
పెరంబూరు(తమిళనాడు): హాస్య నటుడు దాడి బాలాజీ భార్య నిత్య అతని నుంచి విడాకులు కోరుతూ చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టును ఆశ్రయించింది. దాడిబాలాజీ బుల్లితెర వ్యాఖ్యాతగా మంచి పేరు సంపాదించుకున్నాడు. బాలాజీకి, అతని భార్య నిత్యకు మధ్య కొన్ని నెలలుగా మనస్పర్థలు ఏర్పడడంతో వేర్వేరుగా జీవిస్తున్నారు. తన భర్త నిత్యం కొడుతూ చిత్రహింసలకు గురి చేస్తున్నాడంటూ నిత్య ఇటీవల చెన్నై పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. ఆ తరువాత బాలాజీ కూడా కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు.
అందులో.. తన భార్యను ఒక సబ్ ఇన్‌స్పెక్టర్, జిమ్ నిర్వాహకుడు బెదిరింపులకు గురి చేస్తున్నారని పేర్కొన్నాడు. వారు ఫేస్‌బుక్ ద్వారా తన భార్యకు పరిచయం అయ్యారని, అప్పటి నుంచి తమ మధ్య మనస్పర్థలు మొదలయ్యాయని పేర్కొన్నాడు. తాను భార్యతో కలిసి జీవించడానికి ఆ ఇద్దరు అడ్డు పడుతున్నారని, వారి నుంచి తన భార్యను కాపాడాల్సిందిగా కోరారు. బాలాజీ ఆరోపణలు ఖండించిన నిత్య, బాలాజీ తనకు అక్రమ సంబంధాలు అంటకడుతున్నాడని మండిపడ్డారు. ఆతని ఆరోపణలతో సబ్ ఇన్‌స్పెక్టర్, జిమ్ నిర్వాహకుడి కుటుంబాల్లో సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. వారితో తనకెలాంటి సంబంధాలు లేవని చెప్పారు. తాను ఇకపై భర్తతో కలిసి జీవించలేనని, అందుకే చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టులో విడాకులు కోరుతూ పిటిషన్ దాఖలు చేసినట్టు తెలిపారు.