రెండు నెలల క్రితం- మా మేనమామ కొడుకు, కొత్త ఇల్లు కట్టుకుని, గృహప్రవేశానికి పిలిస్తే, అందరం కాకినాడ వెళ్లాం. అందరితో పాటు నాకూ చీర పెట్టారు. ఖరీదైనదే కానీ చీరంతా పువ్వులు ఉన్నాయి. పోచంపల్లి చీర అంతలా డిజైన్లు ఉన్న చీరలంటే నాకు ఇష్టముండదు. సరే, ఎప్పుడో కట్టుకోవచ్చులే అని బీరువాలో పెట్టేశాను.
మొన్న సెలవుల్లో మావారి మేనత్త కూతురు వచ్చి, రెండ్రోజులుండి వెళ్లినప్పుడు, ఒక్క రవికల గుడ్డ ఏం పెడతామని బీరువాలో ఉన్న ఆ చీరను తనకి పెట్టేశాను. అదలావుండగా, విజయనగరం పైడితల్లమ్మ పండక్కి రమ్మని అక్క ఎప్పట్నించో పిలుస్తోంది. తనని చూసి కూడా చాలా రోజులైందని వెళ్లాను. తిరిగి వచ్చేటప్పుడు ఒక చీర చేతిలో పెట్టింది.
‘నేనేమైనా కొత్తగా వచ్చానా? చీరలూ సారెలూ పెట్టడానికి,’ అన్నా. ‘ఈ మధ్య మా మామగారి బంధువుల ఫంక్షన్‌కి వెళ్లాం. వాళ్ల ఇద్దరు కోడళ్లవి పక్క పక్క ఇళ్లే. ఒకళ్లని చూసి ఒకళ్లు చెరొక చీర పెట్టారు. రెండు చీరలు ఉన్నాయి కదాని, నీకొకటి ఇస్తున్నాను. నేనెప్పుడు కొన్నా నీకూ తీసుకుంటాను కదా. అలాగే అనుకో’ అంది. ఇక మాట్లాడక తీసుకున్నాను.
తీరా, ఇంటికి వచ్చాక కవరులోంచి తీసి చూద్దును కదా, నా ఆశ్చర్యానికి అంతే లేదు. అది నేను, ఆయన మేనత్త కూతురుకి పెట్టిన చీర! చుట్టూ తిరిగి నా దగ్గరికే వచ్చింది. మా మేనమామ భార్య ఎంత మనస్ఫూర్తిగా పెట్టిందో! నేనే చిన్నబుద్ధితో అలాంటి పొరపాటు పని చేశానని బాధపడ్డాను. అందుకే అంటారు, ఏదైనా మనస్ఫూర్తిగా చేసినా, ఎవరికి ఏమిచ్చినా, తప్పక ఫలిస్తుందని! ఏది ఏమైనా నా చీర నాకు వచ్చినందుకు చాలా సంతోషించాను.
- బెహరా విజయలక్ష్మి
సీతమ్మదార, విశాఖపట్నం
ఇది మీ కోసం పెట్టిన పేజీ. మీ అనుభవాలు, అనుభూతులు, ఆలోచింపజేసిన సంఘటనలు,
మీ ఊరు విశేషాలు, మీ పిల్లల ముద్దుమాటలు, వారి అల్లరి చేష్టలు... అవీ ఇవీ అని లేదు, ఏవైనా మాకు రాసి పంపండి.
మా చిరునామా: తపాలా, ఫన్‌డే, సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1,
రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34. funday.sakshi@gmail.com
తిరిగి వచ్చిన చీర!
Published Sun, Sep 7 2014 1:12 AM | Last Updated on Wed, Oct 17 2018 4:13 PM
Advertisement
Advertisement