గ్రేటర్‌లో నివాస సముదాయాలు 23 లక్షలు..
నల్లా కనెక్షన్లు 8.65 లక్షలే...
రాబోయే మూడేళ్లలో ఇంటింటికీ నల్లాల ఏర్పాటుకు
నిధులు, నీళ్లే కీలకం సర్కారు ముందు పెద్ద సవాల్
నగరంలో చుక్క నీటి కోసం అష్టకష్టాలు పడుతున్న కాలనీలెన్నో. బస్తీలు, మురికి వాడల్లోనైతే పరిస్థితి మరీ దుర్భరం. నీటి కోసం రాత్రింబవళ్లు ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ప్రభుత్వం ఇటీవల భరోసా ఇచ్చింది. వచ్చే మూడేళ్లలో ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇవ్వడమే ధ్యేయమని ప్రకటించింది. అయితే..అసలు మూడేళ్లలో నగరంలో ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ సాధ్యమేనా అన్న ప్రశ్న తలెత్తుతోంది. గ్రేటర్ పరిధిలో 23 లక్షల నివాస సముదాయాలుంటే...8 లక్షల 65 వేల నల్లా కనెక్షన్లే ఉన్నాయి. అంటే ఇంకా 14 లక్షలకు పైన నల్లా కనెక్షన్లు అవసరముంది. ఈ లెక్కన మూడేళ్లలో ఇంత పెద్ద సంఖ్యలో నల్లాలివ్వడం సాధ్యమా...సాధ్యమైనా నీళ్లు ఎక్కడి నుంచి తెస్తారు..నిధులెలా సమకూరుస్తారనేది తెలియకుండా ఉంది. -సాక్షి, సిటీబ్యూరో
సిటీబ్యూరో: గ్రేటర్ నగరం శరవేగంగా విస్తరిస్తోంది. నివాస సముదాయాలూ అంతకంతకూ పెరుగుతూనే ఉన్నా యి. ప్రస్తుతం నగర విస్తీర్ణం 625 చదరపు కిలోమీటర్లు. ఈ పరిధిలో సుమారు 23 లక్షల నివాసాలున్నాయి. కానీ నల్లా కనెక్షన్లున్నవి 8.64 లక్షలు మాత్రమే. ఈ పరిస్థితి నేపథ్యంలో రాష్ట్ర సర్కారు పెద్దలు ప్రకటించిన ఇంటింటికీ నల్లా స్వప్నం సాకారమయ్యేందుకు ఎంతో సమయం పట్టనుందని స్పష్టమవుతోంది. ప్రస్తుతం సింగూరు, మంజీరా జలాశయాల నుంచి నగరానికి నీటిసరఫరా పూర్తిగా నిలిచి పోయింది. జంటజలాశయాలు గండిపేట్, హిమాయత్‌సాగర్‌లలోనూ నీటినిల్వలు క్రమంగా నిండుకుంటున్నా యి. ప్రస్తుతం కృష్ణా మూడు దశలు, గోదావరి మంచినీటి పథకం మొదటి దశలే మహానగర దాహార్తిని తీరుస్తున్నాయి. ఈ రెండు జలాశయాలపైనే రోజురోజుకూ ఒత్తిడి పెరుగుతోం ది. మరోవైపు జీహెచ్‌ఎంసీ పరిధిలో వెయ్యికిపైగా కాలనీలు, ఔటర్‌రింగ్‌రోడ్డుకు లోపలున్న 164 పంచాయతీల పరిధిలో ఇంటింటికీ నీటిని అందించేందుకు అవసరమైన నీటిసరఫరా పైపులైన్లు, స్టోరేజి రిజర్వాయర్లు అందుబాటులో లేవు. దీంతో శివారు ప్రాంతాల వాసులు తాగడానికి, ఇతరత్రా అవసరాలకు బోరుబావులు, ప్రైవేటు ఫిల్టర్‌ప్లాంట్లు, ట్యాంకర్ నీళ్లను ఆశ్రయించక తప్పని పరిస్థితి నెలకొంది. ఆయా ప్రాంతాల వాసులు నెలకు నీటిఅవసరాలకే రూ.100 కోట్లు ఖర్చు చేస్తున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థంచేసుకోవచ్చు. పలు శివారు ప్రాంతాల్లో ఇంటి అద్దెలతో సమానంగా ఒక్కో కుటుంబం నీటి కోసమే నెలకు నాలుగు నుంచి ఐదువేలు ఖర్చు చేయాల్సిన దుస్థితి నెలకొంది.
