సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ప్రస్తుతం బిజీబిజీగా ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ 2018, అక్టోబర్ నుంచి 2019, మార్చి నెల వరకు, అంటే 182 రోజుల్లో వ్యక్తిగతంగా 2,143 ట్వీట్లు చేశారు. వాటిని ఆయన ఫాలోవర్లు తమ అభీష్టం మేరకు రీట్వీట్ చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సోషల్ మీడియాను విజయవంతంగా ఉపయోగించుకోవడం మోదీకి ఆది నుంచి అలవాటే. ఇన్ని రోజుల్లో ఆయన చేసిన అన్ని ట్వీట్లలో ఓ రెండు ట్వీట్లు మాత్రం విపరీతంగా షేర్ అయ్యాయి. అందులో ఒకటి పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకుపోయి బాలకోట్‌లో బాంబు దాడులు జరపిన సంఘటనకు సంబంధించినది కాగా, మరొకటి ‘మై భీ చౌకీదార్’ అంటూ మోదీ చేసుకున్న ప్రచారానికి సంబంధించినది.
‘చౌకీదార్ చోర్ హై’ అంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన విమర్శలకుగాను ‘మై భీ చౌకీదార్’ అంటూ మోదీ ఓ ఉద్యమాన్ని చేపట్టడం, అందులో భాగంగా ఆయన కేంద్ర మంత్రులందరూ తమ ట్విట్టర్ ఖాతాలకు ‘మై భీ చౌకీదార్’ అంటూ ట్యాగ్‌ను తగిలించుకోవడం తెల్సిందే. బాలకోట్ బాంబులు గురితప్పి అడవిలో పడ్డాయంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో రుజువులు చూపించాల్సిందిగా రాహుల్ చేసిన సవాల్‌కు ప్రతిగా.. రాహుల్‌ను పాక్ మిత్రుడిగా మోదీ అభివర్ణిస్తున్న విషయం తెల్సిందే.
మోదీ ఈ 182 రోజుల్లో రోజుకు సరాసరి 12 ట్వీట్లు, అంటే రెండు గంటలకు ఒక్క ట్వీట్ చొప్పున చేశారు. ఆయన గత అక్టోబర్ నెలలో రోజుకు సరాసరి 16 ట్వీట్ల చొప్పున చేయగా, 2019, ఫిబ్రవరి రోజుకు సరాసరి 9 ట్వీట్లు చేశారు. ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో మార్చి నెలలో రోజుకు సరాసరి 11 ట్వీట్లు చేశారు. మోదీ తన ట్వీట్ల సందర్భంగా పలు హాష్‌ట్యాగ్‌లను కూడా ఉపయోగించారు. జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని మోదీ హాష్‌ట్యాగ్ గాంధీ150, మన్‌కీబాత్, వోటకర్, మైభీచౌకీదార్, మిషన్‌శక్తి తదితర హ్యాష్‌ట్యాగ్‌లు ఉపయోగించారు. మొత్తం 2,143 ట్వీట్లకుగాను 77 లక్షలు రీట్వీట్లు వెళ్లాయి. వాటికి 3.24 కోట్ల లైక్స్ వచ్చాయి. పాక్ సైనికులకు చిక్కిన భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ విడుదల సందర్భంగా ఎక్కువ రీట్వీట్లు (66,485), ఎక్కువ లైక్స్ (2,71,932) వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment