సాక్షి, చెన్నై : తమిళనాడులో బీజేపీ పార్టీ బలోపేతం దిశగా వడివడిగా అడుగులు వేస్తోందా? 400కుపైగా లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న కషాయ దళానికి దక్షిణాది రాష్ట్రాల్లో గెలుపు కచ్చితంగా అవసరమని భావిస్తోందా? ఒకే దెబ్బకు రెండు పిట్టలన్న చందంగా తమిళనాట అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల కోసం బీజేపీ అధినాయకత్వం సరికొత్త వ్యూహం రచిస్తుందా? అంటే అవుననే అంటున్నాయి తమిళ రాజకీయాలు
ఎన్డీయే కూటమిలోకి పీఎంకే
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో.. 400 ఫ్లస్ సీట్లను ఎన్డీయే టార్గెట్‌గా పెట్టుకుంది. ఇందుకోసం దక్షిణ రాష్ట్రాల్లో గెలుపు కచ్చితంగా అవసరమని భావిస్తోంది. ఈ క్రమంలోనే లక్ష్యం దిశగా..సీట్ల కేటాయింపుల విషయంలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. తమిళనాడులో ఇప్పటికే దినకరన్, మాజీ సీఎం పన్నీర్ సెల్వంతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. అయితే తాజాగా ఎన్డీయే కూటమిలో చేరిన పట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే) కు 10 సీట్లను కేటాయించి ఆసక్తికర చర్చకు దారి తీసింది.
అన్నా డీఎంకే వద్దకు పీఎంకే దూత
పీఎంకే నిర్ణయంతో తమిళనాడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకే (ఏఐఏడీఎంకే) లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ప్రతికూల ప్రభావం పడనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో అత్యంత సీనియర్ రాజకీయ నాయకులలో ఒకరైన పీఎంకే వ్యవస్థాపకుడు ఎస్ రామదాస్ పొత్తు, సీట్లపై చర్చలు బీజేపీతో కాకుండా ఏఐఏడీఎంకేతో జరిపాలని అనుకున్నారు. చర్చలు జరిపేందుకు ఏఐఏడీఎంకే ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామి వద్దకు ఓ దూతను పంపారు.
బీజేపీతో పొత్తు
అదే సమయంలో చెన్నైకి 120 కిలోమీటర్ల దూరంలోని తైలాపురంలో సమావేశమైన పీఎంకే అత్యున్నత స్థాయి కమిటీ బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. అన్నాడీఎంకేని కాదని బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనే నిర్ణయాన్ని పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రామదాస్ ప్రతిపాదించారు. ఆ పార్టీ ఏఐఏడీఎంకేతో తెగతెంపులు చేసుకుని బీజేపీతో పొత్తుతో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.
ఎన్నికల ఒప్పందంపై సంతకమే
పొత్తుపై పీఎంకే ప్రధాన కార్యదర్శి వడివేల్ రావణన్ మాట్లాడుతూ.. ‘బీజేపీతో పొత్తు పెట్టుకుని లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొంటామని పీఎంకే వ్యవస్థాపకుడు ఎస్ రామదాస్ అత్యున్నత స్థాయి కమిటీ సమావేశంలో ప్రకటించినట్లు తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని కూటమిలో చేరాలనే నిర్ణయాన్ని రామదాస్, ఆయన కుమారుడు అన్బుమణి సంయుక్తంగా తీసుకున్నారని’ చెప్పారు. పీఎంకేలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడంపై ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవని పార్టీ నేతలు వెల్లడించారు. అధికారిక ఎన్నికల ఒప్పందంపై సంతకం చేసేందుకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై తైలాపురం వెళ్లనున్నారు.
అన్నామలై ప్రయత్నాలు సఫలం
బీజేపీ కూటమిలో చేరాలని పీఎంకే తీసుకున్న నిర్ణయం, అధికార పార్టీ డీఎంకే, ప్రతిపక్ష పార్టీ ఏఐఏడీఎంకేలకు ధీటుగా బీజేపీ ఎదిగేందుకు.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం చేస్తున్నాయి.
బీజేపీలోకి 15 మంది మాజీ ఎమ్మెల్యేలు
గతంలో బీజేపీ ఎన్డీయే కూటమిలో అన్నాడీఎంకే భాగస్వామిగా ఉండేది. అన్నామలై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్నాడీఎంకే నేతల అవినీతిపై ఆరోపణలు చేశారు. దాంతోపాటు దివంగత ముఖ్యమంత్రి జయలలితను విమర్శించడంతో ఇరు పార్టీల మధ్య విభేదాలు పెరిగాయి. ఈ క్రమంలోనే ఎన్డీయే కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు అన్నాడీఎంకే ప్రకటించింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని 15మంది మాజీ ఎమ్మెల్యేలు, ఒక ఎంపీని బీజేపీలో చేర్చుకుంది.
ఒకే దెబ్బకు
తాజాగా, లోక్‌సభ ఎన్నికల్లో వన్నియార్ సామాజిక వర్గంలో దాదాపు 6 శాతం ఓటు బ్యాంకు ఉన్న పీఎంకేతో జతకట్టింది. ఉత్తర తమిళనాడులో ఓటు షేర్ పెంచుకోవాలని భావిస్తున్న బీజేపీకి పీఎంకేతో పొత్తు మరింత లబ్ధి చేకూర్చుతుంది. దక్షిణ తమిళనాడు అంతటా ఆధిపత్య Mukkulathorలను ఆకర్షించడంలో అన్నాడీఎంకే నాయకులు ఓ పన్నీర్ సెల్వం, టీటీవీ దినకరన్‌ల మద్దతు కూడగట్టుకుంది. లోక్‌సభ ఎన్నికలే కాదు తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేసేలా మోదీ వరుస పర్యటనలు చేయడంతో పాటు, భారీగా నిధులు కేటాయించేందుకు కేంద్రం సిద్ధమైంది.
Comments
Please login to add a commentAdd a comment