తమిళనాడులో ఏం జరగొచ్చు?
చెన్నై: జయలలిత మరణం తర్వాత తమిళనాడు అసెంబ్లీలో 233 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు 117 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. పన్నీర్ సెల్వంకు 50 మందికిపైగా ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. మరికొంత మంది తన వర్గంలో చేరితే ఆయన బలం పెరుగుతుంది. అంతేకాకుండా ప్రతిపక్ష నేత స్టాలిన్ సైతం పన్నీర్‌కు అండగా నిలుస్తున్నారు. డీఎంకేకు 89 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. పన్నీర్ రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. ఆయన తన రాజీనామాను వెనక్కి తీసుకుంటే.. సీఎం పదవిలో కొనసాగేం దుకు అవకాశం ఉంది. పన్నీర్‌సెల్వంను ముఖ్యమంత్రిగా కొనసాగించేందుకు రాజ్యాంగపరంగా గవర్నర్‌కు ఎలాంటి అడ్డంకులు ఉండబోవు. సీఎం రాజీనామా చేసినా, రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తినా ఇప్పటికిప్పుడు ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేమీ లేదు. ప్రభుత్వం యథావిధిగానే పనిచేస్తుంది.
ఎందుకంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేవరకూ పన్నీర్ సెల్వం కేబినెట్ కొనసాగాలంటూ గవర్నర్ కోరారు. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థ కుప్పకూలిందని గవర్నర్ భావిస్తే రాష్ట్రపతి పాలన విధించేందుకు అవకాశం ఉంటుంది. తమిళనాడు పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుచక్రం వేస్తోంది. గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు అందుబాటులో లేకపోవడంతో ఆమె ప్రమాణ స్వీకార కార్యక్రమం వాయిదా పడిన సంగతి తెలిసిందే. శశికళపై తిరుగుబాటు చేస్తున్న పన్నీర్‌సెల్వంకు బీజేపీ ఆశీస్సులు ఉన్నట్లు సమాచారం. సెల్వంతో బలవంతంగా రాజీనామా చేయించడం చట్టవిరుద్ధమని బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్.రాజా ట్వీటర్‌లో పేర్కొన్నారు.