house blessing
-
పన్నీర్ గృహప్రవేశం
► పోయెస్‌గార్డెన్ లోకి మారిన మాజీ సీఎం ► కొత్త ఇంటి నుంచే రాజకీయాలు సాక్షి ప్రతినిధి, చెన్నై: మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం పోయెస్గార్డెస్ లోని తన కొత్త నివాసంలో గురువారం గృహప్రవేశం చేశారు. సంప్రదాయబద్ధంగా తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంటిలోకి వెళ్లి పాలుపొంగించి కాపురం పెట్టారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఇంటి వెనుకనున్న వీనస్ కాలనీలోనే పన్నీర్ గృహప్రవేశం చేసిన ఇల్లు ఉండడం విశేషం. అన్నాడీఎంకే పార్టీ, ప్రభుత్వంలో జయలలిత తరువాత అంతటి ప్రాధాన్యతను కలిగి ఉన్న పన్నీర్‌సెల్వం అమ్మ మరణంతో అవస్థలపాలయ్యారు. జయ జైలుకెళ్లిన రెండుసార్లు తాత్కాలిక ముఖ్యమంత్రి వ్యవహరించిన పన్నీర్‌సెల్వం ఆమె మరణించిన తరువాత తొలిసారి పూర్తిస్థాయి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ కనుసన్నల్లో ఉంటూనే స్వంత నిర్ణయాలతో పాలన సాగించారు. ముఖ్యంగా తీవ్రస్తాయిలో సాగుతున్న జల్లికట్టు ఉద్యమాన్ని చల్లార్చేందుకు ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావడం, సదరు ఆర్డినెన్స పై కేంద్రం సహాయంతో రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయించడంలోనూ విజయం సా«ధించారు. సీఎంగా తనదైన ముద్రలో దూసుకుపోవడం ద్వారా ప్రతిపక్షాల ఆదరాభిమానాలను సైతం చూరగొన్నారు. జయ మరణించగానే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవితోపాటూ సీఎం కుర్చీపై సైతం కన్నేసిన శశికళ పన్నీర్ దూకుడుకు కళ్లెం వేయాలని నిర్ణయించుకున్నారు. గత నెల 5వ తేదీన పోయెస్‌గార్డెన్ లో సీఎం పదవికి పన్నీర్‌సెల్వం రాజీనామా చేశారు. ఆదే రోజున అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేతగా (సీఎంగా) శశికళను ఎన్నుకున్నారు. అకస్మాతుగా తనను ఇంటికి పిలిపించుకుని తన చేత బలవంతంగా రాజీనామా చేయించారని శశికళపై పన్నీర్‌సెల్వం ఆరోపణలు చేయడం ద్వారా తిరుగుబాటు జెండా ఎగరవేశారు. దీంతో అన్నాడీఎంకే పన్నీర్‌సెల్వం, శశికళ వర్గాలుగా చీలిపోయింది. పన్నీర్‌సెల్వం అతని మద్దతుదారులను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించినట్లు శశికళ ప్రకటించారు. అయితే సీఎం బాధ్యతలు చేపట్టేలోగా ఆస్తుల కేసుపై సుప్రీంకోర్టు తీర్పుతో జైలుపాలయ్యారు. శశికళ స్థానంలో ఎడపాడి పళనిస్వామి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. పన్నీర్ క్వార్టర్‌పై కన్ను: పన్నీర్, శశికళ వర్గాల మధ్య పచ్చగడ్డి వేయకున్నా భగ్గుమనే తీరులో విధ్వేషాలు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ క్వార్టర్లో ఉన్న పన్నీర్‌ను బైటకు పంపివేయడం ద్వారా పగ తీర్చుకోవాలని శశికళ వర్గం నిర్ణయించుకుంది. 2011లో జయ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఆమె కేబినెట్లో ఆర్థికమంత్రిగా వ్యవహరిస్తున్న పన్నీర్‌సెల్వం చెన్నై అడయారు గ్రీన్ వేస్ రోడ్డులోని ప్రభుత్వ క్వార్టరులో నివాసం ఉంటున్నారు. ముఖ్యమంత్రి అయిన తరువాత సైతం అక్కడే కొనసాగారు. ప్రభుత్వ క్వార్టర్స్‌ను వెంటనే ఖాళీ చేయాలంటూ సీఎం ఎడపాడి ప్రజాపనుల శాఖ ద్వారా పన్నీర్‌సెల్వంకు నోటీసులు పంపారు. అంతకు రెండు రోజుల ముందు శశికళ వర్గీయలు పన్నీర్‌సెల్వం ఇంటి వద్దకు చేరుకుని అక్కడి ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారు. మంత్రులు, ముఖ్యమంత్రులు తమ పదవిని కోల్పోయినట్లయితే మరో ఆరునెలలపాటు అదే క్వార్టర్స్‌లో కొనసాగవచ్చనే నిబంధనలను ఖాతరుచేయకుండా పన్నీర్‌సెల్వంకు నోటీసులు జారీచేశారు. ఎడపాడి ప్రభుత్వం వల్ల మరిన్ని అవమానాలకు గురయ్యేలోగా ప్రభుత్వ క్వారును ఖాళీ చేయాలని, అంతేగాక పన్నీర్‌సెల్వం పోయెస్‌గార్డెన్ లో మకాం వేయాలని నిర్ణయించుకున్నారు. జయ ఇంటికి వెనుకవైపున ఉన్న వీనస్ కాలనీలో ఒక ఇల్లును ఎంచుకున్నారు. ఈ ఇంట్లో గురువారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి పాలు పొంగించి గృహప్రవేశం చేశారు. ఇకపై తన రాజకీయ కార్యకలాపాలు కొత్త ఇంటి నుంచి కొనసాగించనున్నారు. -
కొత్త అధికార నివాసంలోకి సీఎం
సంప్రదాయబద్ధంగా గృహప్రవేశం దగ్గరుండి పర్యవేక్షించిన చినజీయర్ స్వామి సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కొత్త అధికార నివాస గృహ ప్రవేశం గురువారం సంప్రదాయబద్ధంగా జరిగింది. తెల్లవారు జామున 5.22 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు బేగంపేటలోని నూతన గృహంలోకి ప్రవేశించారు. చినజీయర్ స్వామి సమక్షంలో శృంగేరీ వేద పండితుల మంత్రోఛ్చారణ మధ్య ఈ కార్యక్రమం జరిగింది. కార్తీక మాసంలో గృహప్రవేశం చేస్తే మంచిదనే ఉద్దేశంతో కేసీఆర్ రోడ్లు భవనాల శాఖ అధికారులకు టార్గెట్ పెట్టి మరీ నిర్ణీత సమయంలో క్యాంపు కార్యాలయ నిర్మాణాన్ని పూర్తి చేయించారు. దీంతో గురువారం అనుకున్న ముహూర్తానికి గృహప్రవేశం జరిగింది. సంప్రదాయబద్ధంగా... శృంగేరీ వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య చినజీయర్ స్వామి కేసీఆర్ దంపతు లతో గృహప్రవేశాన్ని శాస్త్రోక్తంగా నిర్వ హించారు. దైవ ప్రవేశం, యతి ప్రవేశం, గో ప్రవేశం, నివసించే వారి ప్రవేశం తదితర ఘట్టాలన్నింటినీ జరిపించారు. అనంతరం వాస్తు హోమం, సుదర్శన హోమం నిర్వహించారు. ముఖ్యమైన కార్య క్రమాలకు దైవ బలం తోడుండాలని భా వించే కేసీఆర్... అన్ని ప్రధాన కార్యక్ర మాల వేళ హోమాలు నిర్వహించడాన్ని ఆనవాయితీగా మార్చుకున్నారు. ఈ క్రమంలోనే గురువారం సుదర్శన హోమం నిర్వహించారు. ఇక తాను విధులు నిర్వ హించేందుకు ఉపయోగించే ఆసనంలో ముందుగా చినజీయర్ స్వామిని కూర్చో బెట్టి.. ఆ తర్వాతే కేసీఆర్ కూర్చుని, పని ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరైన గవర్నర్ దంపతులకు కేసీఆర్ దంపతులు ప్రధాన ద్వారం వద్ద నుంచే సాదరంగా స్వాగతం పలికారు. చివరగా సర్వమత ప్రార్థనలు కూడా నిర్వహించారు. ముఖ్య మంత్రి, గవర్నర్లను ఆయా మతపెద్దలు ఆశీర్వదించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రు లు కేటీఆర్, హరీశ్‌రావు, ఎంపీ కవిత దంపతులు, స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
