
బెట్టింగ్ యాప్స్ కేసులో పోలీసుల నిర్ణయం
తమ వీడియోలకు సంబంధించి సాంకేతిక కారణాలు చూపిస్తున్న ఇన్çఫ్లుయెన్సర్లు
గేమింగ్ యాక్ట్ సవరణకు ముందే చేశామంటూ వాదన
దీనిపై న్యాయ నిపుణుల సలహా తీసుకోనున్న దర్యాప్తు అధికారులు
సాక్షి, హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన ఆరోపణలపై సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లపై నమోదైన కేసుల విషయంలో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తొలుత ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేయాలని, వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా బాధ్యులకు నోటీసులు జారీ చేసి విచారించాలని భావిస్తున్నారు. దేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అసోం మినహా మిగతా రాష్ట్రాల్లో ఆన్‌లైన్ బెట్టింగ్ నేరం కాకపోవడం, మరికొన్ని అంశాల నేపథ్యంలో ఆచితూచి వ్యవహరించాలని ఆలోచనకు వచ్చారు.
న్యాయ నిపుణుల సలహా తీసుకుని ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఉన్న పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో 11 మంది యాంకర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్ పోలీసుస్టేషన్‌లో 25 మంది నటీనటులు, ఇన్‌ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదైన విషయం తెలిసిందే.
రాష్ట్రంలో 2017 నుంచే నిషేధం అమలు..
తెలంగాణలో కొన్నేళ్లుగా పేకాటపై నిషేధం ఉంది. దీనితో పేకాట క్లబ్బులన్నీ మూతపడ్డాయి. కానీ చాలా మంది ఆన్‌లైన్ రమ్మీ, పేకాటకు అల వాటు పడ్డారు. దీనికోసం తొలినాళ్లలో ప్రత్యేక వెబ్‌సైట్లు, యాప్‌లు వచ్చా యి. వాటి సర్వర్లను రాష్ట్రం వెలుపల ఏర్పాటు చేసుకున్న నిర్వాహకులు యథేచ్ఛగా తమ కార్యకలాపాలు సాగిస్తూ వచ్చారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం.. గేమింగ్ యాక్ట్‌కు సవరణలు చేసి, రాష్ట్ర పరిధిలో ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌పైనా నిషేధం విధించింది.
2017లో ఇది అమల్లోకి వచ్చింది. ఇంటర్‌నెట్ సేవలను అందించే సంస్థలకు లేఖలు రాయడం ద్వారా పోలీసులు రాష్ట్రంలో గ్యాంబ్లింగ్ సైట్లు/యాప్‌లు ఓపెన్ కాకుండా చర్యలు తీసుకున్నారు. కానీ ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసలుగా మారినవారు నకిలీ జీపీఎస్, లొకేషన్ యాప్స్, వీపీఎన్‌ల సాయంతో ఆయా సైట్లు, యాప్స్‌ను వినియోగిస్తున్నారు. పలువురు నటులు, ఇన్‌ఫ్లుయెన్సర్లు డబ్బులు తీసుకుని ఆ గ్యాంబ్లింగ్ వెబ్‌సైట్లు, యాప్స్‌కు ప్రమోట్ చేశారు. ఈ క్రమంలోనే వారిపై చర్యలకు పోలీసులు ఉపక్రమించారు.
నాటి ప్రకటనలే అని చెబుతూ..
బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయడంపై కేసులు నమోదవడంతో చాలా మంది ప్రముఖులు స్పందించారు. ఆ ప్రకటనలన్నీ గేమింగ్ చట్ట సవరణకు ముందే 2016–17 సమయంలో చేసినవని, తర్వాత ఆ ఒప్పందాలు రద్దు చేసుకున్నామని కొందరు చెప్తున్నారు. మరికొందరు తెలుగు రాష్ట్రాల బయట మాత్రమే ఆ ప్రమోషనల్ వీడియోలను వినియోగించుకోవడానికి అంగీకరించామని అంటున్నారు. దీంతో సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు, యాంకర్లతో బెట్టింగ్ కంపెనీలకు జరిగిన ఒప్పందాలను సేకరించాలని దర్యాప్తు అధికారులు నిర్ణయించారు.
వాటిని అధ్యయనం చేయడం ద్వారా ఎవరు? ఎప్పుడు? ఏఏ యాప్స్‌తో ఒప్పందాలు చేసు కున్నారు? ఏయే ప్రాంతాల్లో ప్రచారం చేసేలా నిబంధనలు ఉ న్నాయి? తదితర అంశాలను పరిశీలించనున్నారు. ఇక ఇన్‌ఫ్లుయెన్సర్లకు, బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులకు మధ్య కొందరు ఈవెంట్ మేనేజర్లు దళారులుగా వ్యవహరించినట్టు పోలీసులు భావిస్తున్నారు. వారి వివరాలు సైతం ఆరా తీసి, నిందితులుగా చేర్చాలని యోచిస్తున్నారు. న్యాయ నిపుణుల సల హాలు తీసుకున్న తర్వాతే నిందితులకు నోటీసులు జారీ చేయాలని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment