Jaise Mohammed chief
-
మసూద్ ఆస్తుల ఫ్రీజ్
ఇస్లామాబాద్: జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజర్ ఆస్తులను స్తంభింపజేయడంతోపాటు ఆయనపై ప్రయాణ నిషేధాన్ని పాక్ విధించింది. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐరాస ప్రకటించడంతో పాక్ ఈ నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్‌కు చెందిన మసూద్ ఇకపై ఆయుధాలు, మందుగుండు సామగ్రిని కొనడం, అమ్మడం వంటివి చేయడానికి వీలు లేదు. సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఆఫ్ పాకిస్తాన్ (ఎస్ఈసీపీ) గురువారం పాకిస్తాన్‌లోని అన్ని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు ఆదేశాలిస్తూ, మసూద్‌కు చెందిన అన్ని పెట్టుబడుల ఖాతాలను స్తంభింపజేయాలంది. పోలీసుల అనుమతి లేకుండా మసూద్ ఎక్కడికీ ప్రయాణిచడానికి కూడా వీలు లేదని పాక్ హోం శాఖకు చెందిన ఓ అధికారి చెప్పారు. కాగా, పుల్వామా ఉగ్రవాద దాడ అనంతరమే మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని విశ్వసనీయవర్గాలు చెప్పాయి. -
నీరవ్‌తో ప్రధానికి పోలికలు
హవేరి(కర్ణాటక)/న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) మోసం కేసులో నిందితుడు నీరవ్ మోదీకి ప్రధాని మోదీకి మధ్య అసాధారణమైన సారూప్యతలున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఎద్దేవా చేశారు. వీరిద్దరూ చట్టానికి అతీతులమని భావిస్తుంటారన్నారు. వేల కోట్ల రుణాలు ఎగొట్టిన నీరవ్ మోదీపై మీడియా కథనాలపై రాహుల్ స్పందించారు. ‘ వీరిద్దరి పేర్లు మోదీనే. ఇద్దరూ దేశాన్ని దోచుకుంటున్నవారే. చట్టానికి అతీతులమని వీరు భావిస్తున్నారు. వీరిని చట్టం ముందు నిలబెడతాం’ అని ట్వీట్ చేశారు. ఇలాంటి పరారైన నేరగాళ్ల కోసం మోదీ ప్రభుత్వం ‘మోసగాళ్ల సెటిల్మెంట్ యోజన’ను ప్రారంభించిందన్నారు. ఉగ్రవాదానికి కాంగ్రెస్ తలొంచదు అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ అజార్‌ను ఎన్డీఏ ప్రభుత్వం జైలు నుంచి ఎందుకు విడిచిపెట్టిందో ప్రజలకు వెల్లడించాలని ప్రధానిని డిమాండ్ చేశారు. ‘ ఏ ప్రభుత్వం అతడిని జైలు నుంచి వదిలిపెట్టింది?’ అంటూ ప్రశ్నించారు. కర్ణాటకలో హవేరీలో జరిగిన సభలో మాట్లాడారు.‘ఇటీవల కశ్మీర్లో సీఆర్పీఎఫ్ జవాన్లను ఉగ్రవాదులు చంపారు. ఈ జవాన్లను ఎవరు చంపారు? జైషే మొహమ్మద్ చీఫ్ ఎవరు? మసూద్ అజార్.. భారత్ జైలులో ఉన్న అతడిని పొరుగుదేశం పంపిందెవరు? వాజ్‌పేయి సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం కాదా? దీనిని గురించి మీరు ఎందుకు మాట్లాడరు? మీ ప్రభుత్వ హయాంలో జైలు నుంచి బయటకు వచ్చిన మసూదే ఇప్పుడు జవాన్లను చంపాడన్న విషయం ఎందుకు మీరు చెప్పడం లేదు?’ అంటూ ప్రశ్నించారు. ‘మోదీజీ..మీకు మాదిరిగా కాంగ్రెస్ ఉగ్రవాదులకు తలొంచదు’ అని రాహుల్ అన్నారు. -
ఉగ్ర మసూద్ మృతి?
