
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి తదుపరి అధ్యక్షుడు ఎవరో తమ పార్టీయే నిర్ణయిస్తుంది తప్ప తాను కాదనీ, ఆ పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు రాహుల్ గాంధీ గురువారం అన్నారు. ‘మీరు రాజీనామా చేసిన తర్వాత ఎవరు పార్టీ అధ్యక్షుడు అవుతారు? గెహ్లాటేనా?’ అని రాహుల్‌ను ప్రశ్నించగా ఆయన సమాధానమిస్తూ ‘పార్టీ అధ్యక్షుడిని నియమించే వ్యక్తిని నేను కాను. అశోక్ గెహ్లాట్ తదుపరి అధ్యక్షుడయ్యేందుకు నేను ఆమోదం తెలిపాననడం అంతా అబద్ధం’ అని అన్నారు. తాజా లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైన అనంతరం నైతిక బాధ్యత తీసుకుని తాను పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని రాహుల్ ప్రకటించడం, కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఆయనను బుజ్జగిస్తుండటం తెలిసిందే. తాను రాజీనామా చేసేందుకు కట్టుబడి ఉంటానని రాహుల్ పట్టుబడుతున్నారు.
మాటల ప్రవాహంలో అలా అన్నాను..
‘గిరిజనులను తుపాకీతో కాల్చేందుకు ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చింది’ అంటూ తాను చేసిన వ్యాఖ్యలు మాటల ప్రవాహంలో, వచ్చాయని రాహుల్ జాతీయ ఎస్టీ కమిషన్ (ఎన్‌సీఎస్టీ)కి తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని షాదోల్‌లో ఏప్రిల్ 23న ఎన్నికల ప్రచారంలో రాహుల్ మాట్లాడుతూ ‘నరేంద్ర మోదీ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చింది. దీని ప్రకారం గిరిజనులను అటవీ సిబ్బంది తుపాకీతో కాల్చవచ్చు. వాళ్లు మీ భూములు లాక్కున్నారు. మీ అడవిని, నీళ్లను తీసుకున్నారు. ఇప్పుడు గిరిజనులపై కాల్పులు జరపవచ్చని చెబుతున్నారు’ అని వ్యాఖ్యలు చేశారు.