వైభవంగా సీఎం కేసీఆర్ గృహప్రవేశం
-
వైభవంగా కేసీఆర్ గృహప్రవేశం
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు, శోభ దంపతులు గురువారం తెల్లవారుజామున 05.22 నిమిషాలకు నూతన నివాసంలోకి గృహప్రవేశం చేశారు. మొత్తం 9 ఎకరాల్లో సీఎం క్యాంపు కార్యాలయం, నివాస భవనం, ప్రత్యేక మీటింగ్ హాల్ ను నిర్మించిన విషయం తెలిసిందే. ఐదు భవనాల సముదాయానికి 'ప్రగతి భవన్', సమావేశ మందిరానికి 'జనహిత' అని నామకరణం చేశారు. ఈ కార్యక్రమానికి చినజీయర్ స్వామి, పలువురు మంత్రులు హాజరయ్యారు. -
నేడే సీఎం గృహ ప్రవేశం
సాక్షి, హైదరాబాద్: బేగంపేటలో కొత్తగా నిర్మించిన ముఖ్యమంత్రి అధికార నివాస భవన సముదాయం గృహ ప్రవేశానికి ముస్తాబరుుంది. గురువారం తెల్లారుజామున 5.22 గంటల ముహుర్తానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దంపతులు గృహ ప్రవేశం చేస్తారు. శాస్త్రోక్తంగా ఈ ఉత్సవ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలతో దైవ ప్రవేశం, యతి ప్రవేశం, గోవు ప్రవేశం, నివసించేవారి ప్రవేశం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సర్వ మత ప్రార్థనలు చేస్తారు. గవర్నర్ నరసింహన్ దంపతులు, చినజీయర్ స్వామి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రస్తుతమున్న రెండు భవనాలతో పాటు కొత్తగా నిర్మించిన సీఎం నివాసం, కార్యాలయం, మీటింగ్ హాల్ భవనాల సముదాయానికి ‘ప్రగతి భవన్’గా నామకరణం చేశారు. వివిధ వర్గాలతో సమాలోచనలు జరిపే సమావేశ మందిరానికి ‘జనహిత’ పేరును ఖరారు చేశారు. ప్రభుత్వ విధానాల రూపకల్పన, కార్యక్రమాల అమలు తదితర అంశాలపై రైతులు, కార్మికులు, ఉద్యోగులు, కుల వృత్తుల వారు, తదితర వర్గాలతో జనహిత భవనంలో సీఎం ముఖాముఖి సమావేశాలు జరుపుతారు. -
గృహప్రవేశం చేసేశాక.. నోటీసు వస్తే?
పంచాయతీ అనుమతితో శివారులో నిర్మించిన అపార్ట్మెంట్ అది. రేటు తక్కువ కావటంతో ఫ్లాట్లన్నీ తొందరగానే అమ్ముడుపోయాయి. గృహప్రవేశాలూ జరిగిపోయాయి. ఒకరోజు నివాసితులకు లాయర్ నుంచి నోటీసులు వచ్చాయి. ‘ఈ స్థలం మాది. బిల్డర్ అక్రమంగా కట్టిన ఫ్లాట్లను కొన్నారు కాబట్టి.. వెంటనే స్థలం వదిలి వెళ్లిపోవాలి’ అనేది ఆ నోటీసు సారాంశం. దీంతో వారంతా కంగుతిన్నారు. ఏం చేయాలో అర్థం కాలేదు. అందరూ కలసి బిల్డర్‌ను సంప్రదించారు. ‘నాక్కూడా నోటీసు వచ్చింది’ అని తానూ తాపీగా సమాధానమిచ్చాడు. దీంతో ఆశ్చర్యపోవటం అందరివంతైంది. సాక్షి, హైదరాబాద్ : నిర్మాణం పూర్తయి.. గృహ ప్రవేశం చేసేసి.. సంతోషంగా నివసిస్తున్న సమయంలో ఎవరో ఒక వ్యక్తి అపార్ట్మెంట్ కట్టిన స్థలం మాది అని లాయర్ నోటీసు పంపించినంత మాత్రాన బెంబేలుపడాల్సిన అవసరం లేదు. అతను చేసిన క్లెయిమ్ తప్పు అయి ఉండొచ్చు. లేదా నిజంగానే బిల్డర్‌ది పొరపాటు కావొచ్చు. అయితే ఈ విషయాన్ని తేల్చాల్సింది కోర్టే. ఒకవేళ నోటీసు పంపించిన వ్యక్తిది తప్పుడు క్లెయిమ్ అనుకోండి.. నివాసితులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ, అతని క్లెయిమ్ నిజమనుకోండి ఇబ్బంది పడాల్సింది కొనుగోలుదారులే. ⇔ చాలామంది ఏం చేస్తారంటే.. ఇల్లు కొనేటప్పుడు చట్టపరమైన అంశాల్ని పరిశీలించే విషయంపై రుణాలిచ్చే బ్యాంకులపై ఆధారపడతారు. న్యాయసంబంధ అంశాల్ని పరిశీలించడానికి ప్రత్యేకంగా న్యాయ నిపుణుల బృందం ఉంటుంది కాబట్టి వారే పక్కాగా అన్నీ చూస్తారని భావిస్తారు. కానీ, అది ముమ్మాటికీ పొరపాటు. స్థలాల న్యాయ అంశాల్ని పరిశీలించం వారి పని అయినప్పటికీ.. కష్టార్జితం మీది కాబట్టి వారి సామర్థ్యం మునుపెన్నడూ మీకు తెలియదు కనక పూర్తి భారం వారి మీద వేయకపోవటం మంచిది. ⇔ లక్షలాది రూపాయలను వెచ్చించి సొంతిల్లు కొనేటప్పుడు స్థలానికి సంబంధించిన పత్రాలతో ఎవరికి వారే అనుభవజ్ఞుడైన లాయర్‌ను సంప్రదించాలి. స్థలానికి సంబంధించిన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చెప్పమనాలి. రాతపూర్వకంగా నివేదికనూ రాసివ్వమనాలి. న్యాయవాది అనుభవాన్ని బట్టి ఇందుకోసం కొంత ఖర్చవుతుంది. కానీ, భవిష్యత్తులో మన పెట్టుబడికి ఎలాంటి ఢోకా ఉండదనే నమ్మకం వస్తుంది. సేల్‌డీడ్‌లో ఏముంది..? ⇔ బిల్డర్/డెవలపర్ యాజమాన్య హక్కుల గురించి కొనుగోలుదారులకు సంపూర్ణంగా తెలియజేయాలి. యాజమాన్యపు హక్కుల విషయంలో తనకెలాంటి బాధ్యత లేదని బిల్డర్ /డెవలపర్ ఇల్లు అమ్మేటప్పుడే రాసిస్తే అతని బాధ్యత ఉండదు. అలా రాయకపోతే గనక.. ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ 55 సెక్షన్ ప్రకారం ఆస్తికి సంబంధించిన ఎలాంటి లొసుగులున్నా వాటి గురించి ముందే తెలియజేయాల్సిన బాధ్యత బిల్డర్‌దే. ఆయా ఆస్తికి సంబంధించిన లోటుపాట్లు ఉంటే వాటి గురించి కొనేవారికి ముందే చెప్పాలి. అంతేకాదు, కొనుగోలుదారులు అడిగిన పత్రాలన్నీ ఇవ్వాల్సిన బాధ్యతా అమ్మకపుదారుడిదే. కొనేవారు అడిగే సమంజసమైన ప్రశ్నలకు జవాబులు ఇవ్వాల్సిన బాధ్యత అమ్మేవారిపై ఉంటుంది. ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ నచ్చిన తర్వాత.. బిల్డర్ లేదా డెవలపర్‌తో నిర్దిష్టమైన సేల్‌డీడ్ రాసుకున్న తర్వాత అట్టి ఆస్తి మీద మూడో వ్యక్తి వేసిన క్లెయిమ్ వల్ల కొనుగోలుదారుడు నష్టపోతే దానికి భర్తీ చేయాల్సిన బాధ్యత అమ్మకందారునిపై ఉంటుంది. ⇔ స్థలానికి సంబంధించిన యాజమాన్యపు హక్కుల్లో ఎలాంటి లోపాలున్నా దాని కారణంగా కొనుగోలుదారుడు నష్టపోతే.. సంపూర్ణ బాధ్యత అమ్మేవారిదేనని క్రయపత్రంలో స్పష్టంగా ఉండే విధంగా రాసుకోవాలి. ఈ నిబంధన ఉందో లేదో ముందే చూసుకోవాలి కూడా. ఇప్పుడేం చేయాలి? స్థలం మాదంటూ ఒక వ్యక్తి నోటీసిచ్చాడు కాబట్టి నివాసితులంతా అతనికి జవాబు చెప్పాల్సి ఉంటుంది. అంతే కాదు వారంతా కలసి బిల్డర్కీ నోటీసు పంపాలి. ‘భవిష్యత్తులో యాజమాన్య హక్కులపై ఎలాంటి వివాదాలొచ్చినా నాదే బాధ్యత’ అని సేల్‌డీడ్‌లో రాసిస్తాడు.. కాబట్టి దాని ఆధారంగా బిల్డర్‌కూ నోలీసును ఇవ్వడం మర్చిపోవద్దు. స్థిరాస్తులకు సంబంధించి మీ సందేహాలు మాకు రాయండి. realty@sakshi.com -
తిరిగి వచ్చిన చీర!