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: పేరుమోసిన ఉగ్రవాది, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధిపతి మసూద్ అజార్ (50) పాకిస్తాన్లో చనిపోయినట్లుగా మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో ఆదివారం వార్తలు వచ్చాయి. ఈ వార్తలు నిజమో కాదో కనుగొనేందుకు నిఘా వర్గాలు ప్రయత్నిస్తున్నాయని భారత అధికారులు చెప్పారు. అయితే మసూద్ చనిపోయాడంటూ వచ్చిన వార్తలు అవాస్తవమని పాకిస్తాన్‌కు చెందిన జియో ఉర్దూ న్యూస్ ఆ వార్తలను కొట్టిపారేసింది. మసూద్ బతికే ఉన్నాడన్న విషయాన్ని అతని కుటుంబానికి సన్నిహితుల ద్వారా తాము తెలుసుకున్నామంది. మరోవైపు ఇప్పటివరకు దీనిపై పాకిస్తాన్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన, సమాచారం లేదు. మూత్రపిండాల వైఫల్యం కారణంగా మసూద్ అజార్ ఇస్లామాబాద్‌లోని సైనిక వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడన్న సమాచారం మాత్రమే తమకు ప్రస్తుతానికి తెలుసుననీ, అంతకు మించి వివరాలు లేవని అధికారులు అంటున్నారు. 2001లో భారత పార్లమెంటుపై దాడి, ఆ తర్వాతి కాలంలో జమ్మూ కశ్మీర్ శాసనసభపై ఆత్మాహుతి దాడి, 2016లో పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడి, తాజాగా పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై దాడి తదితర కీలక కేసుల్లో మసూద్ అజార్ సూత్రధారి అన్న ఆరోపణలు ఉన్నాయి. మసూద్ అజార్ తమ దేశంలోనే ఉన్నాడనీ, అయితే అతను తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడని పాక్ విదేశాంగ శాఖ మంత్రి షా ముహ్మద్ ఖురేషీ ఇటీవల సీఎన్ఎన్ ఇంటర్వ్యూలో ఒప్పుకున్నారు. అయితే భారత్ గట్టి ఆధారాలను సమర్పిస్తే తప్ప ఉగ్రవాద దాడుల విషయంలో మసూద్‌పై చర్యలు తీసుకోలేమని స్పష్టం చేశారు. కాగా, పుల్వామా దాడిలో జైషే మహ్మద్ కుట్రను వివరిస్తూ భారత్ ఒక ఫైల్‌ను కూడా ఇటీవలే పాకిస్తాన్‌కు అప్పగించి, ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన మాట నిలుపుకోవాలని సవాల్ చేసింది. 1999లో భారత్ నుంచి విడుదల మసూద్ అజార్ 1968లో పాకిస్తాన్ పంజాబ్‌లోని బహవాల్పూర్లో జన్మించాడు. తొలుత పోర్చుగీస్ పాస్‌పోర్టు మీద అతను జమ్మూ కశ్మీర్లోకి ప్రవేశించి అనేక ఉగ్రవాద సంస్థలు, బృందాలతో పరిచయాలు ఏర్పరచుకున్నాడు. ఉగ్రవాదం ఆరోపణలపై 1994లో భారత అధికారులు అతణ్ని అరెస్టు చేయగా, ‘మీరు నన్ను ఎక్కువ రోజులు లోపల ఉంచలేరు’ అని జైలు సిబ్బందితో అనేవాడని చెబుతారు. జైలు నుంచి పారిపోయేందుకు తోటి ఉగ్రవాదులతో కలిసి సొరంగం తవ్వాడనీ, అందులో ఇరుక్కుపోవడంతో ఆ ప్రయత్నం విఫలమైందని ఓ అధికారి చెప్పినట్లు ఏఎఫ్‌పీ పేర్కొంది. అతను 1999 వరకు జైలులోనే ఉన్నాడు. ఆ ఏడాది కఠ్మాండు నుంచి ఢిల్లీ వస్తున్న, ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేసి, కాందహార్‌కు తరలించారు. అందులోని ప్రయాణికులను విడిపించడం కోసం మసూద్ అజార్‌తోపాటు మరో ఇద్దరు ఉగ్రవాదులను జైలు నుంచి భారత్ విడుదల చేసింది. ఆ హైజాకర్లలో మసూద్ అజార్ తమ్ముడు ఇబ్రహీం అథార్ కూడా ఉన్నాడని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మసూద్ అజార్ 2000 ఏడాదిలో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. అల్కాయిదాచీఫ్ ఒసామా బిన్ లాడెన్, తాలిబన్‌ను స్థాపించిన ముల్లా మహ్మద్ ఒమర్‌లను మసూద్ అఫ్గానిస్తాన్‌లో కలిశాడని అమీర్ రాణా అనే భద్రత విషయాల విశ్లేషకుడు చెప్పారు. 