
నేడే సీఎం గృహ ప్రవేశం
సాక్షి, హైదరాబాద్: బేగంపేటలో కొత్తగా నిర్మించిన ముఖ్యమంత్రి అధికార నివాస భవన సముదాయం గృహ ప్రవేశానికి ముస్తాబరుుంది. గురువారం తెల్లారుజామున 5.22 గంటల ముహుర్తానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దంపతులు గృహ ప్రవేశం చేస్తారు. శాస్త్రోక్తంగా ఈ ఉత్సవ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలతో దైవ ప్రవేశం, యతి ప్రవేశం, గోవు ప్రవేశం, నివసించేవారి ప్రవేశం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సర్వ మత ప్రార్థనలు చేస్తారు.
గవర్నర్ నరసింహన్ దంపతులు, చినజీయర్ స్వామి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రస్తుతమున్న రెండు భవనాలతో పాటు కొత్తగా నిర్మించిన సీఎం నివాసం, కార్యాలయం, మీటింగ్ హాల్ భవనాల సముదాయానికి ‘ప్రగతి భవన్’గా నామకరణం చేశారు. వివిధ వర్గాలతో సమాలోచనలు జరిపే సమావేశ మందిరానికి ‘జనహిత’ పేరును ఖరారు చేశారు. ప్రభుత్వ విధానాల రూపకల్పన, కార్యక్రమాల అమలు తదితర అంశాలపై రైతులు, కార్మికులు, ఉద్యోగులు, కుల వృత్తుల వారు, తదితర వర్గాలతో జనహిత భవనంలో సీఎం ముఖాముఖి సమావేశాలు జరుపుతారు.