సభలో శశికళ పేరెత్తడంతో పెద్ద రగడ!
చెన్నై: కే పళనిస్వామి ప్రభుత్వం గురువారం తమిళనాడు అసెంబ్లీలో తన తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా ఆర్థికమంత్రి డీ జయకుమార్ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళ పేరు ప్రస్తావించడం సభలో దుమారం రేపింది. శశికళ పేరును ప్రస్తావించడాన్ని తప్పుబడుతూ ప్రతిపక్ష డీఎంకే సభ్యులు సభలో తీవ్ర ఆందోళనకు దిగారు.
శశికళ పేరు ప్రస్తావనను సభ రికార్డుల నుంచి తొలగించాలని డీఎంకే డిమాండ్ చేసింది. అందుకు అంగీకరించకపోవడంతో స్పీకర్ పీ ధన్‌పాల్‌కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ప్రయత్నించింది. అయితే, గురువారం అసెంబ్లీ ఎజెండా ప్రకారం బడ్జెట్ సమర్పణకు మాత్రమే స్పీకర్ అవకాశమిచ్చారు. మిగతా వ్యవహారాలు తర్వాత చేపట్టవచ్చునని పేర్కొన్నారు.
బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభిస్తూ ఆర్థికమంత్రి జయకుమార్ మొదట దివంగత నేత జయలలితకు నివాళులర్పించారు. ఆ తర్వాత 'గౌరవనీయులైన చిన్నమ్మ' అంటూ శశికళను ప్రస్తావించారు. దీంతో ఆగ్రహించిన ప్రతిపక్ష నేత స్టాలిన్ వెంటనే లేచి నిలబడి నిరసన తెలిపారు. అక్రమాస్తుల కేసులో జైలుపాలైన వ్యక్తి పేరును సభలో ఎలా ప్రస్తావిస్తారని ఆయన అధికారపక్షాన్ని నిలదీశారు. అయితే, తమ పార్టీ అధినేత్రి అయిన శశికశ పేరును ప్రస్తావించడంలో తప్పేమీ లేదని జయకుమార్ సమర్థించుకున్నారు. ఈ రగడ అనంతరం ఆయన బడ్జెట్ ప్రసంగాన్ని యథాతథంగా కొనసాగించారు.