ఇదిగో సాక్ష్యం
► ముడుపుల వీడియో ప్రదర్శించిన స్థాలిన్
► చర్చకు అనుమతించని అధికారపక్షం
► అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన విపక్షం
రాష్ట్రాన్ని అప్రతిష్టపాలు చేసిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేల ముడుపుల వ్యవహారంపై ఇదిగో సాక్ష్యమంటూ ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ సీడీని ప్రదర్శించడంతో శుక్రవారం నాటి అసెంబ్లీ సమావేశాలు కొద్దిసేపు స్తంభించిపోయాయి. చర్చకు అనుమతించాలనే డిమాండ్‌పై విపక్షాలు పట్టువీడకపోవడం, ససేమిరా అంటూ అధికారపక్షం భీష్మించుకోవడం, వాకౌట్‌లతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
సాక్షి ప్రతినిధి, చెన్నై: విశ్వాస పరీక్ష నెగ్గడం ద్వారా ప్రభుత్వాన్ని తమ చేతుల్లోకి తీసుకునే ప్రయత్నంలో భాగంగా శశికళ, పన్నీర్‌సెల్వం వర్గాలు ఎమ్మెల్యేలకు భారీ ఎత్తున ముడుపులు ముట్టజెప్పారని ఎమ్మెల్యే శరవణన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ప్రయివేటు ఇంగ్లి్లషు చానల్‌లో ప్రసారమైన ఇంటర్వూ్య తనదే, అయితే గొంతు మాత్రం వేరేవారిదని శరవణన్ కప్పిపుచ్చే ప్రయత్నం చేసినా విపక్షం మాత్రం నమ్మడం లేదు. ఈనెల 14వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతుండగా, ప్రతిరోజూ ఇదే అంశంపై సభ అట్టుడికి పోతోంది.
ముడుపుల వ్యవహారంపై చర్చకు స్పీకర్ ధనపాల్ గట్టిగా నిరాకరిస్తుండగా, డీఎంకే సభ్యులు అదేపనిగా పట్టుబడుతూనే ఉన్నారు. ఆధారం లేని ఆరోపణలపై అసెంబీలో చర్చకు తావులేదనే వాదనతో గురువారం నాటి సమావేశంలో స్పీకర్ అడ్డుకున్నారు. శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయం ముగియగానే స్టాలిన్ లేచి నిలబడి ముడుపులపై ప్రసంగించడం ప్రారంభించి సభలో ఆధారాలను సమర్పించేందుకు సిద్ధమన్నారు. ఆ తరువాత డీఎంకే ఉపసభాపక్ష నేత దురైమురుగన్ కూడా మాట్లాడారు. అయితే వీరిద్దరి ప్రసంగాలు అభ్యంతరకంగా ఉన్నందున రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించడంతో డీఎంకే సభ్యులంతా వాకౌట్ చేశారు.
రాష్ట్రంలో పేదలకు 10లక్షల ఇళ్ల నిర్మాణాలను త్వరలో చేపట్టనున్నట్లు మంత్రి ఉడుమలై రా«ధాకృష్ణన్ సభలో ప్రకటించారు. మదురైలో బ్రహ్మాండమైన గ్రంధాలయం, పుస్తక ప్రదర్శనశాలను ఏర్పాటు చేస్తున్నామని, చెన్నైలోని అన్నా గ్రంధాలయ అభివృద్ధికి రూ.5 కోట్లు కేటాంచామని మంత్రి సెంగొట్టయ్యన్ తెలిపారు. అసెంబ్లీ నుంచి బైటకు వచ్చిన అనంతరం స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ ముడుపులపై ఆధారాలు లేవని చర్చకు నిరాకరించారు, నేడు ఆధారాలతో కూడిన సీడీని సిద్ధం చేసుకుని అసెంబ్లీకి వెళ్లినట్లు చెప్పారు. అసెంబ్లీకి ఆధారాలు సమర్పించేందుకు సిద్ధమని చెప్పినా చర్చకు అనుమతించక పోవడం విడ్డూరమని అన్నారు.
సచివాలయంలో సర్పాలు:
రాజకీయ రణగొణ ధ్వనులతో అసెంబ్లీ ఒకవైపు దద్దరిల్లుతుండగా సచివాలయ ప్రాంగణంలో రెండు సర్పాలు ప్రవేశించి అందరినీ భయపెట్టాయి. గురువారం ఉదయం 8.45 గంటల సమయంలో సచివాలయ ప్రవేశ ద్వారం సమీపంలో పిచ్చిమొక్కలను పారిశుద్ధ్య సిబ్బంది పీకి వేస్తున్నారు. అదే సమయంలో ఐదడుగుల చారల పాము మెల్లగా సచివాలయంలోకి ప్రవేశించడాన్ని కనుగొన్నారు.
పారిశుద్ధ్య సిబ్బంది వెంటనే సమీపంలోని సీఐకి తెలుపగా ఆయన ఇచ్చిన సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన చేరుకుని మొక్కల్లో నక్కి ఉన్న పామును లాఘవంగా పట్టుకోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఇదిలా ఉండగా గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో మీడియా ప్రతినిధుల చాంబర్ సమీపంలో మరో పాము దర్శనమిచ్చి దడపుట్టించింది. అగ్నిమాపక సిబ్బందిని ముప్పుతిప్పలు పెట్టిన అనంతరం పాము చిక్కడంతో టెన్షన్ వీడింది.