Nalla connections
-
పానీ చోర్.. పారాహుషార్
సాక్షి, సిటీబ్యూరో: అక్రమ నల్లాలపై జలమండలి విస్తృత తనిఖీలు నిర్వహిస్తోంది. ప్రధాన నగరంతో పాటు శివార్లలోనూ బోర్డు విజిలెన్స్ పోలీసుల ఆధ్వర్యంలో అక్రమార్కులను జల్లెడ పడుతున్నారు. ఏళ్లుగా క్షేత్రస్థాయి సిబ్బంది సహకారంతో పలువురు నల్లాలను అక్రమంగా ఏర్పాటు చేసుకున్న వైనంపై లోతుగా ఆరా తీస్తున్నారు. తీగ లాగితే డొంక కదులుతున్న చందంగా ఈ అక్రమాల బాగోతం ఒక్కొక్కటిగా వెలుగుచూస్తోంది. ఇటీవల నగర శివార్లలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో.. అయిదు అక్రమ నల్లాల ఏర్పాటుకు సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ క్షేత్రస్థాయి ఉద్యోగిపైనా క్రిమినల్ కేసులు నమోదు చేయడం గమనార్హం. ఒక్కొక్కటిగా వెలుగులోకి.. ►మహానగర పరిధిలో జలమండలికి 10.80 ల క్షల నల్లా కనెక్షన్లున్నాయి. వీటిలో సుమారు 8 లక్షల వరకు గృహ వినియోగ(డొమెస్టిక్), మరో 2 లక్షల వరకు మురికి వాడలు (స్లమ్స్), మరో 80 వేల వరకు వాణిజ్య, బల్క్ నల్లా కనెక్షన్లున్నాయి. ఇవి కాక సుమారు లక్ష వరకు అక్రమ నల్లాలున్నట్లు అంచనా. ►పాత నగరం, ప్రధాన నగరం, శివారు ప్రాంతాలు అనే తేడా లేకుండా ఈ అక్రమ నల్లాలు విస్తరించి ఉన్నాయి. ఇటీవల ప్రభుత్వం నెలకు 20 వేల లీటర్ల ఉచిత తాగునీటి పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం విదితమే. ఈ పథకాన్ని దుర్వినియోగం కాకుండా చూసేందుకు జలమండలి అక్రమ నల్లాల భరతం పట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఇటీవల తనిఖీలను ముమ్మరం చేయడంతో అక్రమార్కుల బండారం బయటపడుతోంది. ►అక్రమ నల్లాలపై జలమండలి నజర్ ►శివార్లు, నగరంలో విస్తృత తనిఖీలు ►‘ఇంటి దొంగల’పైనా కేసులు నమోదు ►గ్రేటర్ పరిధిలో లక్ష వరకు అక్రమ నల్లాలు కంచే చేను మేసిన చందంగా.. ►జలమండలి పరిధిలో క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న సిబ్బంది సహకారంతో పలువురు ఈ అక్రమ నల్లాలను ఏర్పాటు చేసుకున్నారన్నది బహిరంగ రహస్యమే. భూమి లోపలున్న జలమండలి మంచినీటి పైపులైన్లకు అర్ధరాత్రి వేళ ఎవరికీ తెలియకుండా కన్నాలు వేసి వీటిని ఏర్పాటు చేసుకుంటున్నారు. ►ఈ వ్యవహారంలో బోర్డు సిబ్బంది, ప్రైవేటు ప్లంబర్లు, జలమండలి నల్లా కనెక్షన్లు మంజూరు చేసే గ్రీన్‌బ్రిగేడ్ సిబ్బంది పాత్ర సుస్పష్టం. ఏళ్లుగా బదిలీలు లేకుండా పనిచేస్తున్న సిబ్బంది కీలక పాత్రధారులుగా ఉంటున్నారు. విజిలెన్స్ పోలీసుల తనిఖీల్లో అక్రమ నల్లాలు బయటపడిన తర్వాత సదరు భవనాల యజమానులు, ఇందుకు సహకరించిన బోర్డు సిబ్బందిపైనా ఐపీసీ 269,430 సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు. సమాచారం అందించండి.. అక్రమ నల్లాలపై ఎలాంటి సమాచారాన్నైనా తమకు అందించాలని జలమండలి నగరవాసులకు విజ్ఞప్తి చేసింది. గృహ వినియోగ నల్లా కనెక్షన్ తీసుకొని కమర్షియల్ అవసరాలకు వినియోగిస్తున్న వారిపైనా 99899 98100, 99899 92268 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరింది. ఉచిత తాగునీటి పథకం పక్కదారి పట్టకుండా ఉండాలంటే అక్రమ నల్లాల అంతు చూడాలని జలమండలి భావిస్తోంది. ఈ దిశగా ముందుకు వెళుతోంది. అక్రమార్కులపై క్రిమినల్ కేసులను ముమ్మరం చేసింది. -
రూ. 100 కే నల్లా కనెక్షన్
సాక్షి, హైదరాబాద్: పట్టణ ప్రాంతాల్లో నల్లా కనెక్షన్లు పొందేందుకు చెల్లించే డిపాజిట్లను ప్రభుత్వం భారీగా తగ్గించింది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో ఏపీఎల్ కుటుంబాలకు (దారిద్య్రరేఖకు ఎగువనున్న వారు) వంద రూపాయలకే నల్లా కనెక్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు గురువారం సంతకం చేశారు. ఇప్పటికే బీపీఎల్ కుటుంబాలకు (దారిద్య్రరేఖకు దిగువనున్న వారు) ప్రభుత్వం రూపాయికే నల్లా కనెక్షన్ ఇస్తుండగా దాన్ని యథావిధిగా కొనసాగించనుంది. ఇతరులు పట్టణ ప్రాంతాల్లో నల్లా కనెక్షన్ పొందేందుకు ఇప్పటివరకు రూ. 6,000 డిపాజిట్ తీసుకుంటుండగా ఇంటి లోపల నల్లా పెట్టుకోవడానికి ప్రస్తుతం రూ. 10,500 డిపాజిట్ తీసుకుంటున్నారు. ఇంత పెద్ద మొత్తంలో డిపాజిట్ రుసుము ఉండటం వల్ల పట్టణ ప్రాంతాల్లో మంచినీటి కనెక్షన్ తీసుకోవడానికి ప్రజలు ముందుకు రావడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ భావించారు. ‘మిషన్ భగీరథతో అన్ని గ్రామాలకు, పట్టణాలకు, నగరాలకు సురక్షిత మంచినీరు అందివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. నల్లా ద్వారా మంచినీరు పొందే హక్కును ప్రభుత్వం ప్రజలకు కల్పిస్తోంది. అందరూ నల్లా కనెక్షన్ పొందాలంటే డిపాజిట్‌ను నామమాత్రం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే నల్లా కనెక్షన్ డిపాజిట్‌ను తగ్గిస్తున్నాం. ప్రజలంతా ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని మిషన్ భగీరథతో అందే శుద్దిచేసిన నీటిని తాగాలని కోరుకుంటున్నాను. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 7.9 లక్షల ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు కేవలం 1.20 లక్షల ఇళ్లకు మాత్రమే కనెక్షన్లు ఇచ్చారు. డిపాజిట్ ఎక్కువగా ఉన్నందున మిగతా ఇంటి యజమానులు ముందుకు రావడంలేదు. దీంతో 6.7 లక్షల ఇళ్లకు నల్లా కనెక్షన్ లభించలేదు. వీటికితోడు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మంచినీటి పథకాల ద్వారా మరో 3.3 లక్షల మందికి నల్లా కనెక్షన్ అందాల్సి ఉంది. అంతా కలిపి పట్టణ ప్రాంతాల్లో 10 లక్షల ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇవ్వాలి. డిపాజిట్ ఎక్కువ ఉన్నందున వీరు నల్లా కనెక్షన్ తీసుకునేందుకు ముందుకొచ్చే పరిస్థితి కనిపించట్లేదు. దీనివల్ల ప్రజలందరికీ మిషన్ భగీరథ ద్వారా సురక్షితమైన మంచినీరు తాగించాలనే లక్ష్యం నెరవేరదు. అందుకే ఆర్థికంగా భారమైనప్పటికీ మంచినీటి నల్లా కనెక్షన్ కోసం చెల్లించాల్సిన డిపాజిట్‌ను నామమాత్రం చేయాలని నిర్ణయించాం. ప్రజలందరూ శుద్ధి చేసిన మంచినీరు తాగి ఆరోగ్యంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం’అని సీఎం కేసీఆర్ అన్నారు. -
అప్పుడే తేలిపోయింది
ములుగు: మేడారం జాతరలో ఆర్డబ్ల్యూఎస్ శాఖ తరుపున ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు, నల్లాల పనితీరు తేలిపోయింది. రూ. కోట్లు వెచ్చించి భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన పనులు మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయాయి. వాస్తవానికి సమ్మక్క–సారలమ్మ వన ప్రవేశం చేయడంతో జాతర ముగిసినప్పటికీ, సంప్రదాయం ప్రకారం మరో వారంపాటు తిరుగు వారం పేరుతో వేలాది మంది అమ్మలను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. శనివారం అమ్మలు వన ప్రవే శం చేసినా.. ఆదివారం భక్తులు వేలాదిగా తరలివచ్చా రు. పలు ప్రాంతాల్లో మరుగుదొడ్ల, మంచినీటి నల్లాలు అం దుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డోర్లు లేవు.. నీళ్లు రావు.. మహా జాతరను పురస్కరించుకుని ఆర్డబ్ల్యూఎస్ శాఖ తరుపున ఈసారి 10 వేల మరుగుదొడ్లను నిర్మించారు. ఇందులో సుమారు 6 వేల మరుగుదొడ్లను ప్రధానంగా చిలుకలగుట్ట, జంపన్న వాగు స్నానఘట్టాలు, పడిగాపురం, రెడ్డిగూడెం, ఊరట్టం, కన్నెపల్లి, ఆర్టీసీ బస్ పాయింట్, కొంగల మడుగు, నార్లాపురం, చింతల్‌క్రాస్‌తో పాటు పార్కింగ్ ప్రాంతాల్లో నిర్మించారు. వాటికి నీటి సరఫరా విషయంలో మొదట్లో తడబడిన అధికారులు జాతర ముగింపు సమయంలో తేరుకుని భక్తుల అవసరాలకు అనుగణంగా అందించడంతో సఫలీ కతమయ్యారు. కాని, శనివారం రాత్రి నుంచి మరుగుదొడ్ల తీ రు అధ్వానంగా మారింది. అత్యవసరానికి మరుగుదొడ్ల వైపు పరుగులు తీసిన భక్తులకు నిరాశను కల్పించిం ది. ఏర్పాటు చేసిన మరుగుదొడ్ల ద్వారాలు, బేషన్లు పూర్తిగా ధ్వంసమై ఉం డడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా జాతర పరిసరాల్లో మహిళాలు తంటాలు పడ్డా రు. జంపన్న వాగు పక్కన సింగరేణి ఆధ్వర్యంలో నిర్మించిన మరుగుదొడ్లు, శాశ్వ త ప్రాదిపదికన నిర్మించిన సులభ్ కాం పెక్స్‌లను ఆశ్రయిం చారు. మరుగుదొడ్ల సంగతి ఇలా ఉండగా.. వంటలు, ఇతర అవసరాల కోసం అధికారులు ఏర్పా టు చేసిన నల్లాలు అలంకార ప్రాయంగానే మారాయి. నల్లా ల నుంచి నీటి సరఫరా లేకపోవడంతో తంటాలు పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో నల్లాలు నేలకొరిగి కనిపించాయి. మొత్తానికి జాతర జరిగిన నాలుగు రోజులు మాత్రమే పనికి వచ్చే విధంగా సౌకర్యాలు ఏర్పాటు చేశారని భక్తులు వాపోయారు. -
ప్రతి నల్లాకు మీటరు తప్పనిసరి
గ్రేటర్లో ఆగస్టు ఒకటి నుంచి ప్రత్యేక డ్రైవ్: మంత్రి కేటీఆర్ - భోలక్పూర్లాంటి ఘటనలు పునరావృతం కానివ్వం.. - ప్రభుత్వ పరిశీలనలో నీటి చార్జీల పెంపు - జలమండలిలో బోర్డు కార్యకలాపాలపై సుదీర్ఘ సమీక్ష సాక్షి, హైదరాబాద్ : ‘సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం గ్రేటర్లో 21 లక్షల నివాసాలున్నాయి. కానీ నల్లా కనెక్షన్లు 8.70 లక్షలు మాత్రమే. వీటిలో మీటర్లున్నవి 1.6 లక్షలే. నల్లాల సంఖ్య గణనీయంగా పెరగాలి. అదేసమయంలో వేలాదిగా ఉన్న అక్రమ నల్లాలను క్రమబద్ధీకరించాల్సి ఉంది. ప్రతి నల్లాకు మీటరు తప్పనిసరి చేసేందుకు ఆగస్టు ఒకటి నుంచి నగర వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తాం’ అని మున్సిపల్ మంత్రి కె.తారకరామారావు చెప్పారు. శనివారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో వాటర్‌బోర్డు కార్యకలాపాలపై మంత్రి సుదీర్ఘ సమీక్ష జరిపారు. జలమండలి ఎండీ దానకిశోర్, డెరైక్టర్లు సత్యనారాయణ, రామేశ్వర్రావు, శ్రీధర్‌బాబు, ఎల్లాస్వామి, సూర్యనారాయణ, కృష్ణ పాల్గొన్నారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... 40 శాతం బిల్లులు రావడంలేదు... జలమండలి పరిధిలో ప్రస్తుతం వంద లీటర్ల నీటిని సరఫరా చేస్తే 60 లీటర్లకే బిల్లు వసూలవుతోంది. 40 శాతం మేర బిల్లులు రావడంలేదు. బోర్డులో అంతర్గత లోపాలను సరిచేసుకొని వంద శాతం రెవెన్యూ సాధించడంపై తొలుత దృష్టి సారిస్తాం. సమీప భవిష్యత్‌లో నీటి చార్జీలు తప్పకుండా పెంచుతాం. ఈ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. భోలక్‌పూర్ కలుషిత జలాల ఘటనలను పునరావృతం కానివ్వం. నగరంలో జలమండలి సరఫరా చేస్తున్న నీటి నాణ్యత విషయంలో రాజీలేదు. ఇటీవల చిలకలగూడా రైల్వే క్వార్టర్స్‌లో బల్క్ సప్లై ట్యాంకులో రైల్వే అధికారులు క్లోరినేషన్ చేయకపోవడం వల్లే కలుషిత జలాల సమస్య ఉత్పన్నమైంది. నాణ్యతలేని నీటిని ప్రజలకు సరఫరా చేస్తే బల్క్ సప్లైదారులపై చర్యలు తీసుకొంటాం. భూగర్భజలాల పెంపునకు ‘జలభాగ్యం’ గ్రేటర్ పరిధిలో అడుగంటిన భూగర్భ జలాలను పెంచేందుకు హరితహారం స్ఫూర్తితో ‘జలభాగ్యం’ కార్యక్రమానికి త్వరలో శ్రీకారం చుడతాం. బోర్డులోని ప్రాజెక్టు, నిర్వహణ, రెవెన్యూ, సింగిల్‌విండో వంటి విభాగాల్లో పారదర్శక సేవలకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసీజర్ని ప్రవేశపెడతాం. జలమండలిలో పనిచేస్తున్న 4వేల మంది ఉద్యోగులు తమ ఫీడ్‌బ్యాక్ ఇచ్చేందుకు ఇన్నోవేషన్ టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తాం. ఫైరింజన్లకు నీటి కొరత లేకుండా ప్రత్యేక నీటి ఫిల్లింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. నవంబరు 1న వాట ర్బోర్డు వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తాం. గడిచిన వేసవిలో విపత్కర పరిస్థితుల్లోనూ నగరానికి నీటి కొరత లేకుండా చూసిన బోర్డు ఉద్యోగులకు అభినందనలు. మ్యాన్‌హోళ్లకు జియోట్యాగింగ్ గ్రేటర్ పరిధిలో అధికారిక లెక్కల ప్రకారం ప్రస్తుతం ఉన్న మ్యాన్‌హోళ్లు 2.75 లక్షలు. కానీ ఈ సంఖ్య 4 లక్షలు ఉంటుందని నా అంచనా. మ్యాన్‌హోళ్ల లెక్క తేల్చేందుకు నగరవ్యాప్తంగా ప్రత్యేక సర్వే నిర్వహించి జియోట్యాగింగ్ ద్వారా వీటిని అనుసంధానిస్తాం. సీవరేజి కార్మికులు మ్యాన్‌హోళ్లలో దిగి ప్రాణాలు కోల్పోకుండా ఎయిర్‌టెక్ యంత్రాలతోనే మురుగు సమస్యలను పరిష్కరి స్తాం. ప్రమాదవశాత్తు మరణించిన సీవరేజి కార్మికులకు ప్రస్తుతం ఉన్న రెండు లక్షల రూపాయల పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచుతాం. నీటి వేళలపై ఎస్ఎంఎస్ సందేశం నీటి సరఫరా వేళలపై వినియోగదారులకు సంక్షిప్త సందేశం అందించేందుకు లైన్మెన్లకు స్మార్ట్ఫోన్లు అందజేస్తాం. కూకట్పల్లి డివిజన్లో అమలు చేస్తున్న ఈ విధానాన్ని త్వరలో గ్రేటర్ వ్యాప్తంగా అమలు చేస్తాం. -
ఇంటింటికీ నల్లా.. అంత ఈజీ కాదు!
