► పన్నీరు ఇంట అభిమాన కెరటం
► తండోపతండాలుగా రాక
► ఆనందోత్సాహాల రెట్టింపు
► కువత్తూరుకు చిన్నమ్మ పరుగు
► పోయెస్‌గార్డెన్ వద్ద హడావుడి
ఆపద్ధర్మ సీఎం పన్నీరుసెల్వం ఇంటి పరిసరాల్లో ఆదివారం కోలాహల వాతావరణం నెలకొంది. అభిమాన కెరటం ఉప్పొంగింది. తండోపతండాలుగా రాష్ట్రం నలుమూలల నుంచి అన్నాడీఎంకే కార్యకర్తలు తరలివచ్చి మద్దతు పలికారు. ఐదుగురు ఎంపీలు, పదిమంది మాజీ ఎమ్మెల్యేలు పన్నీరు శిబిరంలో చేరారు. పన్నీరు శిబిరంలో ఆనందోత్సాహాలు రెట్టింపు అయితే, చిన్నమ్మ శిబిరంలో ఉత్కంఠ తప్పడం లేదు. మెజారిటీ ఎమ్మెల్యేలు క్యాంప్‌లోనే ఉండడం వారికి ఊరట. పోయెస్ గార్డెన్ వద్ద హడావుడి సాగినా, చిన్నమ్మ క్యాంప్‌నకు పరుగులు తీయడంతో తదుపరి అడుగులు ఎలా ఉంటాయోనన్న ఎదురు చూపులు పెరిగాయి.
సాక్షి, చెన్నై : చిన్నమ్మ శశికళ, ఆపద్ధర్మ సీఎం పన్నీరుసెల్వం మధ్య సమరం రోజు రోజుకు ఉత్కంఠ రేపుతోంది. ఎమ్మెల్యేలు చిన్నమ్మ ఏర్పాటు చేసిన శిబిరంలోనే ఉన్నా, ఆ పార్టీ ఎంపీలు ఒక్కొక్కరుగా పన్నీరు శిబిరంలో చేరుతున్నారు. రెండు మూడు రోజులుగా గ్రీన్ వేస్ రోడ్డులోని పన్నీరు ఇంట సందడి వాతావరణం నెలకొన్నా, ఆదివారం వాతావరణం కోలాహలంగా మారింది. రాష్ట్రం నలుమూలల నుంచి వ్యాన్లు, బస్సుల్లో అన్నాడీఎంకే కింది స్థాయి కార్యకర్తలు సైతం పోటెత్తుతున్నారు.
డప్పులు వాయిస్తూ, అన్నాడీఎంకే పతకాలను చేతబట్టి, పన్నీరుకు మద్దతుగా నినదిస్తూ తండోపతండాలుగా తరలి వచ్చి మద్దతు పలుకుతుండడం విశేషం. పన్నీరుకు మద్దతు పలికేందుకు అభిమాన కెరటం తరలి వస్తుండడంతో ఆ పరిసరాలు కిక్కిరిశాయి. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పోలీసులు తీవ్రంగా కుస్తీలు పట్టాల్సిన పరిస్థితి. ఇక, ఆ పరిసరాల్లోని దుకాణాల్లో వ్యాపారం మరింతగా పుంజు కుంది. అలాగే, అన్నాడీఎంకే పతాకాలు, అమ్మ, పన్నీరు ఫొటోలు, శాలువాలతో కూడిన రోడ్డు సైడ్ దుకాణాలు పుట్టుకు రావడం గమనార్హం.
ఆనందోత్సాహాలు రెట్టింపు :
అభిమాన కెరటం పన్నీరుకు మద్దతు ప్రకటించినానంతరం, అక్కడ ఏర్పాటు చేసిన హోర్డింగ్, బ్యానర్లలో తమ సంతకాలు పెట్టారు. పోయెస్‌గార్డెన్ లోని అమ్మ జయలలిత ఇంటిని స్మారక మందిరంగా ప్రకటించాల్సిందేనని నినదిస్తూ, తమ సంతకాలు చేశారు. తూత్తుకుడి ఎంపీ జయసింగ్ త్యాగరాజ్ నటర్జీ, వేలూరు ఎంపీ సెంగుట్టువన్, పెరంబలూరు ఎంపీ మారుతీ రాజా, విల్లుపురం ఎంపీ రాజేంద్రన్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణన్ లతో పాటు పది మంది మాజీ ఎమ్మెల్యేలు పన్నీరుకు మద్దతు ప్రకటించారు. దీంతో పన్నీరు శిబిరంలో ఎంపీల సంఖ్య మొత్తం పదికి చేరింది.
