గుజరాత్‌లోని మణినగర్‌లో అభి మీసాలతో సంబరాలు చేసుకున్న విద్యార్థులు
న్యూఢిల్లీ: పాకిస్తాన్ నుంచి తిరిగొచ్చిన వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ మీసాలకు ఇప్పుడు బాగా ప్రాచుర్యం ఏర్పడింది. అదొక ‘అభినందన్ బ్రాండ్’గా, భూషణంగా మారిపోయింది. దేశంలోని అనేక మంది యువకులు ఆ తరహా గడ్డం, మీసాలను ఇష్టపడుతున్నారు. తాము కూడా ఆయనలా మీసకట్టు పెంచుతామని అంటున్నారు. అభినందన్ గడ్డం, మీసాల స్టైల్‌పై సామాజిక మాధ్యమాల్లో జోరుగా వ్యాఖ్యలు, చర్చలు నడుస్తున్నాయి.
అభినందన్ నడుపుతున్న మిగ్–21 విమానం పాకిస్తాన్ భూభాగంలో కూలిపోవడం, ఆయనను ఆ దేశ ఆర్మీ తొలుత బంధించి అనంతరం శుక్రవారం భారత్‌కు అప్పగించడం తెలిసిందే. పాకిస్తాన్‌లో ఉన్న అభినందన్ తన క్షేమ వివరాలు చెబుతున్న వీడియో గత బుధవారం బయటకొచ్చినప్పటి నుంచి ఆయనకు దేశంలో క్రేజ్ పెరిగిపోయింది. అభినందన్ గురించి, పాకిస్తాన్‌లో ఆయన ప్రదర్శించిన ధైర్య సాహసాల గురించి ఒక్కో వివరం బయటకొచ్చే కొద్దీ అందరిలో ఆసక్తి ఎక్కువైంది.
ఆయన తెగువను మెచ్చిన భారత ప్రజలు ఇప్పుడు ఆయన ‘తమిళ’ స్టైల్‌ను అనుసరించాలనుకుంటున్నారు. ట్విట్టర్‌లో ఓ వ్యక్తి ఓ పోస్ట్ చేస్తూ ‘అభినందన్‌కు ఉన్నటువంటి మీసాలు నాకూ కావాలి. జయహో’ అని పేర్కొన్నారు. ‘మొత్తం భారత దేశంలో తర్వాతి స్టైల్ సంచలనంగా అభినందన్ మీసాలు ఉండబోతున్నాయి. ఈసారి మీరు క్షౌ ర శాలకు వెళ్లినప్పుడు అక్కడి వ్యక్తి మిమ్మల్ని అభినందన్ స్టైల్ కావాలా? అని అడిగితే ఆశ్చర్యపోకండి’ అని మరొకరు ట్విట్టర్‌లో రాశారు.
ముందుగా గుర్తొచ్చేది మీసాలే..
అభినందన్‌ను ఎవరైనా గుర్తుపట్టేది ముందుగా ఆయన మీసాలతోనేనని బ్రాండ్ వ్యూహకర్త రమేశ్ తహిలియాని అంటున్నారు. ‘దేశభక్తి, ఇతర ఉద్రేకాలు ప్రస్తుతం ప్రజల్లో చాలా ఎక్కువగా ఉన్నాయి. టీవీ, ఇంటర్నెట్‌ల్లో అభినందన్‌ను చూసిన వారిని మీరు అడగండి. ఆయనను తలచుకుంటే మీకు ముందుగా గుర్తొచ్చేది ఏంటి అంటే అత్యధిక శాతం మంది ఆయన గడ్డం, మీసాలేనంటారు. ఆయన చూపిన ధైర్య సాహసాలే ఇప్పుడు ఆ స్టైల్‌ను సూపర్ బ్రాండ్‌గా మార్చాయి.
అయితే ప్రస్తుతానికి అయితే ఇదంతా తాత్కాలిక హాంగామానేననీ, ఆయన స్టైల్ ఇకపై ఫ్యాషన్‌గా మారుతుందా, లేదా అనే విషయాన్ని కాలమే చెబుతుందని తహిలియాని పేర్కొన్నారు. మరో బ్రాండ్ నిపుణుడు మాట్లాడుతూ ‘అభినందన్ మీసాలు ఆయన చెక్కిళ్లపైకి వ్యాపించి ఉంటాయి. ఆకాశంలో ఎంతో నైపుణ్యంతో విమానం విన్యాసాలు చేసిన గుర్తుల్లా అది ఉంటుంది. ఆ స్టైల్‌ను ఇప్పుడు ఎంతోమంది కావాలనుకుంటున్నారు’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment