► వచ్చే నెల 12న ఆర్కేనగర్ ఉప ఎన్నిక
► మార్చి 16 నుంచి నామినేషన్లు
► ఏప్రిల్ 15న ఓట్ల లెక్కింపు
► పోటీకి దీప సిద్ధం
సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నై ఆర్కేనగర్‌లో ఉప ఎన్నిక నగారా మోగింది. వచ్చేనెల 12వ తేదీన ఎన్నికలను నిర్వహిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ గురువారం ప్రకటించింది. ఈనెల 16న నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. గత ఏడాది మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆర్కేనగర్ నుంచి పోటీచేసి గెలుపొందారు. అనారోగ్య కారణాలతో గత ఏడాది సెప్టెంబర్ 22వ తేదీన అపోలో ఆసుపత్రిలో చేరిన జయలలిత డిసెంబర్ 5వ తేదీన కన్నుమూశారు.
ఆమె మరణంతో ఆమె ప్రాతిని«థ్యం వహించిన ఆర్కేనగర్‌లో ఉపఎన్నిక ఏర్పడింది. అమ్మ మరణం తరువాత అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ, ముఖ్యమంత్రిగా పన్నీర్‌సెల్వం బాధ్యతలు స్వీకరించారు. అయితే అనతికాలంలో వారిద్దరి మధ్య మనస్పర్థలు చోటుచేసుకోగా తదనంతర పరిణా మాల వల్ల రెండాకుల పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. పన్నీర్‌సెల్వంతో ఆయన మద్దతుదారులపై శశికళ బహిష్కరణ వేటువేశారు. ఒక వర్గానికి పన్నీర్‌సెల్వం, మరో వర్గానికి శశికళ నాయకత్వం వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా శశికళ జైలు కెళ్లే ముందు ఆమె అక్క కుమారుడు టీటీవీ దినకరన్ ను ఉప ప్రధాన కార్యదర్శిగా నియమించారు.
బెంగళూరు జైలు నుంచి ఆమె పార్టీ చక్రం తిప్పుతున్నారు. ఇదిలా ఉండగా, అన్నాడీఎంకేలోని ఒక వర్గం జయ మేనకోడలు దీపను అనుసరిస్తోంది. దీంతో రెండుగా ఉండిన పార్టీ మూడు వర్గాలుగా మారిపోయింది. శశికళపై ఎన్నికల కమిషన్ కు పన్నీర్‌సెల్వం వర్గం ఫిర్యాదు చేయగా ఈనెల 10వ తేదీలోగా బదులివ్వాల్సిందిగా ఆమెకు నోటీసులు అందాయి. శశికళ ఇచ్చిన వివరణకు ఎన్నికల కమిషన్ సంతృప్తిచెందని పక్షంలో పార్టీని తన చేతుల్లోకి తెచ్చుకునేందుకు పన్నీర్‌సెల్వం పావులు కదుపుతున్నారు. ఇటువంటి కీలకమైన తరుణంలో ఆర్కేనగర్ ఉప ఎన్నిక ముంచుకొచి్చంది.
ఢిల్లీలోని ప్రధాన ఎన్నికల కార్యాలయం గురువారం మధ్యాహ్నం ఆర్కేనగర్ ఉపఎన్నిక నగారాను మోగించింది. ఆర్కేనగర్‌లో ఉప ఎన్నిక ప్రకటన వల్ల ఎన్నికల కోడ్ వెంటనే అమల్లోకి వచ్చింది. దీంతో అధికార అన్నాడీఎంకే నేతలు, ప్రభుత్వ అధికారులు హడావుడిగా నియోజక వర్గానికి చేరుకుని ప్రజల సమస్యలను తెలుసుకోవడం ప్రారంభించారు. అలాగే దీప, పన్నీర్‌సెల్వం అనుచరులు వేర్వేరుగా సమావేశమై ఎన్నికలపై సమాలోచనలు జరిపారు.
ఆర్కేనగర్ నుంచి దీప పోటీ: అన్నాడీఎంకే ప్రతిష్ట, అమ్మ ప్రభావంపై ఆధారపడి మూడు వర్గాలు అభ్యర్థులను పోటీకి పెట్టడం దాదాపు ఖాయమని భావించవచ్చు. శశికళ జైలు కెళ్లకుంటే పోటీచేసి ఉండేవారు. దీంతో ఆమెకు బదులుగా దినకరన్ పోటీచేసేందుకు ఉత్సాహపడుతున్నారు. పన్నీర్‌సెల్వం ఎవరిని పోటీకి పెడతారో ఇంకా తేటతెల్లం కాలేదు. ఇక మూడో వర్గం నుంచి దీప పోటీచేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆర్కేనగర్ నుంచి పోటీచేయనున్నట్లు దీప గురువారం సాయంత్రం ప్రకటించారు. ఇక డీఎంకే, కాంగ్రెస్ కలిసి ఒక అభ్యర్థిని, బీజేపీ, డీఎండీకే, ఎండీఎంకే, పీఎంకే, వీసీకే పార్టీలు కూడా రంగంలో నిలిచే అవకాశం ఉంది
ఎన్నికల షెడ్యూలు: మార్చి 16వ తేదీన నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అవుతుంది. నామినేషన్ల స్వీకరణ ఈనెల 23 వ తేదీతో ముగుస్తుంది. 24వ తేదీన నామినేషన్ల పరిశీలన. నామినేషన్ల ఉపసంహరణకు 27వ తేదీ ఆఖరు రోజు. ఏప్రిల్ 12వ తేదీన పోలింగ్, 15వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడితో ఉప ఎన్నికకు తెరపడనుంది.