
హవేరి(కర్ణాటక)/న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) మోసం కేసులో నిందితుడు నీరవ్ మోదీకి ప్రధాని మోదీకి మధ్య అసాధారణమైన సారూప్యతలున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఎద్దేవా చేశారు. వీరిద్దరూ చట్టానికి అతీతులమని భావిస్తుంటారన్నారు. వేల కోట్ల రుణాలు ఎగొట్టిన నీరవ్ మోదీపై మీడియా కథనాలపై రాహుల్ స్పందించారు. ‘ వీరిద్దరి పేర్లు మోదీనే. ఇద్దరూ దేశాన్ని దోచుకుంటున్నవారే. చట్టానికి అతీతులమని వీరు భావిస్తున్నారు. వీరిని చట్టం ముందు నిలబెడతాం’ అని ట్వీట్ చేశారు. ఇలాంటి పరారైన నేరగాళ్ల కోసం మోదీ ప్రభుత్వం ‘మోసగాళ్ల సెటిల్‌మెంట్ యోజన’ను ప్రారంభించిందన్నారు.
ఉగ్రవాదానికి కాంగ్రెస్ తలొంచదు
అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ అజార్‌ను ఎన్‌డీఏ ప్రభుత్వం జైలు నుంచి ఎందుకు విడిచిపెట్టిందో ప్రజలకు వెల్లడించాలని ప్రధానిని డిమాండ్ చేశారు. ‘ ఏ ప్రభుత్వం అతడిని జైలు నుంచి వదిలిపెట్టింది?’ అంటూ ప్రశ్నించారు. కర్ణాటకలో హవేరీలో జరిగిన సభలో మాట్లాడారు.‘ఇటీవల కశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ జవాన్లను ఉగ్రవాదులు చంపారు. ఈ జవాన్లను ఎవరు చంపారు? జైషే మొహమ్మద్ చీఫ్ ఎవరు? మసూద్ అజార్.. భారత్ జైలులో ఉన్న అతడిని పొరుగుదేశం పంపిందెవరు? వాజ్‌పేయి సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం కాదా? దీనిని గురించి మీరు ఎందుకు మాట్లాడరు? మీ ప్రభుత్వ హయాంలో జైలు నుంచి బయటకు వచ్చిన మసూదే ఇప్పుడు జవాన్లను చంపాడన్న విషయం ఎందుకు మీరు చెప్పడం లేదు?’ అంటూ ప్రశ్నించారు. ‘మోదీజీ..మీకు మాదిరిగా కాంగ్రెస్ ఉగ్రవాదులకు తలొంచదు’ అని రాహుల్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment