బిలగిలో రాహల్‌ను సత్కరించిన దృశ్యం
సాక్షి, బళ్లారి (బాగల్‌కోట): ప్రధాన మంత్రిని చేయొద్దు.. దేశానికి చౌకీదారును చేయాలని ఎన్నికల సభల్లో ప్రజలను కోరిన మోదీ.. ఇన్ని కుంభకోణాలు జరుగుతున్నా మౌనంగా ఎందుకు ఉంటున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశ్నించారు. జనాశీర్వాద యాత్రలో భాగంగా రాహుల్ కర్ణాటకలోని బాగల్‌కోట జిల్లా చాడగండి తాలూకా చిక్కపడసలగి బ్యారేజ్‌ను సందర్శించి, గంగమ్మ తల్లికి వాయనం సమర్పించారు. అనంతరం మథోళ్‌లో ఏర్పాటు చేసిన సభలో మోదీపై నిప్పులు చెరిగారు.
తరచూ అవినీతిపై ప్రసం గాలు చేసే మోదీ..వేలాది కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం, దానితో సంబంధమున్న నీరవ్‌మోదీలపై ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కుమారుడు జై షా కంపెనీ టర్నోవర్ రూ.50 వేల నుంచి ఒక్కసారిగా రూ.80 కోట్లకు పెరిగినా పెదవి విప్పటం లేదన్నారు. ‘దేశంలోని రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. రైతు రుణాలు మాఫీ చేయాలని స్వయానా ప్రధానిని కోరినా ఆయన నోరు మెదపలేదు.
బడా పారిశ్రామికవేత్తలకు మాత్రం రూ.లక్షా 40వేల కోట్ల రుణాలు మాఫీ చేశారు’ అని రాహుల్ ధ్వజమెత్తారు. మరోవైపు, ‘మోదీ చిల్లర ప్రధాని. మాటలతో ప్రజలను మోసం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు’ అని కర్ణాటక ఎక్సైజ్ శాఖ మంత్రి తిమ్మాపూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం ప్రధాన మంత్రి మోదీ ఇంట్లో కాని, బీజేపీలో కాని ఎవరైనా ప్రాణ త్యాగం చేశారా? పోనీ, ఆ నేతలకు చెందిన కుక్క అయినా దేశం కోసం ప్రాణ త్యాగం చేసిందా? కాంగ్రెస్‌లో దేశం కోసం ఇందిర, రాజీవ్‌సహా ఎందరో మహానుభావులు ప్రాణ త్యాగం చేశారని తెలిపారు.
కర్ణాటకలో అవినీతి పాలన: అమిత్‌షా
కర్ణాటకలో అవినీతి పాలన సాగుతోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఆరోపించారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆదివారం ఆయన బీదర్ జిల్లా హుమ్నాబాద్, యాదగిరి జిల్లా సురపుర, యానాగుంది తదితర చోట్ల విస్తృత పర్యటన చేసి, పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు గతంలో ఓ వ్యక్తి రూ.40 లక్షలు ఖరీదు చేసే వాచీని కానుకగా ఇచ్చారంటే ఇక్కడ అవినీతి పాలన ఏమేరకు సాగుతోందో అర్థం చేసుకోవచ్చన్నారు.
Comments
Please login to add a commentAdd a comment