ఉగ్ర మసూద్‌ మృతి? | Pakistan denies rumours of death of Jaish-e-Mohammad Chief Azhar | Sakshi
Sakshi News home page

ఉగ్ర మసూద్‌ మృతి?

Published Mon, Mar 4 2019 4:08 AM | Last Updated on Mon, Mar 4 2019 4:35 AM

Pakistan denies rumours of death of Jaish-e-Mohammad Chief Azhar - Sakshi

న్యూఢిల్లీ/ఇస్లామాబాద్‌: పేరుమోసిన ఉగ్రవాది, జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ అధిపతి మసూద్‌ అజార్‌ (50) పాకిస్తాన్‌లో చనిపోయినట్లుగా మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో ఆదివారం వార్తలు వచ్చాయి. ఈ వార్తలు నిజమో కాదో కనుగొనేందుకు నిఘా వర్గాలు ప్రయత్నిస్తున్నాయని భారత అధికారులు చెప్పారు. అయితే మసూద్‌ చనిపోయాడంటూ వచ్చిన వార్తలు అవాస్తవమని పాకిస్తాన్‌కు చెందిన జియో ఉర్దూ న్యూస్‌ ఆ వార్తలను కొట్టిపారేసింది.

మసూద్‌ బతికే ఉన్నాడన్న విషయాన్ని అతని కుటుంబానికి సన్నిహితుల ద్వారా తాము తెలుసుకున్నామంది. మరోవైపు ఇప్పటివరకు దీనిపై పాకిస్తాన్‌ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన, సమాచారం లేదు. మూత్రపిండాల వైఫల్యం కారణంగా మసూద్‌ అజార్‌ ఇస్లామాబాద్‌లోని సైనిక వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడన్న సమాచారం మాత్రమే తమకు ప్రస్తుతానికి తెలుసుననీ, అంతకు మించి వివరాలు లేవని అధికారులు అంటున్నారు.

2001లో భారత పార్లమెంటుపై దాడి, ఆ తర్వాతి కాలంలో జమ్మూ కశ్మీర్‌ శాసనసభపై ఆత్మాహుతి దాడి, 2016లో పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరంపై దాడి, తాజాగా పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై దాడి తదితర కీలక కేసుల్లో మసూద్‌ అజార్‌ సూత్రధారి అన్న ఆరోపణలు ఉన్నాయి. మసూద్‌ అజార్‌ తమ దేశంలోనే ఉన్నాడనీ, అయితే అతను తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడని పాక్‌ విదేశాంగ శాఖ మంత్రి షా ముహ్మద్‌ ఖురేషీ ఇటీవల సీఎన్‌ఎన్‌ ఇంటర్వ్యూలో ఒప్పుకున్నారు. అయితే భారత్‌ గట్టి ఆధారాలను సమర్పిస్తే తప్ప ఉగ్రవాద దాడుల విషయంలో మసూద్‌పై చర్యలు తీసుకోలేమని స్పష్టం చేశారు. కాగా, పుల్వామా దాడిలో జైషే మహ్మద్‌ కుట్రను వివరిస్తూ భారత్‌ ఒక ఫైల్‌ను కూడా ఇటీవలే పాకిస్తాన్‌కు అప్పగించి, ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తన మాట నిలుపుకోవాలని సవాల్‌ చేసింది.

1999లో భారత్‌ నుంచి విడుదల
మసూద్‌ అజార్‌ 1968లో పాకిస్తాన్‌ పంజాబ్‌లోని బహవాల్పూర్‌లో జన్మించాడు. తొలుత పోర్చుగీస్‌ పాస్‌పోర్టు మీద అతను జమ్మూ కశ్మీర్‌లోకి ప్రవేశించి అనేక ఉగ్రవాద సంస్థలు, బృందాలతో పరిచయాలు ఏర్పరచుకున్నాడు. ఉగ్రవాదం ఆరోపణలపై 1994లో భారత అధికారులు అతణ్ని అరెస్టు చేయగా, ‘మీరు నన్ను ఎక్కువ రోజులు లోపల ఉంచలేరు’ అని జైలు సిబ్బందితో అనేవాడని చెబుతారు. జైలు నుంచి పారిపోయేందుకు తోటి ఉగ్రవాదులతో కలిసి సొరంగం తవ్వాడనీ, అందులో ఇరుక్కుపోవడంతో ఆ ప్రయత్నం విఫలమైందని ఓ అధికారి చెప్పినట్లు ఏఎఫ్‌పీ పేర్కొంది.