రెండు నెలల క్రితం- మా మేనమామ కొడుకు, కొత్త ఇల్లు కట్టుకుని, గృహప్రవేశానికి పిలిస్తే, అందరం కాకినాడ వెళ్లాం. అందరితో పాటు నాకూ చీర పెట్టారు. ఖరీదైనదే కానీ చీరంతా పువ్వులు ఉన్నాయి. పోచంపల్లి చీర అంతలా డిజైన్లు ఉన్న చీరలంటే నాకు ఇష్టముండదు. సరే, ఎప్పుడో కట్టుకోవచ్చులే అని బీరువాలో పెట్టేశాను. మొన్న సెలవుల్లో మావారి మేనత్త కూతురు వచ్చి, రెండ్రోజులుండి వెళ్లినప్పుడు, ఒక్క రవికల గుడ్డ ఏం పెడతామని బీరువాలో ఉన్న ఆ చీరను తనకి పెట్టేశాను. అదలావుండగా, విజయనగరం పైడితల్లమ్మ పండక్కి రమ్మని అక్క ఎప్పట్నించో పిలుస్తోంది. తనని చూసి కూడా చాలా రోజులైందని వెళ్లాను. తిరిగి వచ్చేటప్పుడు ఒక చీర చేతిలో పెట్టింది. ‘నేనేమైనా కొత్తగా వచ్చానా? చీరలూ సారెలూ పెట్టడానికి,’ అన్నా. ‘ఈ మధ్య మా మామగారి బంధువుల ఫంక్షన్‌కి వెళ్లాం. వాళ్ల ఇద్దరు కోడళ్లవి పక్క పక్క ఇళ్లే. ఒకళ్లని చూసి ఒకళ్లు చెరొక చీర పెట్టారు. రెండు చీరలు ఉన్నాయి కదాని, నీకొకటి ఇస్తున్నాను. నేనెప్పుడు కొన్నా నీకూ తీసుకుంటాను కదా. అలాగే అనుకో’ అంది. ఇక మాట్లాడక తీసుకున్నాను. తీరా, ఇంటికి వచ్చాక కవరులోంచి తీసి చూద్దును కదా, నా ఆశ్చర్యానికి అంతే లేదు. అది నేను, ఆయన మేనత్త కూతురుకి పెట్టిన చీర! చుట్టూ తిరిగి నా దగ్గరికే వచ్చింది. మా మేనమామ భార్య ఎంత మనస్ఫూర్తిగా పెట్టిందో! నేనే చిన్నబుద్ధితో అలాంటి పొరపాటు పని చేశానని బాధపడ్డాను. అందుకే అంటారు, ఏదైనా మనస్ఫూర్తిగా చేసినా, ఎవరికి ఏమిచ్చినా, తప్పక ఫలిస్తుందని! ఏది ఏమైనా నా చీర నాకు వచ్చినందుకు చాలా సంతోషించాను. - బెహరా విజయలక్ష్మి సీతమ్మదార, విశాఖపట్నం ఇది మీ కోసం పెట్టిన పేజీ. మీ అనుభవాలు, అనుభూతులు, ఆలోచింపజేసిన సంఘటనలు, మీ ఊరు విశేషాలు, మీ పిల్లల ముద్దుమాటలు, వారి అల్లరి చేష్టలు... అవీ ఇవీ అని లేదు, ఏవైనా మాకు రాసి పంపండి. మా చిరునామా: తపాలా, ఫన్డే, సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34. funday.sakshi@gmail.com