thadi balaji
-
కోర్టు మెట్లెక్కిన నటుడి భార్య
పెరంబూరు(తమిళనాడు): హాస్య నటుడు దాడి బాలాజీ భార్య నిత్య అతని నుంచి విడాకులు కోరుతూ చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టును ఆశ్రయించింది. దాడిబాలాజీ బుల్లితెర వ్యాఖ్యాతగా మంచి పేరు సంపాదించుకున్నాడు. బాలాజీకి, అతని భార్య నిత్యకు మధ్య కొన్ని నెలలుగా మనస్పర్థలు ఏర్పడడంతో వేర్వేరుగా జీవిస్తున్నారు. తన భర్త నిత్యం కొడుతూ చిత్రహింసలకు గురి చేస్తున్నాడంటూ నిత్య ఇటీవల చెన్నై పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. ఆ తరువాత బాలాజీ కూడా కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. అందులో.. తన భార్యను ఒక సబ్ ఇన్స్పెక్టర్, జిమ్ నిర్వాహకుడు బెదిరింపులకు గురి చేస్తున్నారని పేర్కొన్నాడు. వారు ఫేస్బుక్ ద్వారా తన భార్యకు పరిచయం అయ్యారని, అప్పటి నుంచి తమ మధ్య మనస్పర్థలు మొదలయ్యాయని పేర్కొన్నాడు. తాను భార్యతో కలిసి జీవించడానికి ఆ ఇద్దరు అడ్డు పడుతున్నారని, వారి నుంచి తన భార్యను కాపాడాల్సిందిగా కోరారు. బాలాజీ ఆరోపణలు ఖండించిన నిత్య, బాలాజీ తనకు అక్రమ సంబంధాలు అంటకడుతున్నాడని మండిపడ్డారు. ఆతని ఆరోపణలతో సబ్ ఇన్స్పెక్టర్, జిమ్ నిర్వాహకుడి కుటుంబాల్లో సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. వారితో తనకెలాంటి సంబంధాలు లేవని చెప్పారు. తాను ఇకపై భర్తతో కలిసి జీవించలేనని, అందుకే చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టులో విడాకులు కోరుతూ పిటిషన్ దాఖలు చేసినట్టు తెలిపారు. -
నా భార్యను విడిపించండి
పెరంబూరు(తమిళనాడు): హాస్యనటుడు, బుల్లితెర యాంకర్ దాడి బాలాజీ బుధవారం చెన్నై కమిషనర్ కార్యాలయంలో ఒక ఫిర్యాదు చేశారు. అందులో ఒక ఎస్ఐ, ఒక జిమ్ శిక్షకుడు తనను, భార్యను బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. వివరాల్లోకెళ్లితే... దాడి బాలాజీకి అతని భార్య నిత్యకు మధ్య ఆరు నెలలక్రితం మనస్పర్థలు తలెత్తాయి. దీంతో ఇద్దరూ విడిగా జీవిస్తున్నారు. నిత్య ఆ మధ్య తన భర్త రోజూ తనను హింసిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో దాడి బాలాజీ బుధవారం చెన్నై పోలీస్‌కమిషనర్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశాడు. తాను, భార్య నిత్య కలిసి జీవించాలనుకుంటున్నా, ఒక ఎస్ఐ, మరో జిమ్ శిక్షకుడు అడ్డుకుంటున్నారని ఆరోపించాడు. తన భార్యకు ఫేస్బుక్ ద్వారా ఒక జిమ్ శిక్షకుడు పరిచయం అయ్యాడని, అతని ప్రవర్తన నచ్చక తన భార్యను హెచ్చరించానని, అయినా తను నా మాట వినలేదని అన్నారు. అప్పటి నుంచి తమ కుటుంబంలో సమస్యలు మొదలయ్యాయని తెలిపారు. ఈ విషయమై తాను సీఐకు పిర్యాదు చేశానని, అయితే ఆయన జిమ్ శిక్షకుడి పక్కన చేరి తన భార్యను, తనను కలవకుండా అడ్డుపడుతున్నాడని పేర్కొన్నాడు. అంతే కాకుండా వారిద్దరూ తనను, తన భార్యను బెదిరిస్తున్నారని, వారి చెరనుంచి తన భార్యను విడిపించి తనకు అప్పగించాలని కోరారు. అదే విధంగా ఆ ఎస్ఐ, జిమ్ శిక్షకుడిపై తగిన చర్యలు తీసుకోవలసిందిగా విజ్ఞప్తి చేశారు. -
కోర్టుకు హాజరైన నటుడు
పెరంబూరు(కర్ణాటక): నగదు మోసం కేసులో నటుడు దాడి బాలాజీ మంగళవారం తిరుపూర్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరయ్యాడు. 2014లో తిరుపూర్‌లోని ఏటీఎంల్లో నగదు నింపేందుకు ఓ ప్రైవేట్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుని ఈ పనిని విష్ణువర్ధన్ అనే వ్యక్తికి అప్పగించింది. అతడు ఆ డబ్బులో రూ.2కోట్లు కాజేసినట్లు నిర్వాహకులు గుర్తించి తిరుపూర్ క్రైమ్‌బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో విష్ణువర్ధన్ కొట్టేసిన సొమ్ములో రూ.5లక్షలు కోవైలో స్టార్‌నైట్ కార్యక్రమం నిర్వహించడానికి నటుడు దాడి బాలాజీకి ఇచ్చినట్లు, ఆయితే ఆ కార్యక్రమం రద్దు కావడంతో ఆ డబ్బును తిరిగి చెల్లించడానికి బాలాజీ నిరాకరించినట్లు తెలిసింది. దీంతో అతన్ని కేసులో నిందితునిగా చేర్చారు. ఈ కేసు తిరుపూర్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో మంగళవారం విచారణకు రాగా దాడి బాలాజీ విచారణకు హాజరయ్యాడు. తదుపరి విచారణను అక్టోబరు 4వ తేదీకి వాయిదా వేసి, ఆ రోజు మళ్లీ కోర్టుకు హాజరు కావలసిందిగా దాడి బాలాజీని న్యాయమూర్తి ఆదేశించారు.