అతను 1999 వరకు జైలులోనే ఉన్నాడు. ఆ ఏడాది కఠ్మాండు నుంచి ఢిల్లీ వస్తున్న, ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్‌ చేసి, కాందహార్‌కు తరలించారు.  అందులోని ప్రయాణికులను విడిపించడం కోసం మసూద్‌ అజార్‌తోపాటు మరో ఇద్దరు ఉగ్రవాదులను జైలు నుంచి భారత్‌ విడుదల చేసింది. ఆ హైజాకర్లలో మసూద్‌ అజార్‌ తమ్ముడు ఇబ్రహీం అథార్‌ కూడా ఉన్నాడని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మసూద్‌ అజార్‌ 2000 ఏడాదిలో జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థను స్థాపించాడు.

అల్‌కాయిదాచీఫ్‌ ఒసామా బిన్‌ లాడెన్, తాలిబన్‌ను స్థాపించిన ముల్లా మహ్మద్‌ ఒమర్‌లను మసూద్‌ అఫ్గానిస్తాన్‌లో కలిశాడని అమీర్‌ రాణా అనే భద్రత విషయాల విశ్లేషకుడు చెప్పారు. 2001లో భారత పార్లమెంటుపై దాడి కేసులో అజార్‌ను పాక్‌ గృహనిర్బంధంలో ఉంచింది. ఈ కేసులో ఆధారాల్లేవంటూ లాహోర్‌ కోర్టు తీర్పునివ్వడంతో 2002లో  విడుదలయ్యాడు. 2016లో ఉడీ సైనిక శిబిరంపై దాడి అనంతరం కూడా మసూద్‌ను పాక్‌ కస్టడీలోకి తీసుకున్నప్పటికీ  నేరారోపణలేవీ మోపలేదు. గతేడాది జూలైలో అతను గుర్తు తెలియని ప్రదేశం నుంచి ఫోన్‌ ద్వారా పీవోకేలోని ముజఫరాబాద్‌లో మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తర్వాత నుంచి అతని జాడ లేదు.

త్వరలో మసూద్‌పై పాక్‌ చర్యలు
భారత్‌తో ఉద్రిక్తతలను తగ్గించడం కోసం మసూద్‌పై చర్యలు తీసుకునేందుకు పాకిస్తాన్‌ నిర్ణయించిందని ఆ దేశ ప్రభుత్వంలోని ఓ ఉన్నతాధికారి చెప్పారు. మరోవైపు  మసూద్‌పై ఐక్యరాజ్య సమితి ‘ప్రపంచ ఉగ్రవాది’ అని ముద్ర వేసే విషయంలో తరచూ అడ్డు చెబుతున్న పాక్‌.. ఈసారి అందుకు వ్యతిరేకత తెలపకపోవచ్చని ఆ దేశంలోని ఓ మీడియా సంస్థ పేర్కొంది. భారత్, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌ తదితర దేశాలు మసూద్‌ అజార్‌పై ఐరాస చేత ఉగ్రవాదిగా ముద్ర వేయించేందుకు ప్రయత్నిస్తున్నా ఇన్నాళ్లూ చైనా అడ్డుతగులుతుండటం తెలిసిందే. మసూద్‌ స్థాపించిన జైషే మహ్మద్‌ను ఐక్యరాజ్య సమితి ఇప్పటికే నిషేధించింది. మసూద్‌పై కూడా ఉగ్రవాదిగా ముద్ర వేయించేందుకు మరోసారి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు భద్రతా మండలిలో గత బుధవారం ప్రతిపాదించాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement