ఢిల్లీలో రాహుల్‌ను కలిసిన కుమారస్వామి
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్‌లో కీలక పరిణామాలు సంభవిస్తున్నాయి. కాంగ్రెస్ మాజీ నేత, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్య క్షుడు శరద్ పవార్‌తో గురువారం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమావేశం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్‌లో ఎన్‌సీపీని విలీనం చేసే అంశాన్ని ఇద్దరు నేతలు చర్చించి ఉంటారని ఊహాగానాలు వెల్లువెత్తు తున్నాయి. అయితే, ఇరు పార్టీల వర్గాలు అదేం లేదని కొట్టి పారేస్తున్నాయి. శరద్‌పవార్ నివాసానికి వెళ్లిన రాహుల్ దాదాపు గంటపాటు భేటీ అయ్యారు.
తాజా రాజకీయ పరిస్థితిపై వారు చర్చించారు. కాంగ్రెస్ చీఫ్‌గా కొనసాగాలని రాహుల్‌ను పవార్ కోరినట్లు కాంగ్రెస్ వర్గాల సమాచారం. అయితే, ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 52 సీట్లు మాత్రమే గెలుచుకున్న విషయం తెలిసిందే. ప్రతిపక్ష హోదా దక్కాలంటే కాంగ్రెస్‌కు మరో ఇద్దరు సభ్యుల అవసరం ఉంది. ఎన్‌సీపీ ఇటీవలి ఎన్నికల్లో మొత్తం ఐదు సీట్లు గెలుచుకుంది. మహారాష్ట్రలో రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇద్దరు నేతలు ప్రధానంగా చర్చించినట్లు సమాచారం.
దీనిపై మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్ చవాన్ మాట్లాడుతూ.. ‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పనిచేస్తే ఓట్లు చీలిపోకుండా ఉంటాయి. పార్టీల విలీనం వేరే అంశం. దానిని గురించి నాకు తెలియదు’అని అన్నారు. ఇలా ఉండగా, కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ గురువారం పార్టీ ప్రధాన కార్యాలయంలో మల్లికార్జున ఖర్గేతోనూ, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్‌తోనూ విడివిడిగా భేటీ అయ్యారు. జూన్ 1వ తేదీన జరిగే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కొత్త నేతను ఎన్నుకునే విషయమై వీరు చర్చించినట్లు సమాచారం.
నేడు ప్రతిపక్షాల సమావేశం
లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో కాంగ్రెస్ నేతృత్వంలో నేడు ప్రతిపక్ష పార్టీల నేతలు తొలిసారి సమావేశం కానున్నారు. జూన్ 6వ తేదీ నుంచి ప్రారంభమయ్యే లోక్‌సభ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని వారు చర్చించనున్నారు.
టీవీ చర్చల్లో కాంగ్రెస్ పాల్గొనబోదు
పార్టీ అధ్యక్షుడిగా కొనసాగేందుకు రాహుల్ విముఖత.. పార్టీలో నాయకత్వ సంక్షోభం నేపథ్యంలో ఒక నెలపాటు టీవీల్లో జరిగే రాజకీయ చర్చా కార్యక్రమాలకు పిలవద్దని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా ఓ ప్రకటనలో తెలిపారు.
మణిపూర్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా
ఇంఫాల్: కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ పదవులకు రాజీనామాలు చేశారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడానికే పీసీసీ అధ్యక్షుడికి రాజీనామా పత్రాలు సమర్పించినట్లు వీరు చెబుతున్నారు. అయితే, వీరంతా బీజేపీలోకి చేరనున్నారని పుకార్లు వస్తున్నాయి. బీజేపీకి చెందిన ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ నేతృత్వంలో రాష్ట్రంలో ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వం నడుస్తోంది.
సంకీర్ణం కొనసాగుతుంది: కుమారస్వామి భరోసా
కర్ణాటకలో కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి ఏ ఢోకా లేదని సీఎం హెచ్‌డీ కుమారస్వామి కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌కు భరోసా ఇచ్చారు. గురువారం ఆయన రాహుల్‌ను ఆయన నివాసంలో కలిశారు. యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీ నేత ఎస్‌ఎం కృష్ణను కలిశారని వార్తలు వెలువడిన నేపథ్యంలో ఈ భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులను రాహుల్‌కు వివరించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలంటూ రాహుల్‌ను కోరారు. ప్రభుత్వం కూలిపోనుందనే వార్తలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రస్తుతం బెంగళూరులోనే ఉన్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అసమ్మతి ఎమ్మెల్యేలను బుజ్జగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment