ప్రతి నల్లాకు మీటరు తప్పనిసరి
గ్రేటర్‌లో ఆగస్టు ఒకటి నుంచి ప్రత్యేక డ్రైవ్: మంత్రి కేటీఆర్
- భోలక్‌పూర్‌లాంటి ఘటనలు పునరావృతం కానివ్వం..
- ప్రభుత్వ పరిశీలనలో నీటి చార్జీల పెంపు
- జలమండలిలో బోర్డు కార్యకలాపాలపై సుదీర్ఘ సమీక్ష
సాక్షి, హైదరాబాద్ : ‘సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం గ్రేటర్‌లో 21 లక్షల నివాసాలున్నాయి. కానీ నల్లా కనెక్షన్లు 8.70 లక్షలు మాత్రమే. వీటిలో మీటర్లున్నవి 1.6 లక్షలే. నల్లాల సంఖ్య గణనీయంగా పెరగాలి. అదేసమయంలో వేలాదిగా ఉన్న అక్రమ నల్లాలను క్రమబద్ధీకరించాల్సి ఉంది. ప్రతి నల్లాకు మీటరు తప్పనిసరి చేసేందుకు ఆగస్టు ఒకటి నుంచి నగర వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తాం’ అని మున్సిపల్ మంత్రి కె.తారకరామారావు చెప్పారు. శనివారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో వాటర్‌బోర్డు కార్యకలాపాలపై మంత్రి సుదీర్ఘ సమీక్ష జరిపారు. జలమండలి ఎండీ దానకిశోర్, డెరైక్టర్లు సత్యనారాయణ, రామేశ్వర్‌రావు, శ్రీధర్‌బాబు, ఎల్లాస్వామి, సూర్యనారాయణ, కృష్ణ పాల్గొన్నారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
40 శాతం బిల్లులు రావడంలేదు...
జలమండలి పరిధిలో ప్రస్తుతం వంద లీటర్ల నీటిని సరఫరా చేస్తే 60 లీటర్లకే బిల్లు వసూలవుతోంది. 40 శాతం మేర బిల్లులు రావడంలేదు. బోర్డులో అంతర్గత లోపాలను సరిచేసుకొని వంద శాతం రెవెన్యూ సాధించడంపై తొలుత దృష్టి సారిస్తాం. సమీప భవిష్యత్‌లో నీటి చార్జీలు తప్పకుండా పెంచుతాం. ఈ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. భోలక్‌పూర్ కలుషిత జలాల ఘటనలను పునరావృతం కానివ్వం. నగరంలో జలమండలి సరఫరా చేస్తున్న నీటి నాణ్యత విషయంలో రాజీలేదు. ఇటీవల చిలకలగూడా రైల్వే క్వార్టర్స్‌లో బల్క్ సప్లై ట్యాంకులో రైల్వే అధికారులు క్లోరినేషన్ చేయకపోవడం వల్లే కలుషిత జలాల సమస్య ఉత్పన్నమైంది. నాణ్యతలేని నీటిని ప్రజలకు సరఫరా చేస్తే బల్క్ సప్లైదారులపై చర్యలు తీసుకొంటాం.
భూగర్భజలాల పెంపునకు ‘జలభాగ్యం’
గ్రేటర్ పరిధిలో అడుగంటిన భూగర్భ జలాలను పెంచేందుకు హరితహారం స్ఫూర్తితో ‘జలభాగ్యం’ కార్యక్రమానికి త్వరలో శ్రీకారం చుడతాం. బోర్డులోని ప్రాజెక్టు, నిర్వహణ, రెవెన్యూ, సింగిల్‌విండో వంటి విభాగాల్లో పారదర్శక సేవలకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసీజర్‌ని ప్రవేశపెడతాం. జలమండలిలో పనిచేస్తున్న 4వేల మంది ఉద్యోగులు తమ ఫీడ్‌బ్యాక్ ఇచ్చేందుకు ఇన్నోవేషన్ టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తాం. ఫైరింజన్లకు నీటి కొరత లేకుండా ప్రత్యేక నీటి ఫిల్లింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. నవంబరు 1న వాట ర్‌బోర్డు వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తాం. గడిచిన వేసవిలో విపత్కర పరిస్థితుల్లోనూ నగరానికి నీటి కొరత లేకుండా చూసిన బోర్డు ఉద్యోగులకు అభినందనలు.
మ్యాన్‌హోళ్లకు జియోట్యాగింగ్
గ్రేటర్ పరిధిలో అధికారిక లెక్కల ప్రకారం ప్రస్తుతం ఉన్న మ్యాన్‌హోళ్లు 2.75 లక్షలు. కానీ ఈ సంఖ్య 4 లక్షలు ఉంటుందని నా అంచనా. మ్యాన్‌హోళ్ల లెక్క తేల్చేందుకు నగరవ్యాప్తంగా ప్రత్యేక సర్వే నిర్వహించి జియోట్యాగింగ్ ద్వారా వీటిని అనుసంధానిస్తాం. సీవరేజి కార్మికులు మ్యాన్‌హోళ్లలో దిగి ప్రాణాలు కోల్పోకుండా ఎయిర్‌టెక్ యంత్రాలతోనే మురుగు సమస్యలను పరిష్కరి స్తాం. ప్రమాదవశాత్తు మరణించిన సీవరేజి కార్మికులకు ప్రస్తుతం ఉన్న రెండు లక్షల రూపాయల పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచుతాం.
నీటి వేళలపై ఎస్‌ఎంఎస్ సందేశం
నీటి సరఫరా వేళలపై వినియోగదారులకు సంక్షిప్త సందేశం అందించేందుకు లైన్‌మెన్లకు స్మార్ట్‌ఫోన్లు అందజేస్తాం. కూకట్‌పల్లి డివిజన్‌లో అమలు చేస్తున్న ఈ విధానాన్ని త్వరలో గ్రేటర్ వ్యాప్తంగా అమలు చేస్తాం.