అలాగే, సినీనటులు, అరుణ్ పాండియన్, రామరాజన్, విఘ్నేష్, త్యాగు, మనోబాల సైతం పన్నీరుకు జై కొట్టారు. రామరాజన్ మీడియాతో మాట్లాడుతూ పన్నీరు సెల్వం నిజమైన హీరో అని కొనియాడారు. ఆయన తీసుకున్న నిర్ణయం ఎంతో ఆనందాన్ని కల్గించిందన్నారు. ఇక, పన్నీరుకు మద్దతుగా మిస్డ్ కాల్ కొట్టు నినాదానికి విశేష స్పందన రావడం గమనార్హం. పన్నీరు శిబిరంలో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణన్ చేరిన సమాచారంతో ఆయన చేతిలో ఉన్న విల్లుపురం ఉత్తర జిల్లా పార్టీ కార్యదర్శి పదవిని తొలగిస్తు చిన్నమ్మ శశికళ నిర్ణయం తీసుకున్నారు.
ఫిర్యాదుల హోరు : ఆదివారం కూడా ఆయా నియోజకవర్గాల్లో తమ ఎమ్మెల్యేలు కనిపించడం లేదంటూ ఓటర్లు పోలీసుస్టేçÙన్లలో ఫిర్యాదు చేశారు. మైలాపూర్ ఎమ్మెల్యే నటరాజ్ కార్యాలయం వద్ద పలువురు ఆందోళనకు సైతం దిగారు. పన్నీరుకు మద్దతుగా నిర్ణయం తీసుకోవాలని చిన్నమ్మ శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా పలు చోట్ల అన్నాడీఎంకే కార్యకర్తలు ఆందోళనకు దిగడం గమనార్హం. అలాగే, మంత్రులు ఓఎస్ మణియన్, వలర్మతి, దురైకన్ను కన్పించడం లేదని వారి నియోజకవర్గ ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కూవత్తూరుకు చిన్నమ్మ : పోయెస్‌గార్డెన్ వద్ద పార్టీ వర్గాలతో చిన్నమ్మ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సమావేశం అయ్యారు. పార్టీ ముఖ్యులతోనూ, పార్టీలో వ్యాఖ్యాతలుగా ఉన్న సినీ నటులు పలువురితోనూ చిన్నమ్మ భేటీ అయ్యారు. ఈసందర్భంగా తమకు బెదిరింపులు వస్తున్నట్టుగా చిన్నమ్మ దృష్టికి సీఆర్ సరస్వతి, గుండు కల్యాణం తదితర నటులు తీసుకెళ్లారు. ఇక, నాలుగున్నర గంటల సమయంలో చిన్నమ్మ కువత్తూరుకు వెళ్తూ మీడియాతో మాట్లాడడం ఆ శిబిరంలో కాస్త జోష్‌ను నింపింది. ఆందోళన వద్దు అని, అధికారం మనదేనని ఆమె చేసిన వ్యాఖ్యలతో శ్రేణులు ఆనందంలో మునిగారు. ఇక, ఎమ్మెల్యేలతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యల మరింత ఆనందమే. ఎమ్మెల్యేలు అందరూ తన వెంటేనని, పార్టీ పరిరక్షణ, ప్రభుత్వానికి భంగపాటు రానివ్వకుండా స్వతంత్రంగా ఇక్కడ ప్రతి ఒక్కరూ ఉన్నారని ఆమె వ్యాఖ్యానించడం ఆ శిబిరంలో కాస్త టెన్షన్ తగ్గినట్టు అయింది.