viral on social media
-
అవాక్కవకుండా ఆన్సర్ చెప్పండి.!
సాక్షి, బెంగుళూరు: క్వశ్చన్ పేపర్ కొత్తగా ట్రై చేద్దామనుకున్నాడో టీచర్..! కానీ అది కాస్తా బెడిసి కొట్టింది. దీంతో అయ్యగారి ఉద్యోగమే ఊడింది. రాజరాజేశ్వరి నగర్‌లోని మౌంట్ కార్మెల్ ఇంగ్లీష్ హైస్కూల్లో తయారు చేసిన 8వ తరగతి ప్రశ్నాపత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వినటానికి తమాషాగా అనిపించినా, అసలే ఎన్నికల సమయం కావటంతో విమర్శలకు దారితీసింది. ఇంతలా తిప్పలు పెట్టిన ప్రశ్న ఏంటంటే... రైతు మిత్రులు ఎవరు? అన్న ప్రశ్నకు ...సమాధానంగా ఇచ్చిన ఆప్షన్లు చూస్తే అవాక్కవ్వాల్సిందే. ఎ. కుమారస్వామి బి. వానపాములు సి. యడ్యూర్పప్ప... ఆప్షన్లను చూసి ఒక్కసారిగా బిత్తరపోయిన విద్యార్థులు ఆ తర్వాత తేరుకొని తడుముకోకుండా సమాధానాన్ని ఎంచుకున్నారు. బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్పను, రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామిని కాదని విద్యార్థులు... రైతు మిత్రులుగా వానపాములకే ఓటేశారు. ఈ ప్రశ్నాపత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో స్కూల్ యాజమాన్యం సదరు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకుంది. నిర్లక్ష్యంగా ప్రశ్నాపత్రాన్ని తయారు చేసిన టీచర్‌ను విధుల నుంచి తొలగించింది. అంతేకాకుండా తాము ఏ పార్టీకి మద్దతు ఇవ్వలేదని సంజాయిషీ ఇచ్చుకుంది. -
ఉగ్ర మసూద్ మృతి?
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: పేరుమోసిన ఉగ్రవాది, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధిపతి మసూద్ అజార్ (50) పాకిస్తాన్లో చనిపోయినట్లుగా మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో ఆదివారం వార్తలు వచ్చాయి. ఈ వార్తలు నిజమో కాదో కనుగొనేందుకు నిఘా వర్గాలు ప్రయత్నిస్తున్నాయని భారత అధికారులు చెప్పారు. అయితే మసూద్ చనిపోయాడంటూ వచ్చిన వార్తలు అవాస్తవమని పాకిస్తాన్‌కు చెందిన జియో ఉర్దూ న్యూస్ ఆ వార్తలను కొట్టిపారేసింది. మసూద్ బతికే ఉన్నాడన్న విషయాన్ని అతని కుటుంబానికి సన్నిహితుల ద్వారా తాము తెలుసుకున్నామంది. మరోవైపు ఇప్పటివరకు దీనిపై పాకిస్తాన్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన, సమాచారం లేదు. మూత్రపిండాల వైఫల్యం కారణంగా మసూద్ అజార్ ఇస్లామాబాద్‌లోని సైనిక వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడన్న సమాచారం మాత్రమే తమకు ప్రస్తుతానికి తెలుసుననీ, అంతకు మించి వివరాలు లేవని అధికారులు అంటున్నారు. 2001లో భారత పార్లమెంటుపై దాడి, ఆ తర్వాతి కాలంలో జమ్మూ కశ్మీర్ శాసనసభపై ఆత్మాహుతి దాడి, 2016లో పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడి, తాజాగా పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై దాడి తదితర కీలక కేసుల్లో మసూద్ అజార్ సూత్రధారి అన్న ఆరోపణలు ఉన్నాయి. మసూద్ అజార్ తమ దేశంలోనే ఉన్నాడనీ, అయితే అతను తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడని పాక్ విదేశాంగ శాఖ మంత్రి షా ముహ్మద్ ఖురేషీ ఇటీవల సీఎన్ఎన్ ఇంటర్వ్యూలో ఒప్పుకున్నారు. అయితే భారత్ గట్టి ఆధారాలను సమర్పిస్తే తప్ప ఉగ్రవాద దాడుల విషయంలో మసూద్‌పై చర్యలు తీసుకోలేమని స్పష్టం చేశారు. కాగా, పుల్వామా దాడిలో జైషే మహ్మద్ కుట్రను వివరిస్తూ భారత్ ఒక ఫైల్‌ను కూడా ఇటీవలే పాకిస్తాన్‌కు అప్పగించి, ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన మాట నిలుపుకోవాలని సవాల్ చేసింది. 