గ్రేటర్లో నివాస సముదాయాలు 23 లక్షలు.. నల్లా కనెక్షన్లు 8.65 లక్షలే... రాబోయే మూడేళ్లలో ఇంటింటికీ నల్లాల ఏర్పాటుకు నిధులు, నీళ్లే కీలకం సర్కారు ముందు పెద్ద సవాల్ నగరంలో చుక్క నీటి కోసం అష్టకష్టాలు పడుతున్న కాలనీలెన్నో. బస్తీలు, మురికి వాడల్లోనైతే పరిస్థితి మరీ దుర్భరం. నీటి కోసం రాత్రింబవళ్లు ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ప్రభుత్వం ఇటీవల భరోసా ఇచ్చింది. వచ్చే మూడేళ్లలో ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇవ్వడమే ధ్యేయమని ప్రకటించింది. అయితే..అసలు మూడేళ్లలో నగరంలో ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ సాధ్యమేనా అన్న ప్రశ్న తలెత్తుతోంది. గ్రేటర్ పరిధిలో 23 లక్షల నివాస సముదాయాలుంటే...8 లక్షల 65 వేల నల్లా కనెక్షన్లే ఉన్నాయి. అంటే ఇంకా 14 లక్షలకు పైన నల్లా కనెక్షన్లు అవసరముంది. ఈ లెక్కన మూడేళ్లలో ఇంత పెద్ద సంఖ్యలో నల్లాలివ్వడం సాధ్యమా...సాధ్యమైనా నీళ్లు ఎక్కడి నుంచి తెస్తారు..నిధులెలా సమకూరుస్తారనేది తెలియకుండా ఉంది. -సాక్షి, సిటీబ్యూరో సిటీబ్యూరో: గ్రేటర్ నగరం శరవేగంగా విస్తరిస్తోంది. నివాస సముదాయాలూ అంతకంతకూ పెరుగుతూనే ఉన్నా యి. ప్రస్తుతం నగర విస్తీర్ణం 625 చదరపు కిలోమీటర్లు. ఈ పరిధిలో సుమారు 23 లక్షల నివాసాలున్నాయి. కానీ నల్లా కనెక్షన్లున్నవి 8.64 లక్షలు మాత్రమే. ఈ పరిస్థితి నేపథ్యంలో రాష్ట్ర సర్కారు పెద్దలు ప్రకటించిన ఇంటింటికీ నల్లా స్వప్నం సాకారమయ్యేందుకు ఎంతో సమయం పట్టనుందని స్పష్టమవుతోంది. ప్రస్తుతం సింగూరు, మంజీరా జలాశయాల నుంచి నగరానికి నీటిసరఫరా పూర్తిగా నిలిచి పోయింది. జంటజలాశయాలు గండిపేట్, హిమాయత్సాగర్లలోనూ నీటినిల్వలు క్రమంగా నిండుకుంటున్నా యి. ప్రస్తుతం కృష్ణా మూడు దశలు, గోదావరి మంచినీటి పథకం మొదటి దశలే మహానగర దాహార్తిని తీరుస్తున్నాయి. ఈ రెండు జలాశయాలపైనే రోజురోజుకూ ఒత్తిడి పెరుగుతోం ది. మరోవైపు జీహెచ్ఎంసీ పరిధిలో వెయ్యికిపైగా కాలనీలు, ఔటర్‌రింగ్‌రోడ్డుకు లోపలున్న 164 పంచాయతీల పరిధిలో ఇంటింటికీ నీటిని అందించేందుకు అవసరమైన నీటిసరఫరా పైపులైన్లు, స్టోరేజి రిజర్వాయర్లు అందుబాటులో లేవు. దీంతో శివారు ప్రాంతాల వాసులు తాగడానికి, ఇతరత్రా అవసరాలకు బోరుబావులు, ప్రైవేటు ఫిల్టర్‌ప్లాంట్లు, ట్యాంకర్ నీళ్లను ఆశ్రయించక తప్పని పరిస్థితి నెలకొంది. ఆయా ప్రాంతాల వాసులు నెలకు నీటిఅవసరాలకే రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థంచేసుకోవచ్చు. పలు శివారు ప్రాంతాల్లో ఇంటి అద్దెలతో సమానంగా ఒక్కో కుటుంబం నీటి కోసమే నెలకు నాలుగు నుంచి ఐదువేలు ఖర్చు చేయాల్సిన దుస్థితి నెలకొంది. నీళ్లు...