గృహప్రవేశం చేసేశాక.. నోటీసు వస్తే? | what will you do ofter house blessing lawyer notice | Sakshi
Sakshi News home page

గృహప్రవేశం చేసేశాక.. నోటీసు వస్తే?

Published Fri, Jul 29 2016 10:38 PM | Last Updated on Sat, Aug 18 2018 8:37 PM

గృహప్రవేశం చేసేశాక.. నోటీసు వస్తే? - Sakshi

గృహప్రవేశం చేసేశాక.. నోటీసు వస్తే?

పంచాయతీ అనుమతితో శివారులో నిర్మించిన అపార్ట్‌మెంట్ అది. రేటు తక్కువ కావటంతో ఫ్లాట్లన్నీ తొందరగానే అమ్ముడుపోయాయి. గృహప్రవేశాలూ జరిగిపోయాయి. ఒకరోజు నివాసితులకు లాయర్ నుంచి నోటీసులు వచ్చాయి. ‘ఈ స్థలం మాది. బిల్డర్ అక్రమంగా కట్టిన ఫ్లాట్లను కొన్నారు కాబట్టి.. వెంటనే స్థలం వదిలి వెళ్లిపోవాలి’ అనేది ఆ నోటీసు సారాంశం. దీంతో వారంతా కంగుతిన్నారు. ఏం చేయాలో అర్థం కాలేదు. అందరూ కలసి బిల్డర్‌ను సంప్రదించారు. ‘నాక్కూడా నోటీసు వచ్చింది’ అని తానూ తాపీగా సమాధానమిచ్చాడు. దీంతో ఆశ్చర్యపోవటం అందరివంతైంది.

 సాక్షి, హైదరాబాద్ : నిర్మాణం పూర్తయి.. గృహ ప్రవేశం చేసేసి.. సంతోషంగా నివసిస్తున్న సమయంలో ఎవరో ఒక వ్యక్తి అపార్ట్‌మెంట్ కట్టిన స్థలం మాది అని లాయర్ నోటీసు పంపించినంత మాత్రాన బెంబేలుపడాల్సిన అవసరం లేదు. అతను చేసిన క్లెయిమ్ తప్పు అయి ఉండొచ్చు. లేదా నిజంగానే బిల్డర్‌ది పొరపాటు కావొచ్చు. అయితే ఈ విషయాన్ని తేల్చాల్సింది కోర్టే. ఒకవేళ నోటీసు పంపించిన వ్యక్తిది తప్పుడు క్లెయిమ్ అనుకోండి.. నివాసితులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ, అతని క్లెయిమ్ నిజమనుకోండి ఇబ్బంది పడాల్సింది కొనుగోలుదారులే.

చాలామంది ఏం చేస్తారంటే.. ఇల్లు కొనేటప్పుడు చట్టపరమైన అంశాల్ని పరిశీలించే విషయంపై రుణాలిచ్చే బ్యాంకులపై ఆధారపడతారు. న్యాయసంబంధ అంశాల్ని పరిశీలించడానికి ప్రత్యేకంగా న్యాయ నిపుణుల బృందం ఉంటుంది కాబట్టి వారే పక్కాగా అన్నీ చూస్తారని భావిస్తారు. కానీ, అది ముమ్మాటికీ పొరపాటు. స్థలాల న్యాయ అంశాల్ని పరిశీలించం వారి పని అయినప్పటికీ.. కష్టార్జితం మీది కాబట్టి వారి సామర్థ్యం మునుపెన్నడూ మీకు తెలియదు కనక పూర్తి భారం వారి మీద వేయకపోవటం మంచిది.

లక్షలాది రూపాయలను వెచ్చించి సొంతిల్లు కొనేటప్పుడు స్థలానికి సంబంధించిన పత్రాలతో ఎవరికి వారే అనుభవజ్ఞుడైన లాయర్‌ను సంప్రదించాలి. స్థలానికి సంబంధించిన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చెప్పమనాలి. రాతపూర్వకంగా నివేదికనూ రాసివ్వమనాలి. న్యాయవాది అనుభవాన్ని బట్టి ఇందుకోసం కొంత ఖర్చవుతుంది. కానీ, భవిష్యత్తులో మన పెట్టుబడికి ఎలాంటి ఢోకా ఉండదనే నమ్మకం వస్తుంది.

 సేల్‌డీడ్‌లో ఏముంది..?

బిల్డర్/డెవలపర్ యాజమాన్య హక్కుల గురించి కొనుగోలుదారులకు సంపూర్ణంగా తెలియజేయాలి. యాజమాన్యపు హక్కుల విషయంలో తనకెలాంటి బాధ్యత లేదని బిల్డర్ /డెవలపర్ ఇల్లు అమ్మేటప్పుడే రాసిస్తే అతని బాధ్యత ఉండదు. అలా రాయకపోతే గనక.. ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ప్రాపర్టీ 55 సెక్షన్ ప్రకారం ఆస్తికి సంబంధించిన ఎలాంటి లొసుగులున్నా వాటి గురించి ముందే తెలియజేయాల్సిన బాధ్యత బిల్డర్‌దే. ఆయా ఆస్తికి సంబంధించిన లోటుపాట్లు ఉంటే వాటి గురించి కొనేవారికి ముందే చెప్పాలి. అంతేకాదు, కొనుగోలుదారులు అడిగిన పత్రాలన్నీ ఇవ్వాల్సిన బాధ్యతా అమ్మకపుదారుడిదే. కొనేవారు అడిగే సమంజసమైన ప్రశ్నలకు జవాబులు ఇవ్వాల్సిన బాధ్యత అమ్మేవారిపై ఉంటుంది. ఒక అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ నచ్చిన తర్వాత.. బిల్డర్ లేదా డెవలపర్‌తో నిర్దిష్టమైన సేల్‌డీడ్ రాసుకున్న తర్వాత అట్టి ఆస్తి మీద మూడో వ్యక్తి వేసిన క్లెయిమ్ వల్ల కొనుగోలుదారుడు నష్టపోతే దానికి భర్తీ చేయాల్సిన బాధ్యత అమ్మకందారునిపై ఉంటుంది.

స్థలానికి సంబంధించిన యాజమాన్యపు హక్కుల్లో ఎలాంటి లోపాలున్నా దాని కారణంగా కొనుగోలుదారుడు నష్టపోతే.. సంపూర్ణ బాధ్యత అమ్మేవారిదేనని క్రయపత్రంలో స్పష్టంగా ఉండే విధంగా రాసుకోవాలి. ఈ నిబంధన ఉందో లేదో ముందే చూసుకోవాలి కూడా.

ఇప్పుడేం చేయాలి?
స్థలం మాదంటూ ఒక వ్యక్తి నోటీసిచ్చాడు కాబట్టి నివాసితులంతా అతనికి జవాబు చెప్పాల్సి ఉంటుంది. అంతే కాదు వారంతా కలసి బిల్డర్‌కీ నోటీసు పంపాలి. ‘భవిష్యత్తులో యాజమాన్య హక్కులపై ఎలాంటి వివాదాలొచ్చినా నాదే  బాధ్యత’ అని సేల్‌డీడ్‌లో రాసిస్తాడు.. కాబట్టి దాని ఆధారంగా బిల్డర్‌కూ నోలీసును ఇవ్వడం మర్చిపోవద్దు.
స్థిరాస్తులకు సంబంధించి  మీ సందేహాలు మాకు రాయండి. realty@sakshi.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement