నిధులు, నీళ్లు, ఉద్యోగాలేవీ?
సర్కార్‌కు టీసీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి సూటిప్రశ్న
పథకాలపై ప్రభుత్వానిది ప్రచార ఆర్భాటమని విమర్శ
5.3 శాతం జీడీపీ వృద్ధిరేటు అంచనా సత్యదూరమని వ్యాఖ్య
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమమే నిధులు, నీళ్లు, ఉద్యోగాల కోసం సాగిందని, ఏడాది టీఆర్‌ఎస్ పాలనలో ఈ కీలకాంశాలు ఏమయ్యాయని టీసీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి 9 నెలలు గడిచినా రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటా, పూర్తిస్థాయిలో నిధులు, ఉద్యోగాల భర్తీ వంటి విషయాల్లో టీఆర్‌ఎస్ విఫలమైందని మండిపడ్డారు. మంగళవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ శాసనసభాపక్షం తరఫున ఆయన మాట్లాడారు. పథకాల అమలు విషయంలో ప్రభుత్వం ప్రచారార్భాటం తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. ‘మనం ఎక్కాల్సిన రైలు సంవత్సర కాలం లేటుగా నడుస్తోంది’ అని జీవన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. వ్యవసాయ రంగం దెబ్బతిన్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ 5.3 శాతం జీడీపీ వృద్ధిరేటు సాధిస్తామని గవర్నర్ ప్రసంగంలో పేర్కొనడం సత్యదూరమన్నారు.
నాగార్జునసాగర్ జలాలను ఆంధ్రకు వదిలే విషయంలో గవర్నర్ వద్ద రెండు రాష్ట్రాల సమావేశాన్ని ఏపీ సీఎం చంద్రబాబు ఏర్పాటు చేశారని, నీళ్లు ఇచ్చినప్పుడే రాష్ట్రానికి రావాల్సిన 53.89 శాతం విద్యుత్ వాటా ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఎందుకు అడగలేదని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. సీలేరు, కృష్ణపట్నం నుంచి వాటా సాధించేందుకు కృషిచేయాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు.
ప్రాణహిత ఎత్తు తగ్గకుండా చూడాలి
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ఎత్తు 152 అడుగులు ఉంటేనే 160 టీఎంసీలను ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని...అందువల్ల ఈ డ్యాం ఎత్తు తగ్గకుండా కేంద్రం, మహారాష్ట్రపై ఒత్తిడి తేవాలన్నారు. ప్రాజెక్టు పరిధిలో మహారాష్ర్టలో 1,800 ఎకరాలే ముంపునకు గురవుతున్నందున ఎకరానికి రూ. 10 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లిస్తే సరిపోతుందన్నారు.
కరువు మండలాలను ప్రకటించాలి...
రాష్ట్రంలో కరువు తీవ్ర రూపం దాలుస్తున్నందున ప్రభుత్వం వెంటనే కరువు మండలాలను ప్రకటించి రైతులను ఆదుకోవాలని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఇన్‌పుట్ సబ్సిడీపై వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇచ్చిన హామీ 3-4 నెలలు గడిచినా ఆచరణకు నోచుకోలేదని...దీనిపై ఇప్పుడైనా ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. మిషన్ కాకతీయ మంచి కార్యక్రమమే అయినప్పటికీ అది ప్రారంభమవుతుందో తెలియట్లేదని, దీన్ని వేగవంతం చేయాలని సూచించారు. రైతులకు పొక్లెయిన్లు సమకూరిస్తే వారే ట్రాక్టర్లతో చెరువుల్లోని పూడికను తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.