అశోక్ గహ్లోత్
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసినదగ్గర నుంచి కొత్త అధ్యక్షుడెవరన్నది చర్చనీయాంశమయింది. రాజీనామాను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తిరస్కరించినా, పదవిలో కొనసాగాల్సిందిగా పలువురు సీనియర్లు బతిమాలినా రాహుల్ గాంధీ ససేమిరా అంటున్నారు. దాంతో సోనియా గాంధీ, అహ్మద్ పటేల్, గులాం నబీ ఆజాద్, ఏకే ఆంటోనీ, కేసీ వేణుగోపాల్‌తో కూడిన కమిటీ కొత్త అధ్యక్షుడి కోసం వెదుకులాట మొదలు పెట్టింది.
ఈ ప్రక్రియలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ పేరు తెరపైకి వచ్చింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం, పార్టీతో అనుబంధం ఉన్న గహ్లోత్ అధ్యక్ష పదవికి సరైన వారని నాయకత్వం భావిస్తోందని తెలిసింది. గెహ్లాట్‌కు పార్టీ పగ్గాలు అప్పగించడం ద్వారా కాంగ్రెస్‌లో కుటుంబ పాలన నడుస్తోందన్న విపక్షాల విమర్శకు తెరదించవచ్చని కాంగ్రెస్ నాయకత్వం ఆలోచిస్తోందని సమాచారం. అందుకు గహ్లోత్‌ను ఒప్పించిందని సీనియర్ నాయకుడొకరు ధ్రువీకరించారు. గహ్లోత్‌కు అధ్యక్ష పదవి ఖరారయిందని నవభారత్ టైమ్స్ పత్రిక పేర్కొంది.
జూన్ 19న రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న గహ్లోత్ కొద్దిసేపు రాహుల్‌తో ఏకాంతంగా సమావేశమవడం ఇందుకు బలం చేకూరుస్తోంది. రాహుల్ అధ్యక్ష పదవిలో కొనసాగేలా చూసేందుకు నేతలు విఫలయత్నం చేశారు. రాహుల్ నిర్ణయాన్ని సోనియా వ్యతిరేకించారు. రాజీనామా చేస్తే దక్షిణాదిన పార్టీ దెబ్బతింటుందని చిదంబరం హెచ్చరించారు. అయినా రాహుల్ పట్టు వీడలేదు. పార్టీ పగ్గాలు స్వీకరించడానికి ప్రియాంక కూడా సుముఖంగా లేరు. దాంతో కొత్త నేత ఎంపిక అనివార్యమయింది.
గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడిగా పేరున్న 68 ఏళ్ల గహ్లోత్‌కు పార్టీతో సుదీర్ఘ అనుబంధం ఉంది. గతంలో రెండు సార్లు సీఎంగా పని చేసిన ఆయన మూడోసారి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. గహ్లోత్‌ను పార్టీ అధ్యక్షుడిని చేసి సీఎం పదవిని సచిన్ పైలట్‌కు ఇవ్వాలని తద్వారా ఆ ఇద్దరి మధ్య విభేదాలకు తెరదించాలని అధిష్టానం ఆలోచిస్తోందని సమాచారం. గహ్లోత్ ఒప్పుకోకపోతే ముకుల్ వాస్నిక్, మనీష్ తివారీ, శశి థరూర్ పేర్లు పరిశీలనలో ఉన్నాయని ఆ పత్రిక తెలిపింది. కాగా, ఈ వార్తలను గహ్లోత్ తోసిపుచ్చారు. ఇదిలా ఉండగా, పార్టీకి నలుగురు వరకు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించే విషయం కూడా పరిశీలనలో ఉందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment