శశికళ అన్న కుమార్తె డాక్టర్ కృష్ణప్రియ (ఇళవరసి కూతురు)
సాక్షి, చెన్నై : చెన్నై ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో టీటీవీ దినకరన్ గెలుపు శశికళ కుటుంబాలకు రాజకీయ లాభం చేకూర్చకపోగా విభేదాల చిచ్చుపెట్టింది. దినకరన్‌కు వ్యతిరేకంగా పలువురు కుటుంబ సభ్యులు రాజకీయబాటలు వేస్తుండగా, శశికళ అన్న కుమార్తె డాక్టర్ కృష్ణప్రియ (ఇళవరసి కుమార్తె) ఈనెల 24వ తేదీన జయలలిత జయంతి రోజున రాజకీయ ప్రవేశానికి ముహూర్తం పెట్టుకున్నట్లు సమాచారం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ జైలుకెళ్లడంతో ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంలు ఏకమైన ఆర్కేనగర్ ఎమ్మెల్యే, శశికళ అక్క కుమారుడైన టీటీవీ దినకరన్‌ను పార్టీతో సంబంధం లేకుండా ఏకాకిని చేశారు. ఈపీఎస్, ఓపీఎస్‌లను లెక్కచేయకుండా 20 మందికి పైగా ఎమ్మెల్యేలు దినకరన్ పక్షాన నిలిచారు. ఆ తరువాత పార్టీ, రెండాకుల చిహ్నం ఎడపాడి వశం కావడంతో దినకరన్ వర్గానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు ఎడపాడి వైపు వెళ్లిపోయారు. దీంతో దినకరన్ బలం 18 మంది ఎమ్మెల్యేలకు పడిపోయింది. ఈ 18 మందిపై కూడా స్పీకర్ చేత సీఎం అనర్హత వేటు వేయించారు. ఈ వేటు వివాదం కోర్టులో విచారణ కొనసాగుతోంది.
ఈ పరిణామాలను సవాలుగా తీసుకున్న దినకరన్ ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్య అభ్యర్దిగా పోటీచేసి వ్యూహాత్మకంగా గెలుపొందారు. దినకరన్ గెలుపు ఎడపాడిని బెంబేలుకు గురి చేసింది. అన్నాడీఎంకే పార్టీ, రెండాకుల చిహ్నం, అధికారం చేతిలో ఉన్నా దినకరన్ గెలుపొందడంతో ఎడపాడి, పన్నీరు కంగారుపడగా, జైల్లో ఉన్న శశికళకు అంతులేని ఆనందం కలిగింది. అంతేగాక కొత్తపార్టీ పెట్టాలనే ఆలోచన ఇద్దరిలోనూ మొలకెత్తింది. ఆర్కేనగర్‌లో గెలుపు తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో శాశ్వతంగా నిలబడాలనే ఆశ దినకరన్‌లో ఏర్పడింది. కొత్త పార్టీపై దినకరన్ తరచూ శశికళను కలుస్తున్నారు. అంతేగాక జిల్లాల్లో పర్యటిస్తూ ప్రజలను కలుసుకుంటున్నారు. అయితే కుటుంబ సభ్యులు అప్పుడప్పుడూ దినకరన్ పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు.
దినకరన్ రాజకీయ ఎదుగుదల, శశికళకు మరింత చేరువకావడం కుటుంబ సభ్యులకు కంటగింపుగా మారింది. పైగా శశికళ భద్రంగా దాచి ఉంచిన జయ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీడియో దృశ్యాలను ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో తన గెలుపుకోసం దినకరన్ వినియోగించుకోవడం మరింత మనస్పర్థలకు దారితీసింది. ఇదే అంశంపై కృష్ణప్రియ, దినకరన్‌ల మధ్య విభేధాలు తలెత్తాయి. కృష్ణప్రియ సైతం దినకరన్‌ను వ్యతిరేకంగా పావులు కదపడం ప్రారంభించారు. ఈనెల 24వ తేదీన దివంగత ముఖ్యమంత్రి జయలలిత జయంతి సందర్భంగా రాజకీయ ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ప్రధానంగా ఈ వివాదమే కృష్ణప్రియను రాజకీయ అరంగేట్రానికి పురిగొల్పినట్లు భావిస్తున్నారు. కాగా, శశికళ తమ్ముడు దివాకరన్, ఇళవరసి కుమారుడు వివేక్, కుమార్తె కృష్ణప్రియల అడుగు జాడలోనే దినకరన్ సోదరుడు భాస్కరన్ సైతం రాజకీయ ప్రవేశంపై తహతహలాడుతున్నారు.
శశికళ మనస్తాపం..
2015 డిసెంబరు 4వ తేదీనే జయ కన్నుమూసినట్లు దివాకరన్ ప్రకటించి వివాదం లేవనెత్తడంపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసి ఇకపై అలాంటి ప్రకటనలు చేయరాదని ఖండించారు. ఇలా ఒక్కొక్కరుగా దినకరన్‌కు దూరం జరిగిపోవడమేగాక కుటుంబ సభ్యుల మధ్య కీచులాటలతో శశికళ మనస్తాపానికి గురవుతున్నారని తెలుస్తోంది.
విబేధాలు తీవ్రం..
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 234 స్థానాల్లో పోటీచేస్తామని దినకరన్ సోదరుడు భాస్కరన్ ఇటీవల ప్రకటించారు. భాస్కరన్ చేసిన ప్రకటన దినకరన్ అనుచరుల్లో ఆశ్చర్యాన్ని కలిగించింది. దినకరన్ సోదరుడే రాజకీయాల్లోకి దిగితే ఎవరివైపు నిలవాలనే ఆలోచనలో పడ్డారు. కాగా తిరువళ్లూరు జిల్లా అన్నాడీఎంకే క్యాడర్‌లో కొంతవరకు శశికళ తమ్ముడు దివాకరన్ వైపు ఉండేది. అయితే జయ మరణం తరువాత కొందరు చేజారిపోగా మరి కొంతమంది దినకరన్ పక్షాన నిలిచి ఉన్నారు. వీరందరినీ తనవైపు తిప్పుకోవాలని దివాకరన్ ప్రయత్నాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment