దేశభక్తులమని చెప్పుకునే వాళ్లకు కులగణన ఎక్స్–రే అంటే భయం
రూ.16 లక్షల కోట్లు మిత్రులకు పంచారు
మేం కోట్లాది పేదలను లక్షాధికారులను చేస్తాం
మోదీ, బీజేపీపై రాహుల్ విమర్శలు
సాక్షి, న్యూఢిల్లీ: కులగణనను ఏ శక్తీ ఆపలేదని ప్రకటిస్తూ ప్రధాని మోదీ, బీజేపీపై రాహుల్ గాంధీ మరోమారు విమర్శల వాగ్బాణాలు ఎక్కుపెట్టారు. బుధవారం ఢిల్లీలో జరిగిన సామాజిక న్యాయ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. ‘‘ నాకు కులం పట్టింపు లేదు. కానీ న్యాయం విషయానికొచ్చేసరికి దేశంలో అన్యాయమైపోయిన 90 శాతం జనాభాకు న్యాయం దక్కేలా చూడటమే నా జీవిత లక్ష్యం. మా ప్రభుత్వం ఏర్పడగానే మేం చేసే మొట్టమొదటి పని కులగణన జరిపించడమే.
మోదీ అస్తవ్యస్తపాలనలో దాపురించిన ఆదాయ అసమానతల గురించే కాంగ్రెస్ మేనిఫెస్టో చెబుతోంది. మోదీ అత్యంత మిత్రులైన బడా పారిశ్రామికవేత్తలకు బదిలీచేసిన రూ.16 లక్షల కోట్ల మొత్తంలో కాంగ్రెస్ కొంతైనా ఈ 90 శాతం పేదలకు అందేలా చేస్తుంది. లెక్కలు కట్టాం. ఇదే న్యాయం అని భావించాం. అందుకే ఈ అంశాలను మేనిఫెస్టోలో చేర్చాం’’ అని రాహుల్ అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
నాన్‌సీరియస్ నేతనా?
‘‘పూర్తిగా రాజకీయాలకు అంకితంకాని నేత అని రాహుల్‌పై బీజేపీ చేసిన విమర్శలకు రాహుల్ ధీటుగా బదులిచ్చారు. ‘‘ గ్రామీణఉపాధి హామీ పథకం, భూసేకరణ బిల్లు, ఉత్తరప్రదేశ్‌లో భట్టా, పార్సౌల్ గ్రామాల వద్ద భూసేకరణ ఉద్యమం, నియాంగిరీ హిల్స్ వివాదం ఇలా ఎన్నో సమస్యల పరిష్కారానికి కృషిచేశా. ఉద్యమాలను ముందుండి నడిపించా. ఇవన్నీ మీడియాకు నాన్‌సీరియస్ అంశాలేకదా. సీరియస్ అంశాలుగా అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, విరాట్ కోహ్లీల గురించి మీడియా చూపిస్తుంది. 90 శాతం జనాభా గురించి పట్టించుకునే వ్యక్తిని నాన్‌సీరియస్ నేత అని అంటారా?’’
ఓబీసీ, దళితులు, గిరిజనుల ప్రాతినిధ్యమెక్కడ?
‘‘ మీడియారంగంలో ఓబీసీ, దళితులు, గిరిజనుల చేతుల్లో ఉన్న ఒక్క మీడియా సంస్థనైనా చూపించండి. ఒక్కరు కూడా లేరు. మీ ప్రాతినిధ్యం మీడియాలో లేదు. న్యాయవ్యవస్థలోనూ దాదాపు అంతే. 650 మంది హైకోర్టు జడ్జీల్లో 90 శాతం జనాభాకు ప్రాతినిధ్యం వహించేది కేవలం 100 మందే. దేశంలోని 200 అగ్రశ్రేణి సంస్థల్లోనూ దళితులు, గిరిజనులు, ఓబీసీలు లేరు’’
దేశాన్ని విడగొడుతున్నానట!
‘‘అన్యాయం జరిగితే ఏ మేరకు అన్యాయం జరిగిందో తెల్సుకుంటాం. ఒక వ్యక్తికి అంతర్గత గాయమైతే ఎక్స్–రే తీయడంలో తప్పులేదుగా. అలాగే కులగణన ఎక్స్–రే అవసరమని నేను అనగానే జాతీయ మీడియా, నరేంద్ర మోదీ ఏకమైపోయి నేనేదో దేశప్రజలను విభజిస్తున్నట్లు విష ప్రచారం మొదలెట్టారు. అన్ని కులాల ప్రాతినిధ్యం ఎలా ఉందో తెలియాలంటే ఎక్స్–రే అవసరమని దేశభక్తులంతా భావిస్తారు. దేశాన్ని సూపర్‌పవర్‌గా మార్చాలనే ఈ దేశభక్తుడు(మోదీ) మాత్రం ఈ ఎక్స్–రే పేరు వింటేనే భయపడుతున్నారు’’
కులాలే లేనప్పుడే మీరెలా ఓబీసీ అయ్యారు?
‘‘ గత పదేళ్లు తాను ఓబీసీ వ్యక్తినని మోదీ ఘంటాపథంగా చెప్పారు. తీరా నేను కులగణన ప్రస్తావన తీసుకురాగానే దేశంలో కులాలే లేవని మాట మార్చారు. మరి అలాంటపుడు మీరు ఓబీసీ ఎలా అయ్యారు? మళ్లీ ఆయనే దేశంలో రెండే కులాలున్నాయని సెలవిచ్చారు. పేద, ధనిక కులాలు అని. పేదల జాబితాను పరికిస్తే దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాలే కనిపిస్తాయి. ఈ 90 శాతం జనాభాకు న్యాయం చేయడమే నా జీవిత లక్ష్యం’’
రామమందిరం, పార్లమెంట్‌లో మా వ్యక్తులెక్కడ? ‘‘ సమస్య నుంచి కొంతకాలమే దృష్టి మరల్చగలరు. ఓబీసీలు మిమ్మల్ని నిలదీసే సమయం వచి్చంది. రామమందిరం పూర్తయింది అక్కడ మా(దళితులు, గిరిజనులు) వాళ్లు ఒక్కరైనా ఉన్నారా? పార్లమెంట్ నూతన భవనం ప్రారంభించారు. మా వాళ్లు ఒక్కరైనా ఉన్నారా?. ఒక్కరినైనా ఆహా్వనించారా? గిరిజన మహిళా రాష్ట్రపతి ముర్ము, మాజీ రాష్ట్రపతి కోవింద్‌లను ఎందుకు రానివ్వలేదు?’’
ఆర్థిక, వ్యవస్థాగత సర్వేలూ కలిపే..
‘‘ మేం అధికారంలోకి వస్తే కులగణనతోపాటే ఆర్థిక సర్వే చేస్తాం. ప్రభుత్వ, ప్రైవేట్‌రంగాలుసహా అన్ని రంగాల్లో అణగారిన వర్గాల ప్రాతినిధ్యం ఎంత ఉందనేది తెలిపే ఇన్‌స్టిట్యూషనల్ సర్వేనూ చేస్తాం. కులగణనను ఏ శక్తీ ఆపలేదు. ఎంత గట్టిగా నిలువరిస్తే అంతే బలంగా ప్రతిఘటిస్తాం’’
Comments
Please login to add a commentAdd a comment