రిమోట్ కాదు.. తుపాకీ
- చిన్నమ్మపై పన్నీరు సెల్వం తిరుగుబాటు
- ‘అమ్మ’ సెంటిమెంటే అస్త్రం
చెన్నై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: అన్నా డీఎంకేకు విధేయుడిగా, ‘అమ్మ’ చేతిలో రిమోట్‌గానే తమిళనాడు ప్రజలకు తెలిసిన పన్నీర్ సెల్వం పెద్ద గన్ను పేల్చారు. తాను జయలలితకు మాత్రమే రిమోట్‌ననీ, శశికళ లాంటి వాళ్లకు తుపాకీ లాంటి వాడినని చెప్పకనే చెప్పారు. సౌమ్యుడు, వివాదరహితుడు, మృదు స్వభావి, భయానికి బ్రాండ్ అంబాసిడర్‌గా గుర్తింపు పొందిన సెల్వం ఈ తరహా తిరుగుబాటు చేయడం రాజకీయ వర్గాలనే కాకుండా ప్రజలను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ‘అమ్మ’ సెంటిమెంట్‌తో ఆయన పేల్చిన తుపాకీ చిన్నమ్మను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
అప్పుడే తెరచాటు తిరుగుబాటు: జయలలిత మృతి చెందిన వెంటనే శశికళ దూకుడు పెంచారు. అయితే, ప్రధాని నరేంద్రమోదీ అండతో పన్నీర్‌సెల్వం అప్పట్లోనే పరోక్షంగా తిరుగుబాటు చేశారు. ఆయన మద్దతుతో రాత్రికి రాత్రే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. శశికళ ఒత్తిడి మేరకు సీఎం పదవికి రాజీనామా చేశాక రెండు రోజులు మౌనంగా ఉన్న పన్నీర్ సెల్వం ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత స్టాలిన్ అండతో గళం విప్పారు. జయలలిత సమాధి సాక్షిగా చిన్నమ్మపైనే నేరుగా తుపాకీ ఎక్కుపెట్టారు. జయలలిత మృతిపై విచారణ కోసం సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఒక కమిషన్ వేయాలన్నారు. ‘అమ్మ’ మృతిపై ప్రజల్లో ఇప్పటికే ఉన్న అనుమానాలకు మరింత బలం చేకూర్చారు. ‘అమ్మ’ ఆత్మ ఆదేశం మేరకు పార్టీని, ప్రభుత్వాన్ని రక్షించడానికే తాను తిరుగుబాటు చేశానని చెప్పుకుని పార్టీ శ్రేణులు, ప్రజల్లో సానుభూతి సంపాదించే పాచిక విసిరారు. అలాగే జయ కుటుంబ సభ్యుల మద్దతు కూడగట్టేందుకు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే జయ అన్న కుమార్తె దీపను తనతో చేతులు కలపాల్సిందిగా ఆహ్వానించారు.
రాష్ట్ర పర్యటనకు ఏర్పాట్లు: శశికళపై పార్టీలోనే కాకుండా ప్రజల్లో కూడా వ్యతిరేకత ఉందనే విషయాన్ని కేంద్ర ం దృష్టికి తీసుకెళ్లడానికి పన్నీర్ సెల్వం రాష్ట్ర పర్యటనకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. శాసనసభలో బల నిరూపణకు తనకు సమయం లభిస్తుందని ఆయన నమ్ముతున్నారు. ఈలోగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించాలని నిర్ణయించారు.
యువత మద్దతుకు వ్యూహం: తమిళనాడు యువత మద్దతు కూడగట్టేందుకు పన్నీర్ సెల్వం ప్రయత్నాలు చేస్తున్నారు. గురువారం నుంచి మెరీనా బీచ్ వేదికగా యువతతో ఉద్యమం చేయించేందుకు వ్యూహ రచన చేశారు.