
తిరువనంతపురం: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి దేశ వ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. తాజాగా పార్టీ అధ్యక్ష పదివికి పోటీ విషయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకరికి ఒక పోస్టు మాత్రమే అనే నింబంధనను మరోసారి నొక్కి చెప్పారు.అయితే రాహుల్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ అధ్యక్ష పదివిలో పోటీ చేయాలనుకుంటున్న రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్‌కు ఎదురుదెబ్బ తగిలినట్లైంది.
కాగా 71 ఏళ్ల అశోక్ గహ్లోత్ కాగ్రెస్ అధ్యక్ష పదవి కోసం పోటీ చేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఆయన సోనియా గాంధీని కూడా కలిశారు. అయితే రాజస్థాన్ సీఎం పదవిని వదులుకునేందుకు ఆయన సిద్ధంగా లేరు. ఒకవేళ సీఎం పోస్టుకు రాజీనామా చేస్తే తన స్థానంలో సచిన్ పైలట్ వస్తాడని గహ్లోత్ భావిస్తున్నారు. అయితే కొద్దిరోజులుగా గహ్లోత్, పైలట్ మధ్య కోల్డ్‌వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. దీంతో గహ్లోత్ డబుల్ రోల్ ప్లే చేస్తారా అనే సందేహాలు లేవనెత్తుతున్నాయి. ఈ క్రమంలో దీనిపై రాహుల్ గాంధీ క్లారిటీ ఇచ్చారు.
చదవండి: రాహుల్‌కే అధ్యక్ష బాధ్యతలు.. టీపీసీసీ ఏకగ్రీవ తీర్మానం
భారత్ జోడో యాత్రలో భాగంగా ప్రస్తుతం రాహుల్ గాంధీ కేరళలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. తాము ఉదయ్‌పూర్ ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని, ఈ ఒప్పందం ప్రకారం ఒక్కరికి ఒక్క పోస్టు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు. కాగా రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో కాంగ్రెస్ ఈ ఏడాది ప్రారంభంలో ఒక ‘వ్యక్తి, ఒకే పదవి’ నియమాన్ని ఆమోదించింది.
కాంగ్రెస్ అధ్యకుడు అంటే పదవి కాదని.. సైద్దాంతిక వ్యవస్థగా అభివర్ణించారు. కాంగ్రెస్ అధ్యక్షుడి పోటీలో నిలిచే వారు ఎవరైనా.. ఆలోచనల సమితికి, నమ్మకమైన వ్యవస్థకు, ఇండియా విజన్‌కు తాము ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు గుర్తు పెట్టుకోవాలని రాహుల్ గాంధీ సూచించారు.
ఇక అధ్యక్ష పదవి కోసం పోటీపడే వారి సంఖ్య పెరుగుతోంది. అశోక్ గహ్లోత్‌తోపాటు తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ కూడా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. అంతేగాక దిగ్విజయ్ సింగ్ తాను రేసులో ఉన్నానంటూ ముందుకు వచ్చారు. అయితే రాహుల్ నామినేషన్ దాఖలు చేస్తారా లేదా అనే అంశం పైన సస్పెన్స్ కొనసాగుతోంది. రాహుల్ గాంధీ కనుక పోటీ చేయకుంటే వీరు ముగ్గురే ప్రధాన పోటీదారులు అయ్యే అవకాశమూ లేకపోలేదు.
కాంగ్రెస్ నోటిఫికేషన్
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలకు నోటిఫికేషన్ నేడు(గురువారం) వెలువడింది. ఈ నెల 24 నుంచి 30 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ తెలిపారు.. అక్టోబర్ 1న నామినేషన్ పత్రాల పరిశీలన, అక్టోబర్ 8న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. అక్టోబర్ 17న ఓటింగ్ నిర్వహించి.. రెండు రోజుల తర్వాత అంటే అక్టోబర్ 19న ఫలితాలు ప్రకటిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment