► బినామీ పాలనకు చరమ గీతం
► ప్రజలు, యువతకు స్టాలిన్ పిలుపు
► సభలో జరిగిన విషయంపై వివరణ
► గాయాలు అయ్యాయి
► పార్టీలకతీతంగా ఏకం కావాలని వేడుకోలు
శశికళ నేతృత్వంలోని బినామీ సీఎం పళనిస్వామి పాలనకు చరమ గీతం పాడడం, తమిళనాడును మన్నార్‌గుడి మాఫియా చేతి నుంచి రక్షించుకోవడం లక్ష్యంగా మహోద్యమానికి అందరూ సిద్ధం కావాలని ప్రజలకు, యువతకు డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ పిలుపునిచ్చారు. బల పరీక్ష సమయంలో సభలో జరిగిన వాస్తవాలను ప్రజలకు వివరించారు. రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని, ఆందోళన వ్యక్తం చేస్తూ పార్టీలకతీతంగా ఏకం అవుదామని రాజకీయ పక్షాలను ఆయన కోరారు.
సాక్షి, చెన్నై: డీఎంకే రాష్ట్ర కార్యాలయం అన్నా అరివాలయంలో సోమవారం రాత్రి ఏడు గంటలకు స్టాలిన్ మీడియా ముందుకు వచ్చారు. దివంగత అన్నాదురై, ఎంజీఆర్‌లు అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఉదయం, సాయంత్రం వేళల్లో అ ప్పటి ఆరోగ్య మంత్రులు ఆరోగ్య పరిస్థితిపై బులెటిన్ లు విడుదల చేశారని గుర్తు చేశారు. అయితే, అమ్మ జయలలిత ఆసుపత్రిలో ఉన్నప్పుడు మంత్రులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.
ఆమె మరణం వెనుక మిస్టరీ దాగి ఉందన్న ప్రచారం, ఆరోపణలు బయలుదేరిన సమయంలో శశికళ సీఎం పగ్గాలు చేపట్టేందుకు సిద్ధం కావడం, దానిని వ్యతిరేకిస్తూ పన్నీరు సెల్వం తిరుగుబాటు బావుటా ఎగుర వేయడాన్ని నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. శశికళ కుటుంబం అక్రమాలు పది శాతం మాత్రమే వెలుగులోకి వచ్చి ఉన్నాయని, మరో 90 శాతం త్వరలో ప్రకటిస్తానని పన్నీరు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. వీటిన్నంటిని పరిగణించాలని, మన్నార్‌గుడి మాఫియా అక్రమాలు మరింత తాండవం చేయకుండా, రాష్ట్రాన్ని రక్షించుకునేందుకు బాధ్యత గల ప్రధాన ప్రతిపక్షంగా డీఎంకే సభలో తీవ్రంగానే స్పందించాల్సి వచ్చిందన్నారు.
సభలో ఏమి జరిగిందంటే..
అసెంబ్లీ సమావేశం కాగానే, పన్నీరు మద్దతు ఎమ్మెల్యే సెమ్మలై ప్రసంగాన్ని అందుకుని, తాను గోల్డెన్ బే రిసార్ట్ నుంచి తప్పించుకుని వచ్చానని, తాను బస చేసిన గది తాళాన్ని సభ దృష్టికి తీసుకొచ్చారని వివరించారు. తనతో పాటుగా మరెందరో ఎమ్మెల్యేలు తప్పించుకునే ప్రయత్నం చేసినా, చివరకు శశికళ సేనల చేతికి చిక్కారని సభలో ఆవేదన వ్యక్తం చేసినట్టు గుర్తు చేశారు. అందుకే రహస్య ఓటింగ్ కోరుతున్నామని, ఆయనతో పాటుగా ఆ శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలు కోరడంతో, బాధ్యత గల బలవైున ప్రధాన ప్రతిపక్షంగా స్పీకర్ మీద ఒత్తిడికి నిర్ణయించామన్నారు. రహస్య ఓటింగ్‌కు అనుమతి ఇవ్వాలని, లేని పక్షంలో సభను వారం వాయిదా వేసి, ఎమ్మెల్యేలను నియోజకవర్గాలకు పంపించాలని, తదుపరి బలపరీక్షకు అవకాశం ఇవ్వాలని స్పీకర్ ధనపాల్‌కు సూచించినట్టు తెలిపారు. అయితే, స్పీకర్ ఆ ప్రస్తావన తెచ్చినప్పుడల్లా తమ మీద విరుచుకు పడ్డారని, అందుకు తాము సైతం ఘాటుగానే స్పందించామన్నారు.
సభను వాయిదా వేసి చాంబర్‌కు వెళ్లిన స్పీకర్ తనను పిలిపించారని గుర్తు చేశారు. అక్కడ స్పీకర్ చొక్కా చిరిగి ఉండడంతో, అందుకు ఆస్కారం లేదని, ఒక వేళ తమ ఎమ్మెల్యేల కారణంగా చిరిగి ఉంటే, పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నట్టు స్పీకర్ దృష్టికి తీసుకెళ్లానన్నారు. ఇంతటితో ఈ విషయాన్ని వదలిపెడదామని స్పీకర్ చెప్పారన్నారు. తమను పిలిపించి, ఏదేని నిర్ణయం తీసుకుంటారని భావిస్తే, తమ మీద నిందలు వేయడం, తమ డిమాండ్లకు దిగి రాక పోవడంతో అక్కడి నుంచి సభకు వచ్చేశామన్నారు. సభలో మళ్లీ అదే ప్రస్తావనను తాము తీసుకురాగా, వాయిదా వేసి వెళ్లిపోయారని, చివరకు ఐపీఎస్‌లను మార్షల్స్ దుస్తుల్లో పంపించి బలవంతంగా బయటకు గెంటించారని ధ్వజమెత్తారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించింది కాకుండా, స్పీకర్ చివరగా చేసిన ప్రసంగాన్ని బట్టి చూస్తే, ఎవర్నో రెచ్చగొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారన్నది మాత్రం స్పష్టం అవుతోందన్నారు. తనతో పాటుగా పలువురు ఎమ్మెల్యేలు గాయపడ్డారని, తనకు బయటి గాయాలు లేకున్నా, లోపలి గాయాలు ఉన్నాయని, స్కాన్, ఎక్స్‌రే తీసుకోవాల్సిన అవసరం ఉన్నట్టుందని మీడియా ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
ఉద్యమం తప్పదు
నాలుగు సంవత్సరాల జైలు శిక్షను ఎదుర్కొంటున్న శశికళ నేతృత్వంలోని బినామీ సీఎం పళని స్వామి ప్రభుత్వానికి చరమగీతం పాడాల్సిన అవసరం ఉందన్నారు. సభలో తమ మీద జరిగిన దాడిని ప్రజలకు వివరించాలనే ఈ సమావేశం పెటా్టమని, వాస్తవానికి సభలో జరిగింది ఒకటైతే, మీడియా వర్గాలకు ఎడిటింగ్ చేసి, తామేదో తప్పు చేసినట్టుగా క్లిప్పింగ్‌లను ఇచ్చి ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతగల ప్రధాన ప్రతిపక్షంగానే తాము సభలో నడుచుకున్నామేగానీ, ఎవరికో మద్దతు ఇవ్వాల్సిన అవసరం తమకు లేదన్నారు. అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారాలతో తమకు సంబంధం లేదని, అయితే, ప్రభుత్వం విషయంలో ఢీకొట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
మన్నార్‌గుడి మాఫియా చేతి నుంచి ప్రజల్ని, రాష్ట్రాన్ని రక్షించుకునేందుకు 22న జిల్లా కేంద్రాల్లో దీక్షకు పిలుపు నిచ్చామన్నారు. ఈ దీక్షకు యువత, ప్రజలు, రాజకీయాలకు అతీతంగా పార్టీలు, ప్రజా సంఘాలు తరలిరావాలని, స్పందన మేరకు మహోద్యమానికి శ్రీకారం చుట్టనున్నట్టు ప్రకటించారు. తదుపరి మీడియా ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ, రాష్ట్రపతి అనుమతి కోరి ఉన్నామని, ఢిల్లీ నుంచి పిలుపు రాగానే, బయల్దేరుతామని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. కోరు్టను ఆశ్రయించామని, గవర్నర్ స్పందన మేరకు తదుపరి తమ అడుగులు ఉంటాయన్నారు. శశికళకు వ్యతిరేకంగా ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ఆ ప్రజా మద్దతుతో బినామీ ప్రభుత్వాన్ని దించడం లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు.
కరుణకు స్పీచ్‌థెరపీ
డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై మీడియా ప్రశ్నించగా, కోలుకుంటున్నారన్నారు. వయో భారంతో వచ్చిన సమస్యలు, ఆసుపత్రిలో అందించిన చికిత్సల కారణంగా ప్రస్తుతం ఆయనకు స్పీచ్ థెరపీ సాగుతున్నదని, త్వరలో అందరి ముందుకు వస్తారన్న ఆశాభావంతో ఉన్నామన్నారు. ఆయన రాజకీయాలో్లనే ఉన్నారని, తనకు సూచనలు, సలహాలు ఇస్తూ వస్తున్నారని వివరించారు.