నీళ్లు...నిధులేవి..?
ప్రస్తుతం నగర జనాభా సుమారు కోటికి చేరువైంది. కానీ నల్లా కనెక్షన్లు 8.64 లక్షలు మాత్రమే. ఇక వీటికి రోజువారీగా 349.360 మిలియన్ గ్యాలన్ల నీటిని జలమండలి అరకొరగా సరఫరా చేస్తోంది. ఇందులో 259.260 ఎంజీడీల జలాలను కృష్ణా మూడోదశ నుంచి,మరో 86 ఎంజీడీలు గోదావరి(ఎల్లంపల్లి)నుంచి, 4.100 ఎంజీడీల జలాలను హిమాయత్‌సాగర్ నుంచి సేకరించి నగరం నలుమూలలకు సరఫరా చేస్తోంది. కానీ రోజువారీగా గృహ, వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు నీటి డిమాండ్ 732 మిలియన్ గ్యాలన్లు అవసరం. అంటే డిమాండ్‌కు, సరఫరాకు అంతరం 382.64 ఎంజీడీలుగా ఉండడం గమనార్హం. ఈ మొత్తంలో నీటిని సేకరించడం జలమండలికి తలకుమించిన భారమవుతోంది. మరోవైపు ఔటర్ రింగురోడ్డుకు లోపలున్న సుమారు 164 గ్రామపంచాయతీల పరిధిలో తాగునీటి సరఫరా వ్యవస్థ ఏర్పాటుకు సుమారు రూ.6 వేల కోట్లు అంచనా వ్యయం కానుంది. ఈస్థాయిలో నిధులు ఎవరు సమకూర్చుతారు అన్నదే ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. ఇంటింటికీ నల్లాలు ఏర్పాటు చేసేందుకు అవసరమైన నీళ్లు, నిధులు లేకపోవడమే ఇప్పుడు సర్కారు ముందు నిలిచిన పెద్ద సవాలు.
ఇలా చేస్తేనే పరిష్కారం....
గోదావరి మంచినీటి పథకం ద్వారా తక్షణం 172 ఎంజీడీల జలాలను నగరానికి సరఫరా చేయడంతోపాటు నగర శివార్లలోని మల్కాపురం, శామీర్‌పేట్ ప్రాంతాల్లో రూ.4 వేల కోట్ల అంచనా వ్యయంతో భారీ మంచినీటి స్టోరేజి రిజర్వాయర్లను యుద్ధప్రాతిపదికన నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కృష్ణా, గోదావరి నదుల్లో వరద అధికంగా ఉన్నప్పుడు ఈ జలాశయాలకు నీటిని తరలించి నిల్వచేయాలి. మరోవైపు ఔటర్‌రింగ్ రోడ్డుకు లోపలున్న 164 గ్రామపంచాయతీల పరిధిలో అవసరమైన స్టోరేజి రిజర్వాయర్లు, పైపులైన్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలి. ఇందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం సమకూరిస్తే ‘ఇంటింటికీ నల్లా’ స్వప్నం సాకారమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
ఇంటింటికీ నల్లా.. అంత ఈజీ కాదు!
Published Sun, Feb 21 2016 11:42 PM | Last Updated on Sun, Sep 3 2017 6:07 PM
Advertisement
Advertisement