సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీకి ప్రత్యామ్నాయంగా పటిష్టమైన మహా కూటమిని కూడగట్టడంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విఫలమవడం వల్లనే మరోమారు నరేంద్ర మోదీ ప్రధాన మంత్రయ్యారంటూ రాహుల్‌పై విమర్శలు వెత్తుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ–బీఎస్పీ కూటమితో జతకట్టి ఉన్నట్లయితే, మహారాష్ట్రలో వంచిత్ బహుజన్ అఘాదితో విభేదాలు పరిష్కరించుకున్నట్లయితే, ఢిల్లీలో ఆప్‌తో జతకట్టి ఉన్నట్లయితే ఫలితాలు వేరుగా ఉండేవని కొన్ని రాజకీయ పక్షాలు వాదిస్తున్నాయి. వారి వాదనలో నిజమెంత? వారన్నట్లుగా ఇవన్నీ పక్షాలు కలిసి మహా కూటమిగా పోటీ చేసి ఉన్నట్లయితే ఎన్నికల ఫలితాలు ఎలా ఉండేవి ?
ఏడాది క్రితం కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్) పార్టీలు ఏకమైనప్పుడు దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్ని ఏకమవుతాయన్న ఆశలు చిగురించాయి. కొన్ని రాష్ట్రాల్లో ఇది కుదిరి, కొన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్షాల మధ్య ఐక్యత కుదరకపోవడం వల్ల మిశ్రమ ఫలితాలు వచ్చాయి. తమిళనాడులో డీఎంకేతో కాంగ్రెస్ పార్టీ జత కట్టడం వల్ల 38 సీట్లకుగాను 37 సీట్లను ప్రతిపక్షాలు గెలుచుకోగలిగాయి. బీహార్‌లో ఒక్క రాష్ట్రీయ జనతాదళ్‌తోనే కాకుండా అన్ని ప్రతిపక్షాలతో కలిసి మహా కూటమిగా పోటీ చేసినా 40 సీట్లకుగాను ఒక్క సీటు మాత్రమే దక్కింది. బీజేపీ ప్రభంజనాన్ని పరిగణలోకి తీసుకున్నట్లయితే అన్ని ప్రతిపక్ష పార్టీలు ఏకమైనా దాన్ని అడ్డుకునేవి కావు. ఎందుకంటే 13 రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో బీజేపీకి 50 శాతానికిపైగా ఓట్లు వచ్చాయి. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, అస్సాం రాష్ట్రాల్లో 159 సీట్లు ఉండగా, కాంగ్రెస్–మిత్రపక్షాలకు పది సీట్లు రాగా, కూటమిలో చేరే అవకాశం ఉండిన పార్టీలకు 17 సీట్లు వచ్చాయి. బీజేపీ కూటమికి 132 సీట్లు వచ్చేవి. ఈ ఐదు రాష్ట్రాల్లో బీజేపీ వ్యతిరేకపక్షాలన్నింటితో కలిసి కాంగ్రెస్ పోటీచేసి ఉన్నట్లయితే ఈ కూటమికి అదనంగా 18 సీట్లు వచ్చేవి. అంటే బీజేపీకి కూటమికి 104, వ్యతిరేక కూటమికి 45 వచ్చి ఉండేవి. ఆయా పార్టీలకు వచ్చిన పోలింగ్ శాతాన్ని పరిగణలోకి తీసుకుంటేనే ఈ లెక్క తేలింది. పార్టీలు పొత్తు కుదుర్చుకున్నప్పుడు ఒక్క పార్టీకి వచ్చే ఓట్ల శాతం పూర్తిగా ఇతర పార్టీలకు రావు. ఆ లెక్కన ఈ 18 సీట్ల సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉంది.
అస్సాంలో
కాంగ్రెస్ పార్టీ అస్సాంలో అఖిల భారత ఐక్య ప్రజాస్వామిక ఫ్రంట్ (ఏఐయుడిఎఫ్)తో పొత్తు పెట్టుకున్నట్లయితే కరీంగంజ్ నియోజకవర్గంలో గెలవడం ద్వారా కాంగ్రెస్ కూటమికి ఒక్క సీటు వచ్చేది. అక్కడ బీజేపీ అభ్యర్థి కృఫాల్‌నాథ్ మల్లా 44.62 శాతం ఓట్లతో విజయం సాధించారు. అక్కడ ఫ్రంట్ అభ్యర్థి రాధేశ్వామ్ బిశ్వాస్‌కన్నా బీజేపీ అభ్యర్థికి కేవలం 3.62 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి స్వరూప్ దాస్‌కు 11.36 శాతం ఓట్లు వచ్చాయి. ఈ ఓటింగ్ శాతాన్ని కూడితే ఫ్రంట్ అభ్యర్థి గెలిచే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ ముస్లిం అంతా మైనారిటీ వర్గాలకు ప్రతినిధిగా భావిస్తోన్న ఫ్రంట్ అభ్యర్థికి ఓటు వేశారు. ఫ్రంట్, కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకన్నట్లయితే కొత్త మంది ముస్లింలు ఓటింగ్‌కే వచ్చేవారు కాదు.