2001లో భారత పార్లమెంటుపై దాడి కేసులో అజార్‌ను పాక్ గృహనిర్బంధంలో ఉంచింది. ఈ కేసులో ఆధారాల్లేవంటూ లాహోర్ కోర్టు తీర్పునివ్వడంతో 2002లో విడుదలయ్యాడు. 2016లో ఉడీ సైనిక శిబిరంపై దాడి అనంతరం కూడా మసూద్‌ను పాక్ కస్టడీలోకి తీసుకున్నప్పటికీ నేరారోపణలేవీ మోపలేదు. గతేడాది జూలైలో అతను గుర్తు తెలియని ప్రదేశం నుంచి ఫోన్ ద్వారా పీవోకేలోని ముజఫరాబాద్‌లో మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తర్వాత నుంచి అతని జాడ లేదు. త్వరలో మసూద్‌పై పాక్ చర్యలు భారత్‌తో ఉద్రిక్తతలను తగ్గించడం కోసం మసూద్‌పై చర్యలు తీసుకునేందుకు పాకిస్తాన్ నిర్ణయించిందని ఆ దేశ ప్రభుత్వంలోని ఓ ఉన్నతాధికారి చెప్పారు. మరోవైపు మసూద్‌పై ఐక్యరాజ్య సమితి ‘ప్రపంచ ఉగ్రవాది’ అని ముద్ర వేసే విషయంలో తరచూ అడ్డు చెబుతున్న పాక్.. ఈసారి అందుకు వ్యతిరేకత తెలపకపోవచ్చని ఆ దేశంలోని ఓ మీడియా సంస్థ పేర్కొంది. భారత్, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ తదితర దేశాలు మసూద్ అజార్‌పై ఐరాస చేత ఉగ్రవాదిగా ముద్ర వేయించేందుకు ప్రయత్నిస్తున్నా ఇన్నాళ్లూ చైనా అడ్డుతగులుతుండటం తెలిసిందే. మసూద్ స్థాపించిన జైషే మహ్మద్‌ను ఐక్యరాజ్య సమితి ఇప్పటికే నిషేధించింది. మసూద్‌పై కూడా ఉగ్రవాదిగా ముద్ర వేయించేందుకు మరోసారి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు భద్రతా మండలిలో గత బుధవారం ప్రతిపాదించాయి. -
పాక్‌లోనే మసూద్ అజార్
ఇస్లామాబాద్: ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ పాక్‌లోనే ఉన్నాడని పాక్ విదేశాంగ మంత్రి మహమూద్ ఖురేషి అంగీకరించారు. అజార్ ప్రస్తుతం ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టలేనంతగా అనారోగ్యంతో బాధపడుతున్నాడన్నారు. అజార్‌కు సంబంధించి పాకిస్తాన్ కోర్టుల్లో గట్టి సాక్ష్యాలను భారత్ సమర్పిస్తే అతనిపై తమ ప్రభుత్వం∙చర్యలు తీసుకుంటుందని చెప్పారు. చట్టపరమైన ప్రక్రియ చేపట్టడానికి తగిన ఆధారాలు ఉండాలన్నారు. పుల్వామా ఉగ్రదాడి, భారత్ సర్జికల్ దాడుల తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో మసూద్ తమ దేశంలోనే ఉన్నాడని పాక్ ప్రకటించడం గమనార్హం. ఇప్పటికే మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలని ఐక్యరాజ్యసమితిలో భారత్ ప్రతిపాదించిన విషయం తెల్సిందే. పుల్వామా దాడుల్లో జైషే పాత్ర, పాక్‌లో జైషే ఉగ్ర శిబిరాల వివరాలపై పాక్‌కు భారత్ అనేక సాక్ష్యాలను ఇప్పటికే అందించింది. కాగా, పైలట్ అభినందన్‌ను భారత్‌కు అప్పగించడం శాంతి ప్రక్రియలో భాగమని ఖురేషి తెలిపారు. -
మసూద్‌ను ఉగ్రవాదిగా ప్రకటించేదెప్పుడు?
ఐరాస తీరుపై భారత్ ఆగ్రహం న్యూయార్క్: జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్‌ను ఉగ్రవాదిగా ప్రకటించడంతో భద్రతామండలి అనుసరిస్తున్న తీరును భారత్ గర్హించింది. ఐక్యరాజ్యసమితిలో సోమవారం జరిగిన సదస్సులో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ మాట్లాడారు. మసూద్‌ను ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత్ ప్రతిపాదనకు చైనా మోకాలడ్డిందని..దీనిపై మండలి 9 నెలలు సమయం తీసుకుందన్నారు. కాగా, భద్రతామండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వ ప్రతిపాదనను పాకిస్తాన్ వ్యతిరేకించింది.