ఇక శశికళ వర్సెస్ స్టాలిన్
న్యూఢిల్లీ: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కన్నుమూత నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ డీఎంకేలో కూడా కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇంతకాలం ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఉంటున్న ఎం. కరుణానిధి కూడా తన రాజకీయ వారసుడైన ఎంకే స్టాలిన్‌కు పార్టీ పగ్గాలు అప్పగించనున్నారు. స్టాలిన్ ప్రస్తుతం పార్టీకి కోశాధికారిగా ఉన్నారు.
ఆనాడు ఎంజీ రామచంద్రన్‌కు, ఆ తర్వాత జయలలితకు సమాన స్థాయి నాయకుడిగా డీఎంకే పార్టీకి సారథ్యం వహిస్తూ వచ్చిన ఎం. కరుణానిధికి ఇక ఇప్పుడు ఆ అసరం లేదని, క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన అవసరం వచ్చిందని పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఆయన స్థానంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా స్టాలిన్ పార్టీ పగ్గాలు స్వీకరిస్తారని, డిసెంబర్ 20వ తేదీన జరిగే పార్టీ సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు నిర్ణయం జరుగుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
అనారోగ్యంతోపాటు....
94 ఏళ్ల కరుణానిధికి ఆరోగ్యం కూడా సరిగ్గా సహకరించడం లేదు. అనారోగ్యం కారణంగా వారం రోజులపాటు ఆస్పత్రిలో ఉండి మొన్ననే ఇంటికి వచ్చారు. ఈ కారణమే కాకుండా తనకు సమాన స్థాయిగల నాయకులు ఇప్పుడు లేరుకనుక ఆయన క్రియాశీలక బాధ్యతల నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నారని విశ్వసనీయ వర్గాలు వివరించాయి. త్వరలో ఏఐఏడీఎంకే బాధ్యతలు స్వీకరించనున్న శశికళకు, కరుణానిధికి ఏ విషయంలో కూడా పోలికలేదని, నాయకత్వం మార్పునకు ఇదే తగిన సమయమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
ఎప్పటి నుంచో చెబుతున్న మాట...
తన రాజకీయ వారసుడు ఎంకే స్టాలిన్ అంటూ ఎం. కరుణానిధి మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. గతంలోనే తాను తప్పుకొని పార్టీ బాధ్యతలు స్టాలిన్‌కు అప్పగించాలని కూడా అనుకున్నారు. అయితే ఆయన పెద్ద కుమారుడు ఎంకే అళగిరి అందుకు వ్యతిరేకిస్తూ రావడం వల్ల కుదరలేదు. 2014లో పార్టీ నుంచి అళగిరిని బయటకు పంపించడంతో ఇప్పుడు స్టాలిన్‌ను అడ్డగించే వారు ఎవరూ లేరు. శశికళతో పోలిస్తే స్టాలిన్‌కే రాజకీయానుభవం ఎంతో ఎక్కువ.
డిప్యూటీ సీఎంగా కూడా....
1953లో జన్మించిన స్టాలిన్ 1989లో తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1996 నుంచి 2001 వరకు నగర మేయర్‌గా పనిచేశారు. 2009 నుంచి 2011 వరకు డిప్యూటీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఎమర్జెన్సీని వ్యతిరేకించి జైలుకు వెళ్లడం ద్వారా ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. పార్టీ అధ్యక్ష పదవిలో కరుణానిధే కొనసాగుతారని, వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో పార్టీ బాధ్యతలను స్టాలిన్ స్వీకరిస్తారని తెల్సింది. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి పార్టీలో లేనందున పార్టీ సర్వసభ్య సమావేశంలో పార్టీ రాజ్యాంగాన్ని కూడా మారుస్తారని తెల్సింది.