పన్నీర్ గృహప్రవేశం
► పోయెస్‌గార్డెన్ లోకి మారిన మాజీ సీఎం
► కొత్త ఇంటి నుంచే రాజకీయాలు
సాక్షి ప్రతినిధి, చెన్నై: మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం పోయెస్‌గార్డెస్ లోని తన కొత్త నివాసంలో గురువారం గృహప్రవేశం చేశారు. సంప్రదాయబద్ధంగా తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంటిలోకి వెళ్లి పాలుపొంగించి కాపురం పెట్టారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఇంటి వెనుకనున్న వీనస్ కాలనీలోనే పన్నీర్ గృహప్రవేశం చేసిన ఇల్లు ఉండడం విశేషం. అన్నాడీఎంకే పార్టీ, ప్రభుత్వంలో జయలలిత తరువాత అంతటి ప్రాధాన్యతను కలిగి ఉన్న పన్నీర్‌సెల్వం అమ్మ మరణంతో అవస్థలపాలయ్యారు. జయ జైలుకెళ్లిన రెండుసార్లు తాత్కాలిక ముఖ్యమంత్రి వ్యవహరించిన పన్నీర్‌సెల్వం ఆమె మరణించిన తరువాత తొలిసారి పూర్తిస్థాయి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ కనుసన్నల్లో ఉంటూనే స్వంత నిర్ణయాలతో పాలన సాగించారు. ముఖ్యంగా తీవ్రస్తాయిలో సాగుతున్న జల్లికట్టు ఉద్యమాన్ని చల్లార్చేందుకు ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావడం, సదరు ఆర్డినెన్స పై కేంద్రం సహాయంతో రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయించడంలోనూ విజయం సా«ధించారు. సీఎంగా తనదైన ముద్రలో దూసుకుపోవడం ద్వారా ప్రతిపక్షాల ఆదరాభిమానాలను సైతం చూరగొన్నారు. జయ మరణించగానే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవితోపాటూ సీఎం కుర్చీపై సైతం కన్నేసిన శశికళ పన్నీర్ దూకుడుకు కళ్లెం వేయాలని నిర్ణయించుకున్నారు.
గత నెల 5వ తేదీన పోయెస్‌గార్డెన్ లో సీఎం పదవికి పన్నీర్‌సెల్వం రాజీనామా చేశారు. ఆదే రోజున అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేతగా (సీఎంగా) శశికళను ఎన్నుకున్నారు. అకస్మాతుగా తనను ఇంటికి పిలిపించుకుని తన చేత బలవంతంగా రాజీనామా చేయించారని శశికళపై పన్నీర్‌సెల్వం ఆరోపణలు చేయడం ద్వారా తిరుగుబాటు జెండా ఎగరవేశారు. దీంతో అన్నాడీఎంకే పన్నీర్‌సెల్వం, శశికళ వర్గాలుగా చీలిపోయింది. పన్నీర్‌సెల్వం అతని మద్దతుదారులను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించినట్లు శశికళ ప్రకటించారు. అయితే సీఎం బాధ్యతలు చేపట్టేలోగా ఆస్తుల కేసుపై సుప్రీంకోర్టు తీర్పుతో జైలుపాలయ్యారు. శశికళ స్థానంలో ఎడపాడి పళనిస్వామి సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
పన్నీర్ క్వార్టర్‌పై కన్ను: పన్నీర్, శశికళ వర్గాల మధ్య పచ్చగడ్డి వేయకున్నా భగ్గుమనే తీరులో విధ్వేషాలు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ క్వార్టర్‌లో ఉన్న పన్నీర్‌ను బైటకు పంపివేయడం ద్వారా పగ తీర్చుకోవాలని శశికళ వర్గం నిర్ణయించుకుంది. 2011లో జయ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఆమె కేబినెట్‌లో ఆర్థికమంత్రిగా వ్యవహరిస్తున్న పన్నీర్‌సెల్వం చెన్నై అడయారు గ్రీన్ వేస్ రోడ్డులోని ప్రభుత్వ క్వార్టరులో నివాసం ఉంటున్నారు. ముఖ్యమంత్రి అయిన తరువాత సైతం అక్కడే కొనసాగారు. ప్రభుత్వ క్వార్టర్స్‌ను వెంటనే ఖాళీ చేయాలంటూ సీఎం ఎడపాడి ప్రజాపనుల శాఖ ద్వారా పన్నీర్‌సెల్వంకు నోటీసులు పంపారు. అంతకు రెండు రోజుల ముందు శశికళ వర్గీయలు పన్నీర్‌సెల్వం ఇంటి వద్దకు చేరుకుని అక్కడి ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారు.
మంత్రులు, ముఖ్యమంత్రులు తమ పదవిని కోల్పోయినట్లయితే మరో ఆరునెలలపాటు అదే క్వార్టర్స్‌లో కొనసాగవచ్చనే నిబంధనలను ఖాతరుచేయకుండా పన్నీర్‌సెల్వంకు నోటీసులు జారీచేశారు. ఎడపాడి ప్రభుత్వం వల్ల మరిన్ని అవమానాలకు గురయ్యేలోగా ప్రభుత్వ క్వారును ఖాళీ చేయాలని, అంతేగాక పన్నీర్‌సెల్వం పోయెస్‌గార్డెన్ లో మకాం వేయాలని నిర్ణయించుకున్నారు. జయ ఇంటికి వెనుకవైపున ఉన్న వీనస్ కాలనీలో ఒక ఇల్లును ఎంచుకున్నారు. ఈ ఇంట్లో గురువారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి పాలు పొంగించి గృహప్రవేశం చేశారు. ఇకపై తన రాజకీయ కార్యకలాపాలు కొత్త ఇంటి నుంచి కొనసాగించనున్నారు.