1999లో భారత్ నుంచి విడుదల మసూద్ అజార్ 1968లో పాకిస్తాన్ పంజాబ్‌లోని బహవాల్పూర్లో జన్మించాడు. తొలుత పోర్చుగీస్ పాస్‌పోర్టు మీద అతను జమ్మూ కశ్మీర్లోకి ప్రవేశించి అనేక ఉగ్రవాద సంస్థలు, బృందాలతో పరిచయాలు ఏర్పరచుకున్నాడు. ఉగ్రవాదం ఆరోపణలపై 1994లో భారత అధికారులు అతణ్ని అరెస్టు చేయగా, ‘మీరు నన్ను ఎక్కువ రోజులు లోపల ఉంచలేరు’ అని జైలు సిబ్బందితో అనేవాడని చెబుతారు. జైలు నుంచి పారిపోయేందుకు తోటి ఉగ్రవాదులతో కలిసి సొరంగం తవ్వాడనీ, అందులో ఇరుక్కుపోవడంతో ఆ ప్రయత్నం విఫలమైందని ఓ అధికారి చెప్పినట్లు ఏఎఫ్‌పీ పేర్కొంది. అతను 1999 వరకు జైలులోనే ఉన్నాడు. ఆ ఏడాది కఠ్మాండు నుంచి ఢిల్లీ వస్తున్న, ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేసి, కాందహార్‌కు తరలించారు. అందులోని ప్రయాణికులను విడిపించడం కోసం మసూద్ అజార్‌తోపాటు మరో ఇద్దరు ఉగ్రవాదులను జైలు నుంచి భారత్ విడుదల చేసింది. ఆ హైజాకర్లలో మసూద్ అజార్ తమ్ముడు ఇబ్రహీం అథార్ కూడా ఉన్నాడని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మసూద్ అజార్ 2000 ఏడాదిలో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. అల్కాయిదాచీఫ్ ఒసామా బిన్ లాడెన్, తాలిబన్‌ను స్థాపించిన ముల్లా మహ్మద్ ఒమర్‌లను మసూద్ అఫ్గానిస్తాన్‌లో కలిశాడని అమీర్ రాణా అనే భద్రత విషయాల విశ్లేషకుడు చెప్పారు. 2001లో భారత పార్లమెంటుపై దాడి కేసులో అజార్‌ను పాక్ గృహనిర్బంధంలో ఉంచింది. ఈ కేసులో ఆధారాల్లేవంటూ లాహోర్ కోర్టు తీర్పునివ్వడంతో 2002లో విడుదలయ్యాడు. 2016లో ఉడీ సైనిక శిబిరంపై దాడి అనంతరం కూడా మసూద్‌ను పాక్ కస్టడీలోకి తీసుకున్నప్పటికీ నేరారోపణలేవీ మోపలేదు. గతేడాది జూలైలో అతను గుర్తు తెలియని ప్రదేశం నుంచి ఫోన్ ద్వారా పీవోకేలోని ముజఫరాబాద్‌లో మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తర్వాత నుంచి అతని జాడ లేదు. త్వరలో మసూద్‌పై పాక్ చర్యలు భారత్‌తో ఉద్రిక్తతలను తగ్గించడం కోసం మసూద్‌పై చర్యలు తీసుకునేందుకు పాకిస్తాన్ నిర్ణయించిందని ఆ దేశ ప్రభుత్వంలోని ఓ ఉన్నతాధికారి చెప్పారు. మరోవైపు మసూద్‌పై ఐక్యరాజ్య సమితి ‘ప్రపంచ ఉగ్రవాది’ అని ముద్ర వేసే విషయంలో తరచూ అడ్డు చెబుతున్న పాక్.. ఈసారి అందుకు వ్యతిరేకత తెలపకపోవచ్చని ఆ దేశంలోని ఓ మీడియా సంస్థ పేర్కొంది. భారత్, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ తదితర దేశాలు మసూద్ అజార్‌పై ఐరాస చేత ఉగ్రవాదిగా ముద్ర వేయించేందుకు ప్రయత్నిస్తున్నా ఇన్నాళ్లూ చైనా అడ్డుతగులుతుండటం తెలిసిందే. మసూద్ స్థాపించిన జైషే మహ్మద్‌ను ఐక్యరాజ్య సమితి ఇప్పటికే నిషేధించింది. మసూద్‌పై కూడా ఉగ్రవాదిగా ముద్ర వేయించేందుకు మరోసారి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లు భద్రతా మండలిలో గత బుధవారం ప్రతిపాదించాయి. -
మరో ‘పుల్వామా’ తప్పింది!
శ్రీనగర్: పుల్వామాలో ఫిబ్రవరి 14న సీర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఆత్మాహుతిదాడికి పాల్పడ్డ జైషే ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దార్ 40 మంది జవాన్లను బలికొన్న సంగతి తెలిసిందే. అయితే ఇదే తరహాలో ఆత్మాహుతి దాడి చేసేందుకు ఓ ఉగ్రవాది సిద్ధమైనట్లు పోలీసులు తెలిపారు. జైషే మొహమ్మద్ ఉగ్రసంస్థకు చెందిన రకీబ్ అహ్మద్ భద్రతాబలగాలపై ఆత్మాహుతి దాడి చేయాలని ప్రణాళిక రచించినట్లు వెల్లడించారు. కానీ కుల్గామ్‌లోని తురిగామ్‌లో 24న జరిగిన ఎన్కౌంటర్లో రకీబ్ సహా ముగ్గురు జైషే ఉగ్రవాదులు హతమయ్యారు. ‘మీరు ఈ వీడియోను చూసేలోగా నేను స్వర్గంలో ఉంటాను’ అని రకీబ్ మాట్లాడిన వీడియో శనివారం సోషల్‌మీడియాలో షేరింగ్ అవుతోంది. ఏ రకంగా ఆత్మాహుతిదాడి చేయబోతున్నానో వీడియోలో రకీబ్ చెప్పాడు. ఆదిల్ దార్, రకీబ్‌లకు సంబంధించిన వీడియోల మధ్య సారూప్యత ఉందన్నారు. భారత్ కాల్పుల్లో నలుగురు దుర్మరణం ఇస్లామాబాద్: నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంట భారత బలగాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు సైనికులు, ఇద్దరు పౌరులు చనిపోయారని పాకిస్తాన్ ఆర్మీ ఆరోపించింది. నైకాల్ సెక్టార్లో పాక్ ఆర్మీ పోస్టులు లక్ష్యంగా భారత బలగాలు కాల్పులు జరిపాయని తెలిపింది. -
అభి మీసం
న్యూఢిల్లీ: పాకిస్తాన్ నుంచి తిరిగొచ్చిన వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ మీసాలకు ఇప్పుడు బాగా ప్రాచుర్యం ఏర్పడింది. అదొక ‘అభినందన్ బ్రాండ్’గా, భూషణంగా మారిపోయింది. దేశంలోని అనేక మంది యువకులు ఆ తరహా గడ్డం, మీసాలను ఇష్టపడుతున్నారు. తాము కూడా ఆయనలా మీసకట్టు పెంచుతామని అంటున్నారు. అభినందన్ గడ్డం, మీసాల స్టైల్‌పై సామాజిక మాధ్యమాల్లో జోరుగా వ్యాఖ్యలు, చర్చలు నడుస్తున్నాయి. అభినందన్ నడుపుతున్న మిగ్–21 విమానం పాకిస్తాన్ భూభాగంలో కూలిపోవడం, ఆయనను ఆ దేశ ఆర్మీ తొలుత బంధించి అనంతరం శుక్రవారం భారత్‌కు అప్పగించడం తెలిసిందే. పాకిస్తాన్లో ఉన్న అభినందన్ తన క్షేమ వివరాలు చెబుతున్న వీడియో గత బుధవారం బయటకొచ్చినప్పటి నుంచి ఆయనకు దేశంలో క్రేజ్ పెరిగిపోయింది. అభినందన్ గురించి, పాకిస్తాన్లో ఆయన ప్రదర్శించిన ధైర్య సాహసాల గురించి ఒక్కో వివరం బయటకొచ్చే కొద్దీ అందరిలో ఆసక్తి ఎక్కువైంది. ఆయన తెగువను మెచ్చిన భారత ప్రజలు ఇప్పుడు ఆయన ‘తమిళ’ స్టైల్‌ను అనుసరించాలనుకుంటున్నారు. ట్విట్టర్లో ఓ వ్యక్తి ఓ పోస్ట్ చేస్తూ ‘అభినందన్‌కు ఉన్నటువంటి మీసాలు నాకూ కావాలి. జయహో’ అని పేర్కొన్నారు. ‘మొత్తం భారత దేశంలో తర్వాతి స్టైల్ సంచలనంగా అభినందన్ మీసాలు ఉండబోతున్నాయి. ఈసారి మీరు క్షౌ ర శాలకు వెళ్లినప్పుడు అక్కడి వ్యక్తి మిమ్మల్ని అభినందన్ స్టైల్ కావాలా? అని అడిగితే ఆశ్చర్యపోకండి’ అని మరొకరు ట్విట్టర్లో రాశారు. ముందుగా గుర్తొచ్చేది మీసాలే.. అభినందన్‌ను ఎవరైనా గుర్తుపట్టేది ముందుగా ఆయన మీసాలతోనేనని బ్రాండ్ వ్యూహకర్త రమేశ్ తహిలియాని అంటున్నారు. ‘దేశభక్తి, ఇతర ఉద్రేకాలు ప్రస్తుతం ప్రజల్లో చాలా ఎక్కువగా ఉన్నాయి. టీవీ, ఇంటర్నెట్ల్లో అభినందన్‌ను చూసిన వారిని మీరు అడగండి. ఆయనను తలచుకుంటే మీకు ముందుగా గుర్తొచ్చేది ఏంటి అంటే అత్యధిక శాతం మంది ఆయన గడ్డం, మీసాలేనంటారు. ఆయన చూపిన ధైర్య సాహసాలే ఇప్పుడు ఆ స్టైల్‌ను సూపర్ బ్రాండ్‌గా మార్చాయి. అయితే ప్రస్తుతానికి అయితే ఇదంతా తాత్కాలిక హాంగామానేననీ, ఆయన స్టైల్ ఇకపై ఫ్యాషన్‌గా మారుతుందా, లేదా అనే విషయాన్ని కాలమే చెబుతుందని తహిలియాని పేర్కొన్నారు. మరో బ్రాండ్ నిపుణుడు మాట్లాడుతూ ‘అభినందన్ మీసాలు ఆయన చెక్కిళ్లపైకి వ్యాపించి ఉంటాయి. ఆకాశంలో ఎంతో నైపుణ్యంతో విమానం విన్యాసాలు చేసిన గుర్తుల్లా అది ఉంటుంది. ఆ స్టైల్‌ను ఇప్పుడు ఎంతోమంది కావాలనుకుంటున్నారు’ అని అన్నారు. -
ప్రియాంక..నీవు జియో సిమ్ అప్లై చేశావా?
న్యూఢిల్లీ : బంఫర్ ఆఫర్లతో స్మార్ట్‌ఫోన్ యూజర్ల ముందుకు వచ్చిన రిలయన్స్ జియో సిమ్కోసం బారులు తీరుతున్న జనాన్ని ఓ వైపు చూస్తుండగానే.. మరోవైపు ఓ టాప్ బాలీవుడ్ భామ జియో సిమ్ అప్లికేషన్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ప్రియాంక చోప్రా జియో సిమ్ కోసం అప్లై చేసిన మాదిరిగా అచ్చం ఆమె ఫోటోతోనే ఓ దరఖాస్తు ఫామ్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ దరఖాస్తు ఫామ్‌లో అన్ని వివరాలు ఈ అందాల తారవే ఉండగా.. సంతకం మాత్రం భిన్నంగా ఉందట. సిమ్ అప్లై చేసిన ప్రతి దరఖాస్తుదారుని వివరాలు గోప్యంగా ఉంటాయి. కానీ ఓ నటీమణికి సంబంధించిన వివరాలే ఇంటర్నెట్లో బ్రేకింగ్‌లా అందుబాటులోకి రావడంతో దానిలో నిజమెంతో ఉందో తెలియక విశ్వసనీయతపై ప్రశ్నలు సంధిస్తున్నారు ఆమె ఫ్యాన్స్. "ప్రియాంకా.. నీవు జియో సిమ్ కోసం అప్లై చేశావా" అంటూ ట్వీట్ చేస్తున్నారట. మొదట ఆ ఫోటోతో కూడిన అప్లికేషన్ పాపులర్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో చక్కర్లు కొట్టిందట. టారిఫ్‌లపై బంపర్ ఆఫర్లు ప్రకటిస్తూ జియో ప్లాన్‌ను వివరించిన ముకేశ్ అంబానీని ప్రియాంక చోప్రా కొనియాడిన సంగతి తెలిసిందే. డిజిటల్ ఇండియాలో జియో విజన్ కచ్చితంగా నెరవేరాలని ఆశిస్తున్నట్టు నీతాకు, ముకేశ్‌కు, జియో టీమ్‌కు ప్రియాంక అభినందనలు తెలిపారు. ప్రియాంకతో పాటు రిలయన్స్ జియో లాంచింగ్‌పై అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్ కూడా ట్వీట్ చేశారు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఈ అప్లికేషన్ ఫామ్‌తో ప్రియాంక నిజంగా జియో సిమ్‌కు అప్లై చేసిందా లేదా అది తప్పుడు అప్లికేషన్ ఫామా అనేది చర్చనీయాంశంగా మారింది.