ఢిల్లీలో
ఢిల్లీలో చివరకు ఆప్, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదురుతుందని ఇరువర్గాలు భావించాయి. ఆ రెండు కలిస్తే బీజేపీకి గట్టిపోటీ అవుతుందని రాజకీయ పరిశీలకులు భావించారు. కానీ అది జరిగి ఉండేది కాదు. ఢిల్లీలోని ఏడు నియోజకవర్గాల్లో 50 శాతానికిపైగా ఓట్ల తేడాతోనే బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. పైగా ఢిల్లీ ఓటర్లు కేంద్రంలో విజయం సాధించే అవకాశం ఉన్న పార్టీకే సహజంగా ఓటు వేస్తారు.
హర్యానాలో
కాంగ్రెస్ పార్టీ హర్యానాలోని జన్నాయక్ జనతా పార్టీ లేదా బహుజన సమాజ్ పార్టీతోని పొత్తు పెట్టుకున్నట్లయితే ఒక్క రోహతక్ నియోజకవర్గం సీటు మాత్రమే కాంగ్రెస్ కూటమికి వచ్చేది. అక్కడ బీజేపీ అభ్యర్థి కేవలం 7,503 ఓట్ల మెజారిటీతో విజయం సాధించగా, జన్నాయక్ జనతా పార్టీ అభ్యర్థికి 21,211, బీఎస్పీకి 38,364 ఓట్లు వచ్చాయి. ఇందులో ఏ ఒక్క పార్టీతోని పొత్తుపెట్టుకున్నా కాంగ్రెస్ కూటమికి ఈ సీటు వచ్చేది.
మహారాష్ట్రలో
మహారాష్ట్రలో అన్ని బీజేపీ వ్యతిరేక పార్టీలు ఒక్కటై ఉన్నట్లయితే కాస్త మంచి ఫలితాలే వచ్చేవి. అంటే ప్రకాష్ అంబేద్కర్ నాయకత్వంలోని వంచిత్ బహుజన్ అఘాదితో కాంగ్రెస్–ఎన్‌సీపీ కూటమి పొత్తు పెట్టుకున్నట్లయితే బుల్దానా, హాత్కనంగల్, పర్భణి, సోలాపూర్, నాందేడ్, సాంగ్లీ, గడ్చీరోలి చిమూర్...ఏడు సీట్లను గెలుచుకునేది. అంటే కాంగ్రెస్ కూటమికి ఐదు బదులు 12 సీట్లు వచ్చేవి. బీజేపీ–శివసేన కూటమికి 41కి బదులు 34 వచ్చేవి.
ఉత్తరప్రదేశ్‌లో
కాంగ్రెస్, తన మిత్రపక్షమైన జన అధికార్ పార్టీతో కలిసి ఎస్పీ–బీఎస్పీ–ఆర్‌ఎల్డీ కూటమితో కలిసి పోటీ చేసినట్లయితే దౌరాష్ట్ర, మీరట్, బదౌన్, బారబంకి, బాండా, సుల్తాన్‌పూర్, బస్తీ, సంత్ కబీర్ నగర్, ఛందౌలి...తొమ్మిది సీట్లు ఎక్కువ వచ్చేవి. అంటే రాష్ట్రంలోని 80 సీట్లకుగాను మహా కూటమికి 24 సీట్లు వచ్చేవి. బీజేపీ కూటమికి 64కు బదులు 56 సీట్లు వచ్చేవి. మొత్తంగా కాంగ్రెస్ కూటమికి 18 సీట్లు పెరిగేవి, బీజేపీ కూటమికి 18 సీట్లు తగ్గేవి. దీనివల్ల ఫలితం ఏమీ ఉండేది కాదు.
Comments
Please login to add a commentAdd a comment