నిధులేవి..? ప్రస్తుతం నగర జనాభా సుమారు కోటికి చేరువైంది. కానీ నల్లా కనెక్షన్లు 8.64 లక్షలు మాత్రమే. ఇక వీటికి రోజువారీగా 349.360 మిలియన్ గ్యాలన్ల నీటిని జలమండలి అరకొరగా సరఫరా చేస్తోంది. ఇందులో 259.260 ఎంజీడీల జలాలను కృష్ణా మూడోదశ నుంచి,మరో 86 ఎంజీడీలు గోదావరి(ఎల్లంపల్లి)నుంచి, 4.100 ఎంజీడీల జలాలను హిమాయత్‌సాగర్ నుంచి సేకరించి నగరం నలుమూలలకు సరఫరా చేస్తోంది. కానీ రోజువారీగా గృహ, వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు నీటి డిమాండ్ 732 మిలియన్ గ్యాలన్లు అవసరం. అంటే డిమాండ్‌కు, సరఫరాకు అంతరం 382.64 ఎంజీడీలుగా ఉండడం గమనార్హం. ఈ మొత్తంలో నీటిని సేకరించడం జలమండలికి తలకుమించిన భారమవుతోంది. మరోవైపు ఔటర్ రింగురోడ్డుకు లోపలున్న సుమారు 164 గ్రామపంచాయతీల పరిధిలో తాగునీటి సరఫరా వ్యవస్థ ఏర్పాటుకు సుమారు రూ.6 వేల కోట్లు అంచనా వ్యయం కానుంది. ఈస్థాయిలో నిధులు ఎవరు సమకూర్చుతారు అన్నదే ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. ఇంటింటికీ నల్లాలు ఏర్పాటు చేసేందుకు అవసరమైన నీళ్లు, నిధులు లేకపోవడమే ఇప్పుడు సర్కారు ముందు నిలిచిన పెద్ద సవాలు. ఇలా చేస్తేనే పరిష్కారం.... గోదావరి మంచినీటి పథకం ద్వారా తక్షణం 172 ఎంజీడీల జలాలను నగరానికి సరఫరా చేయడంతోపాటు నగర శివార్లలోని మల్కాపురం, శామీర్‌పేట్ ప్రాంతాల్లో రూ.4 వేల కోట్ల అంచనా వ్యయంతో భారీ మంచినీటి స్టోరేజి రిజర్వాయర్లను యుద్ధప్రాతిపదికన నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కృష్ణా, గోదావరి నదుల్లో వరద అధికంగా ఉన్నప్పుడు ఈ జలాశయాలకు నీటిని తరలించి నిల్వచేయాలి. మరోవైపు ఔటర్‌రింగ్ రోడ్డుకు లోపలున్న 164 గ్రామపంచాయతీల పరిధిలో అవసరమైన స్టోరేజి రిజర్వాయర్లు, పైపులైన్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలి. ఇందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం సమకూరిస్తే ‘ఇంటింటికీ నల్లా’ స్వప్నం సాకారమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. -
కొల్లగొట్టారు
జలమండలిలో చేతివాటం నల్లా కనెక్షన్ల జారీలో అక్రమాలు బహుళ అంతస్తుల భవనాలకు డొమెస్టిక్ బిల్లుల జారీతో భారీ నష్టం బోర్డు అంతర్గత సర్వేలో వెలుగుచూసిన భారీ కుంభకోణం సాక్షి, సిటీబ్యూరో: పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన జలమండలిలో భారీ కుంభకోణం వెలుగుచూసింది. నల్లా కనెక్షన్ల విషయంలో ఉద్యోగులు చేతివాటం ప్రదర్శిస్తూ సంస్థ ఆదాయానికి గండికొడుతున్నారు. కమర్షియల్ కాంప్లెక్స్‌లు, అపార్టుమెంట్లకు డొమెస్టిక్ కనెక్షన్ల కింద బిల్లులు జారీ చేస్తుండడంతో ఏటా రూ. 