వైరల్ అయిన క్వశ్చన్ పేపర్
సాక్షి, బెంగుళూరు: క్వశ్చన్ పేపర్ కొత్తగా ట్రై చేద్దామనుకున్నాడో టీచర్..! కానీ అది కాస్తా బెడిసి కొట్టింది. దీంతో అయ్యగారి ఉద్యోగమే ఊడింది. రాజరాజేశ్వరి నగర్‌లోని మౌంట్ కార్మెల్ ఇంగ్లీష్ హైస్కూల్‌లో తయారు చేసిన 8వ తరగతి ప్రశ్నాపత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వినటానికి తమాషాగా అనిపించినా, అసలే ఎన్నికల సమయం కావటంతో విమర్శలకు దారితీసింది. ఇంతలా తిప్పలు పెట్టిన ప్రశ్న ఏంటంటే... రైతు మిత్రులు ఎవరు? అన్న ప్రశ్నకు ...సమాధానంగా ఇచ్చిన ఆప్షన్లు చూస్తే అవాక్కవ్వాల్సిందే.
ఎ. కుమారస్వామి బి. వానపాములు సి. యడ్యూర్పప్ప... ఆప్షన్లను చూసి ఒక్కసారిగా బిత్తరపోయిన విద్యార్థులు ఆ తర్వాత తేరుకొని తడుముకోకుండా సమాధానాన్ని ఎంచుకున్నారు. బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్పను, రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామిని కాదని విద్యార్థులు... రైతు మిత్రులుగా వానపాములకే ఓటేశారు. ఈ ప్రశ్నాపత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో స్కూల్ యాజమాన్యం సదరు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకుంది. నిర్లక్ష్యంగా ప్రశ్నాపత్రాన్ని తయారు చేసిన టీచర్‌ను విధుల నుంచి తొలగించింది. అంతేకాకుండా తాము ఏ పార్టీకి మద్దతు ఇవ్వలేదని సంజాయిషీ ఇచ్చుకుంది.
Comments
Please login to add a commentAdd a comment