బాలాజీకి అతని భార్య నిత్యకు మధ్య ఆరు నెలలక్రితం మనస్పర్థలు తలెత్తాయి. దీంతో ఇద్దరూ విడిగా జీవిస్తున్నారు. నిత్య ఆ మధ్య తన భర్త రోజూ తనను హింసిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో దాడి బాలాజీ బుధవారం చెన్నై పోలీస్‌కమిషనర్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశాడు. తాను, భార్య నిత్య కలిసి జీవించాలనుకుంటున్నా, ఒక ఎస్‌ఐ, మరో జిమ్ శిక్షకుడు అడ్డుకుంటున్నారని ఆరోపించాడు.
తన భార్యకు ఫేస్‌బుక్ ద్వారా ఒక జిమ్ శిక్షకుడు పరిచయం అయ్యాడని, అతని ప్రవర్తన నచ్చక తన భార్యను హెచ్చరించానని, అయినా తను నా మాట వినలేదని అన్నారు. అప్పటి నుంచి తమ కుటుంబంలో సమస్యలు మొదలయ్యాయని తెలిపారు. ఈ విషయమై తాను సీఐకు పిర్యాదు చేశానని, అయితే ఆయన జిమ్ శిక్షకుడి పక్కన చేరి తన భార్యను, తనను కలవకుండా అడ్డుపడుతున్నాడని పేర్కొన్నాడు. అంతే కాకుండా వారిద్దరూ తనను, తన భార్యను బెదిరిస్తున్నారని, వారి చెరనుంచి తన భార్యను విడిపించి తనకు అప్పగించాలని కోరారు. అదే విధంగా ఆ ఎస్‌ఐ, జిమ్ శిక్షకుడిపై తగిన చర్యలు తీసుకోవలసిందిగా విజ్ఞప్తి చేశారు.