120 కోట్ల మేర ఖజానాకు తూట్లు పడుతోంది. ఇది ఐదేళ్లుగా జరుగుతోందని బోర్డు అంతర్గత సర్వేలో వెలుగుచూసింది. ఇప్పటి వరకూ రూ. 600 కోట్లు గండిపడినట్టు తెలుస్తోంది. సంస్థను సిబ్బందే ముంచేస్తున్న అంశం కలకలం సృష్టిస్తోంది. నగర శివారు ప్రాంతాల్లోని మున్సిపాలిటీల పరిధిలో అక్రమాలు జరగడం గమనార్హం. జలమండలి పరిధిలో 8.25 లక్షల నల్లా కనెక్షన్లు ఉన్నాయి. 2007లో గ్రేటర్లో విలీనమైన మల్కాజ్గిరి, కాప్రా, ఉప్పల్, అల్వాల్, ఎల్బీనగర్, పటాన్చెరువు, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, గడ్డిఅన్నారం, కుత్బుల్లాపూర్ తదితర శివారు మున్సిపాల్టీల పరిధిలో పలు బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్మెంట్లు, హాస్టళ్లు, పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు, వాణిజ్య సముదాయాలు, సినిమా, ఫంక్షన్ హాళ్లు ఉన్నాయి. వీటికి ఎంఎస్ఏసీ (మల్టిస్టోర్డ్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్) విభాగం కింద రూ. 957 బిల్లు జారీ చేయాలి. నీటి వినియోగాన్ని బట్టి బిల్లు మొత్తం రూ. 5 వేల వరకూ ఉంటుంది. వీటికీ గృహ వినియోగ విభాగం కింద రూ. 225 బిల్లును జారీ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న మీటర్ రీడర్లు, మేనేజర్లు, డిప్యూ టీ జనరల్ మేనేజర్లు, జనరల్ మేనేజర్లు భవన నిర్మాణాల యజమానులు, బిల్డర్లతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్నారని తెలిసింది. ఇది 2009 నుంచి జరుగుతోందని జలమండలి రెవెన్వూ విభాగం అంతర్గత సర్వేలో వెల్లడైంది. సుమారు లక్షకుపైగా కనెక్షన్లల్లో అక్రమాలు జరిగినట్టు గుర్తించారు. ఫలితంగా మండలికి ఏటా రూ. 120 కోట్లు చొప్పున ఇప్పటి వరకూ రూ. 600 కోట్ల మేర గండిపడిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. 400 అపార్ట్మెంట్లకు నోటీసులు బోర్డు ఖజానాకు చిల్లుపెడుతున్న వేలాది అపార్ట్మెంట్లలో ఇప్పటివరకు సుమారు 400 అపార్ట్మెం ట్లను, బహుళ అంతస్తుల భవంతులను మల్కాజ్ గిరి, అల్వాల్, కాప్రా మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో గు ర్తించినట్లు బోర్డు రెవెన్యూ విభాగం అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. శివార్లలో ఇలాంటి భవనాలపై సమగ్రంగా సర్వే జరుపుతున్నామన్నారు. త్వరలో నోటీసులు జారీచేయనున్నారు. ఇప్పటి వరకూ జరిగిన నష్టాన్ని పూడ్చుకొనే దిశగా అధికారులు చ ర్యలు తీసుకుంటున్నారు. తొలి దశలో నిర్ణీత మొ త్తంలో ఫీజు వసూలు చేసి కేటగిరీని మార్పు చేస్తారు. ఆ తర్వాత కనెక్షన్లను క్రమబద్ధీకరించనున్నారు.