సాక్షి, చైన్నె: కొడనాడు హత్య, దోపిడీ కేసులో శశికళను విచారణ వలయంలోకి తెచ్చేందుకు సీబీసీఐడీ నిర్ణయించింది. ఆమెతో పాటు మాజీ ఎమ్మెల్యే ఆరుకుట్టి, ఎడపాడిలో ఉన్న ఓ జ్యోతిష్కుడిని కూడా విచారించేందుకు కసరత్తులు మొదలయ్యాయి. దివంగత సీఎం జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్‌లో 2017లో నవంబర్‌లో జరిగిన వాచ్‌మన్ హత్య, దోపిడీ ఘటన గురించి తెలిసిందే. అన్నాడీఎంకే హయాంలో ఈ కేసును మమా అంటూ ముగించారు. అయితే, ఈ ఘటన వెనుక ఉన్న మిస్టరీని వెలుగులోకి తెచ్చేందుకు తాజాగా డీఎంకే ప్రభుత్వం కంకణం కట్టుకుంది.
తొలుత ఐజీ సుధాకర్, డీఐజీ ముత్తుస్వామి నేతృత్వంలో ప్రత్యేక బృందం ఏడాది కాలంగా విచారించింది. ఆ తర్వాత సీబీసీఐడీకి కేసును అప్పగించారు. ప్రధానంగా మాజీ సీఎం, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడపాడి పళనిస్వామి, ఆయన సన్నిహిత మిత్రుడు ఇలంగోవన్‌ను టార్గెట్ చేసి ఈకేసులో సీబీసీఐడీ దూకుడుగా ముందుకెళుతోంది. గతవారం పళనిస్వామికి భద్రతాధికారిగా పనిచేసిన కనకరాజ్‌ను సీబీసీఐడీ విచారించింది. ఈపరిస్థితులలో ఈకేసులో శశికళ, మాజీ ఎమ్మెల్యే ఆరుకుట్టిని స్వయంగా విచారించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
అలాగే, పళనిస్వామి డ్రైవర్‌గా పనిచేసి అనుమానాస్పదంగా గతంలో మరణించిన కనకరాజ్‌కు ఎడపాడిలోని ఓ జ్యోతిష్కుడికి మధ్య సంబంధాలు ఉన్న సమాచారం సీబీసీఐడీ దృష్టికి చేరింది. దీంతో శశికళ, మాజీ ఎమ్మెల్యే ఆరుకుట్టితోపాటు ఆ జ్యోతిష్కుడిని విచారించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మే మొదటి వారంలో వీరిని విచారించేందుకు చర్యలు చేపట్టారు. ఇందులోభాగంగా సమన్ల జారీకి ఏర్పాట్లు జరుగుతుండడం గమనార్హం.
అదే సమమయంలో పళనిస్వామి నియోజకవర్గం ఎడపాడికి చెందిన జ్యోతిష్కుడి గురించిన సమాచారం తెరపైకి రావడంతో విచారణలో ఎలాంటి ఆసక్తికర అంశాలు బయటకు రానున్నాయో అన్న ఉత్కంఠ మొదలైంది. అలాగే, గతంలో చిన్నమ్మ వద్ద విచారణ బృందం వాంగ్మూలం సేకరించిన నేపథ్యంలో ప్రస్తుతం ప్రత్యక్ష విచారణకు సిద్ధం కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment