అమ్మపై స్టాలిన్ ధ్వజం | stalin fires on amma | Sakshi
Sakshi News home page

అమ్మపై స్టాలిన్ ధ్వజం

Published Sat, Apr 23 2016 2:57 AM | Last Updated on Sun, Sep 3 2017 10:31 PM

stalin fires on amma

* ప్రజల కష్టాలు తెలియవని విమర్శ
* నియోజకవర్గాల్లో ప్రచారం

టీనగర్: హెలికాప్టర్‌లో పయనించే జయలలితకు ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయని డీఎంకే కోశాధికారి స్టాలిన్ ధ్వజమెత్తారు. విల్లుపురం జిల్లాలో గురువారం రెండో రోజుగా స్టాలిన్ ప్రచారం జరిపారు. శంకరాపురంలో డీఎంకే అభ్యర్థి ఉదయసూర్యన్‌కు మద్దతుగా ప్రచారాన్ని ప్రారంభించిన ఆయన రిషివంద్యం అభ్యర్థి వసంతం కార్తికేయన్, తిరుక్కోవిలూరు అభ్యర్థి పొన్ముడి, చెంజి అభ్యర్థి మస్తాన్‌లకు మద్దతుగా ప్రచారం చేసి రాత్రి దిండివనంలో డీఎంకే అభ్యర్థి సీతాపతి చొక్కలింగంకు మద్దతుగా వండిమేడు ప్రాంతంలో ఓపెన్ టాప్ వ్యానులో ప్రచారం చేశారు.

ఆయన మాట్లాడుతూ మే16వ తేదీన జరుగనున్న ఎన్నికలతో రాష్ట్రానికి విమోచన లభిస్తుందన్నారు. జయలలిత పురుషాధిక్య పాలన అంతమొందాలని, కరుణానిధి ఉన్నతమైన పరిపాలన రావాలని ఆకాంక్షించారు. అధికారంలో ఉన్నా లేకున్నా రైతుల ప్రయోజనాల కోసం డీఎంకే పోరాటాలు సాగిస్తూ వస్తోందన్నారు. 2006 ఎన్నికల్లో వాగ్దానం చేసినట్లుగా రైతుల సహకార బ్యాంకు రుణాలు ఏడు వేల కోట్ల రూపాయలను డీఎంకే ప్రభుత్వం మాఫీ చేసిందన్నారు. ప్రస్తుతం రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉందని, గత ఐదేళ్లలో 2,400 మంది ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి రాష్ట్రంలో అధ్వానమైన ప్రభుత్వం నడుస్తోందన్నారు.

గత 10వ తేదీన డీఎంకే ఎన్నికల మేనిఫెస్టో విడుదలైందని, అందులో రైతులకు ప్రత్యేకంగా బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు తెలిపామన్నారు. పంట రుణాలను మాఫీ చేస్తామని, వరికి రూ.2,500, చెరకుకు రూ.3.500 కొనుగోలు ధర నిర్ణయిస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. రైతు బజార్లను విస్తృతం చేస్తామని, ఇది రైతులకు, పట్టణ ప్రజలకు లబ్ధి చేకూరుస్తుందన్నారు. కొత్త విద్యుత్ మోటార్లు కొనుగోలు చేసేందుకు రూ.10 వేలు సబ్సిడీ, పంచాయతీలు అన్నింటిలోను ధాన్యం సేకరించేందుకు గోదాములు ఏర్పాటవుతాయన్నారు. మరక్కాణంలో చేపల ఓడరేవును ఏర్పాటుచేస్తామని, దిండివనం ప్రజల చిరకాల స్వప్నం అత్యాధునిక బస్టాండును నిర్మిస్తామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులు అత్యాధునిక చికిత్సలు అందజేసే విధంగా అప్‌గ్రేడ్ చేస్తామన్నారు. పారిశ్రామిక వాడలను పునర్మిస్తామని, దీని ద్వారా అనేక వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు.
 
జయకు ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయి?
హెలికాప్టర్‌లో పయనించే జయలలితకు ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయని స్టాలిన్ ప్రశ్నించారు. ప్రస్తుతం ఎన్నికల సభల్లో అబద్ధాలు ఏకరువు పెడుతున్నారని విమర్శించారు. ఆమె సేలంలో ప్రసంగిస్తుండగా ఇద్దరు మృతిచెందారని, విరుదాచలంలో మాట్లాడుతుండగా ఇద్దరు చనిపోయారన్నారు. మండే ఎండల్లో ప్రజల్ని హింసిస్తున్నారని, నీళ్లు తాగేందుకు కూడా పోలీసులు అనుమతించడం లేదన్నారు.

టాస్మాక్ దుకాణాలను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటుచేయడమే ఆమె సాధన అంటూ ఎద్దేవా చేశారు. చెంబరంబాక్కం చెరువును తెరచి అనేక వేల మంది ప్రాణాలను బలిగొన్నారని, వేలాది మంది ప్రజలు ఇళ్లు, వస్తువులు కోల్పోయి నిరాశ్రయులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.  డిఎంకే అధికారంలోకి వస్తే టాస్మాక్ దుకాణాలను మూసివేస్తామని, లోకాయుక్త చట్టాన్ని ప్రవేశపెడతామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement