Murder Attempt On Armoor MLA Jeevan Reddy At His House Banjara Hills - Sakshi
Sakshi News home page

తలుపు తట్టి.. తలకు తుపాకీ గురిపెట్టి..

Published Tue, Aug 2 2022 9:28 AM | Last Updated on Wed, Aug 3 2022 1:54 AM

Murder Attempt On Armoor MLA Jeevan Reddy At His House Banjarahills - Sakshi

బంజారాహిల్స్‌(హైదరాబాద్‌): నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. నిందితుడు తుపాకీతో కాల్చేందుకు యత్నిస్తుండగా ఎమ్మెల్యే కేకలు వేయడంతో పరుగున వచ్చిన గన్‌మెన్లు నిందితుడిని చాకచక్యంగా అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నం.12లోని వేమిరెడ్డి ఎన్‌క్లేవ్‌లో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది.

ఆర్మూర్‌ నియోజకవర్గం మాకునూరు మండలం కల్లాడి సర్పంచ్‌ లావణ్య... పంచాయతీ నిధుల దుర్వినియోగం ఆరోపణలపై సస్పెన్షన్‌కు గురయ్యారు. ఎమ్మెల్యేతో మొదటినుంచీ విభేదాలు ఉండటం, భార్యపై సస్పెన్షన్‌ ఎత్తివేత ప్రయత్నాలు ఫలించకపోవడంతో.. ఆమె భర్త, టీఆర్‌ఎస్‌కే చెందిన పెద్దగాని ప్రసాద్‌గౌడ్‌ ఎమ్మెల్యేపై కక్ష పెంచుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన్ను అంతం చేయాలనే పథకం వేసినట్లు సమాచారం. 

నాలుగురోజులు రెక్కీ 
పథకంలో భాగంగా ప్రసాద్‌గౌడ్‌ రెండు తుపాకులు, ఒక బటన్‌ చాకు (కత్తి)ని కొనుగోలు చేశాడు. 4 రోజుల పాటు బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే నివాసం వేమిరెడ్డి ఎన్‌క్లేవ్‌ వద్ద రెక్కీ నిర్వహించాడు. ఎమ్మెల్యే ఏ సమయంలో వస్తున్నాడు.. ఎవరెవరు ఇంటి వద్ద ఉంటారు.. అన్నీ పరిశీలించాడు. సోమ వారం రాత్రి 7.30 గంటల సమయంలో ఎమ్మెల్యే ఇంటికి వచ్చి సెక్యూరిటీ గార్డులు, గన్‌మెన్లతో కొద్దిసేపు మాట్లాడాడు. ఎమ్మెల్యే నియోజక వర్గానికే చెందిన సర్పంచ్‌ భర్త కావడం, గతంలో కూడా ఇలాగే వచ్చాడు కదా అని గన్‌మెన్లు, సెక్యూరిటీ గార్డులు ఇంట్లోకి అనుమతించారు.  

నేరుగా బెడ్‌రూమ్‌కు వెళ్లి.. 
రాత్రి 8.30 గంటల వరకు మెయిన్‌ హాల్‌లో తచ్చాడిన ప్రసాద్‌గౌడ్‌.. గన్‌మెన్లు, సెక్యూరిటీ గార్డులు సమీపంలో లేకపోవడం చూసి నేరుగా లిఫ్ట్‌లో మూడో అంతస్తులోని జీవన్‌రెడ్డి పడక గది వద్దకు వెళ్లి తలుపు కొట్టాడు. ఆ సమయంలో నిద్రిస్తున్న ఎమ్మెల్యే తలుపులు తీసి ఎదురుగా నిలబడ్డ ప్రసాద్‌ ను చూసి షాక్‌ తిన్నారు. ‘ఏంటి? ఏం కావాలి?’ అని అడుగుతుండగానే ప్రసాద్‌ తుపాకీతో కాల్చేందుకు ప్రయత్నించాడు.

ఎమ్మెల్యే పెద్దగా కేకలు వేస్తూ, తలుపులు మూస్తూ తప్పించుకునే ప్రయ త్నం చేశారు. ఆయన అరుపులు విన్న గన్‌మెన్లు, సె క్యూరిటీ గార్డులు అక్కడికి చేరుకుని ప్రసాద్‌ను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఎమ్మె ల్యేకు ప్రాణహాని తప్పింది. ఒక చేతిలో నాటు తుపాకీ, ఇంకో చేతిలో కత్తితో ఉన్న ప్రసాద్‌ను అదు పులోకి తీసుకున్న గన్‌మెన్లు వెంటనే బంజారా హిల్స్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు నిందితుడిని అదుపులోకి తీసుకొని రెండు తుపాకులు, కత్తి, నిందితుడి కారు (టీఎస్‌ 16ఎఫ్‌ బీ 9517) స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్‌ 307, ఆయుధ చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

షాక్‌కు గురైన జీవన్‌రెడ్డి 
నిందితుడు నేరుగా బెడ్‌రూమ్‌ వరకు వచ్చి కాల్చేందుకు యత్నించడంతో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మధ్యాహ్నం వరకు కూడా కోలుకోలేదు. ఏ మాత్రం అటూఇటూ అయినా ప్రాణాలు పోయేవని కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.   

చదవండి: హైదరాబాద్‌లో భారీ వర్షం, నగర ప్రజలకు పోలీసుల సూచన

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement