కొల్లగొట్టారు
- జలమండలిలో చేతివాటం
- నల్లా కనెక్షన్ల జారీలో అక్రమాలు
- బహుళ అంతస్తుల భవనాలకు డొమెస్టిక్ బిల్లుల జారీతో భారీ నష్టం
- బోర్డు అంతర్గత సర్వేలో వెలుగుచూసిన భారీ కుంభకోణం
సాక్షి, సిటీబ్యూరో: పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన జలమండలిలో భారీ కుంభకోణం వెలుగుచూసింది. నల్లా కనెక్షన్ల విషయంలో ఉద్యోగులు చేతివాటం ప్రదర్శిస్తూ సంస్థ ఆదాయానికి గండికొడుతున్నారు. కమర్షియల్ కాంప్లెక్స్‌లు, అపార్టుమెంట్లకు డొమెస్టిక్ కనెక్షన్ల కింద బిల్లులు జారీ చేస్తుండడంతో ఏటా రూ. 120 కోట్ల మేర ఖజానాకు తూట్లు పడుతోంది. ఇది ఐదేళ్లుగా జరుగుతోందని బోర్డు అంతర్గత సర్వేలో వెలుగుచూసింది. ఇప్పటి వరకూ రూ. 600 కోట్లు గండిపడినట్టు తెలుస్తోంది. సంస్థను సిబ్బందే ముంచేస్తున్న అంశం కలకలం సృష్టిస్తోంది.
నగర శివారు ప్రాంతాల్లోని మున్సిపాలిటీల పరిధిలో అక్రమాలు జరగడం గమనార్హం. జలమండలి పరిధిలో 8.25 లక్షల నల్లా కనెక్షన్లు ఉన్నాయి. 2007లో గ్రేటర్‌లో విలీనమైన మల్కాజ్‌గిరి, కాప్రా, ఉప్పల్, అల్వాల్, ఎల్బీనగర్, పటాన్‌చెరువు, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, గడ్డిఅన్నారం, కుత్బుల్లాపూర్ తదితర శివారు మున్సిపాల్టీల పరిధిలో పలు బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్‌మెంట్లు, హాస్టళ్లు, పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు, వాణిజ్య సముదాయాలు, సినిమా, ఫంక్షన్ హాళ్లు ఉన్నాయి. వీటికి ఎంఎస్‌ఏసీ (మల్టిస్టోర్డ్ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్) విభాగం కింద రూ. 957 బిల్లు జారీ చేయాలి. నీటి వినియోగాన్ని బట్టి బిల్లు మొత్తం రూ. 5 వేల వరకూ ఉంటుంది. వీటికీ గృహ వినియోగ విభాగం కింద రూ. 225 బిల్లును జారీ చేస్తున్నారు.
క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న మీటర్ రీడర్లు, మేనేజర్లు, డిప్యూ టీ జనరల్ మేనేజర్లు, జనరల్ మేనేజర్లు భవన నిర్మాణాల యజమానులు, బిల్డర్లతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్నారని తెలిసింది. ఇది 2009 నుంచి జరుగుతోందని జలమండలి రెవెన్వూ విభాగం అంతర్గత సర్వేలో వెల్లడైంది. సుమారు లక్షకుపైగా కనెక్షన్లల్లో అక్రమాలు జరిగినట్టు గుర్తించారు. ఫలితంగా మండలికి ఏటా రూ. 120 కోట్లు చొప్పున ఇప్పటి వరకూ రూ. 600 కోట్ల మేర గండిపడిందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
400 అపార్ట్‌మెంట్లకు నోటీసులు
బోర్డు ఖజానాకు చిల్లుపెడుతున్న వేలాది అపార్ట్‌మెంట్లలో ఇప్పటివరకు సుమారు 400 అపార్ట్‌మెం ట్లను, బహుళ అంతస్తుల భవంతులను మల్కాజ్ గిరి, అల్వాల్, కాప్రా మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో గు ర్తించినట్లు బోర్డు రెవెన్యూ విభాగం అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. శివార్లలో ఇలాంటి భవనాలపై సమగ్రంగా సర్వే జరుపుతున్నామన్నారు. త్వరలో నోటీసులు జారీచేయనున్నారు. ఇప్పటి వరకూ జరిగిన నష్టాన్ని పూడ్చుకొనే దిశగా అధికారులు చ ర్యలు తీసుకుంటున్నారు. తొలి దశలో నిర్ణీత మొ త్తంలో ఫీజు వసూలు చేసి కేటగిరీని మార్పు చేస్తారు. ఆ తర్వాత కనెక్షన్లను క్రమబద్ధీకరించనున్నారు.